మీ జీతం రూ. 50 వేల కంటే తక్కువగా ఉందా.??.. ఇలా ప్లాన్ చేస్తే మంచి కారును సొంతం చేసుకోవచ్చు.!!
మధ్య తరగతి ప్రజలకు కారు కొనడం అనేది ఓ డ్రీమ్. అందుకే తమ సంపాదనలో కొంత మొత్తాన్ని సేవింగ్స్ చేస్తూ కారు కొనాలని ఆశపడుతుంటారు. అయితే కారు కొనాలంటే కనీసం రూ. 5 లక్షలైనా పెట్టాల్సిందే. అంతకంటే తక్కువ ధరలో కారు కొనలేరు. అయితే తక్కువ జీతం వస్తున్నా సరిగ్గా ప్లాన్ చేస్తే.. మంచి కారును మీరు సొంతం చేసుకోవచ్చు.
భారత్‌లో చాలా మంది ఉద్యోగుల నెలవారీ ఆదాయం రూ. 50 వేల కంటే తక్కువగా ఉంది. అలాంటి వారు ఎలాంటి కారును కొనుగోలు చేయవచ్చు.? తమకు వచ్చే ఆదాయంలో కారును కొనుగోలు చేయాలనే నిర్ణయం సరైనదేనా.. ఇంకా వారి బడ్జెట్‌కు సరిపోయే కారును ఎలా ఎంచుకోవాలి.. ఈ కథనంలో తెలుసుకోండి.

ఉదాహరణకు మీ జీతం రూ. 50,000 అనుకుందాం. ఈ జీతంలో మీ కారును ఏ బడ్జెట్‌లో కొనుగోలు చేయవచ్చు.. మీ జీతం రూ. 45 వేల నుంచి రూ. 50 వేల వరకు ఉంటే, విశ్లేషకుల ప్రకారం మీరు రూ.5 నుండి 6 లక్షల రేంజ్‌లో కారును కొనుగోలు చేయవచ్చని చెబుతున్నారు.
అదే సమయంలో మీ జీతం రూ. 45,000 కంటే తక్కువగా ఉందని అనుకుందాం. అప్పుడు మీరు సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేయడం మంచి నిర్ణయం. ఈ జీతంలో మీరు కొత్త కారు కొనాలనే ఆలోచన చేయవద్దని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ ఆదాయంలో కొత్త కారును కొనుగోలు చేస్తే, వారు EMI చెల్లించలేరు సరికదా కారు మెయింటెనెన్స్ చేయడం కూడా కష్టమంటున్నారు.

ఇంకా కొత్త కార్లపై పన్నులు ఎక్కువగా ఉంటాయి. రూ. 45,000 కంటే తక్కువ ఆదాయం ఉన్నవారు ఈ ట్యాక్స్ కట్టలేరు. రూ. 50 వేల కంటే ఎక్కువ సంపాదిస్తే రూ. 5 నుంచి 6 లక్షల ధరలో కార్లను కొనుగోలు చేయవచ్చు. అయితే కారును ఎంచుకునే ముందు మీరు చేయవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఎంత చెల్లించాలనుకుంటున్నారో ముందే ఓ నిర్ణయానికి రావాలి.
ఈ ఫార్ములా పేరు 20-4-10. మీరు ఈ ఫార్ములాను అనుసరించి కొత్త కారును కొనుగోలు చేస్తే, మీరు ఎటువంటి సమస్య లేకుండా EMI చెల్లించగలరు. 20-4-10 ఈ ఫార్ములా గురించి చెప్పాలంటే.. మీరు కారును కొనుగోలు చేసినప్పుడు మీరు కారు ధరలో 20 శాతం ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. అంటే కారు ధర రూ. 5 లక్షలు అయితే మీరు చేతి నుండి అడ్వాన్స్‌గా కనీసం రూ. లక్ష చెల్లించగలగాలి.

తదుపరి 4 అంటే మీరు నాలుగేళ్లలో EMI చెల్లించగలగాలి. మీ అర్హత ప్రకారం మీరు నెలవారీ EMI చెల్లించవచ్చు. తదుపరి 10 అంటే 10 శాతం అంటే మీ EMI.. మీ నెలవారీ ఆదాయంలో 10 శాతం మాత్రమే ఉండాలి. అలాంటప్పుడు రూ. 50,000 జీతం పొందే వ్యక్తి.. కారు EMIగా నెలకు రూ. 5,000 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
కాబట్టి మీరు 20 శాతం డౌన్ పేమెంట్‌తో రూ. 5 లక్షల విలువైన కారును కొనుగోలు చేసి, 4 సంవత్సరాల పాటు నెలకు రూ. 5,000 EMI చెల్లిస్తే, ఆ కారు పూర్తిగా మీ సొంతం అయినట్లే.. కాబట్టి ఇందుకోసం మీరు ముందుగా చేయవలసిన పని ఒకటి ఉందని గమనించాలి.
మీ నెలవారీ ఆదాయంలో 10 శాతం EMIగా ఎంత చెల్లించాలో లెక్కించాలి. ఆ తర్వాత మీరు కారు కోసం ఎంత డౌన్ పేమెంట్ చెల్లించాలో గణాంకాలు వేసుకోండి. ఉదాహరణకు మీకు రూ. 50,000 జీతం వస్తున్నట్లయితే.. రూ.5 లక్షల విలువైన కారును సొంతంగా కొనుగోలు చేయాలనుకుంటే, అడ్వాన్స్‌గా రూ.3 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.
ఆ తర్వాతే వచ్చే నాలుగేళ్ల పాటు నెలకు రూ. 5,000 చెల్లించి మీరు కారును సొంతం చేసుకోవచ్చు. మీరు తక్కువ EMIతో కారును కొనుగోలు చేయాలనుకుంటే, మీరు మరింత డౌన్ పేమెంట్ చెల్లించాలి. కాబట్టి కొత్త కారును కొనుగోలు చేసేటప్పుడు సరిగ్గా ప్లాన్ చేసుకోవడం ద్వారా మీ బడ్జెట్ ధరలో కారు సొంతం చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








