బైక్ యాక్సిడెంట్స్ కు 10 కారణాలు?
దేశంలో ఎక్కడ చూసినా, ఏ వార్తా పత్రిక చదివినా రోడ్డు ప్రమాదాలు (యాక్సిడెంట్స్) ఎక్కువగా కన్పిస్తున్నాయి. అయితే అవి జరగడానికి ప్రధాన కారణం సరైన అవగాహన లేకపోవడమే. శిక్షణ లేకుండా, ఎలా పడితే అలా నడపడం ప్రమాదాలకు తప్పక దారి తీస్తుంది.
బైక్ నడిపేటప్పుడు రోడ్డు ప్రమాదాలు (యాక్సిడెంట్స్) జరగడానికి చాలా కారణాలు ఉంటాయి. చెప్పుకుంటూ పోతే కారణాల జాబితా కర్ణుని చావుకు సవాలక్ష కారణాలు అన్న విధంగా ఉంటుంది.
బైక్ యాక్సిడెంట్స్ జరగడానికి గల 10 కారణాలను క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.....

1. లేన్ కట్టింగ్ :
త్వరగా గమ్య స్థానం చేరాలనే ఆత్రుతతో కొందరు వాహన చోదకులు ఇష్టానుసారంగా, నిర్లక్షంగా, నిబంధనలను అతిక్రమించి లేన్ లను దాటుతుంటారు. ఇలాంటి సమయంలో చుట్టు ప్రక్కల నుంచి వచ్చే వాహనాలను గమనించక ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు.

2. సెల్ ఫోన్ వాడటం :
డ్రైవింగ్ లో సెల్ ఫోన్ వాడటం అత్యంత ప్రమాదకరం. చాలా మంది ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మెడను వంచుకుని వాహనం నడుపుతుంటారు. మరి కొందరు ఇయర్ ఫోన్లను చెవిలో ఉంచుకుని సంగీతం వింటూ నడుపుతుంటారు. దీంతో హారన్ సౌండ్ వినిపించక ప్రమాదాల భారిన పడుతారు.

3. అధిక వేగం :
బైక్ నడపడం అంటే ఒక ఆటలాగా భావిస్తుంటారు. అధిక వేగంగా నడపటం కొందరికి సరదా కూడా. ఇలా అధిక వేగంతో నడుపుతూ, అదుపుతప్పి చాలా మంది ప్రమాదాల భారిన పడటమే కాక మృత్యువును చవిచూస్తున్నారు.

4. మలుపును అంచనా వేయకపోవడం :
ఘాట్ రోడ్డుపై మలుపులు చాలా ప్రమాదకరమైనవి. మలుపులను గమనించి వాహనాన్ని నియంత్రించుకోవాలి. మలుపును అంచనా వేయడంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే రోడ్డుపై నుంచి వాహనం జారిపోవటం ఖచ్చితం.

5. వంగి రైడ్ చేయడం :
కొంత మంది వాహన చోదకులకు ముఖ్యంగా యువతకు వంగి రైడ్ చేయటం చాలా ఇష్టం. సాధారణ మలుపు వద్ద కూడా ఎక్కువ వంగి లీనింగ్ డ్రైవ్ చేయటం వల్ల యువత ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు.

6. బంధం కోల్పోవడం :
మట్టి రోడ్లు చాలా వదులుగా ఉంటాయి. వాటిపై బైక్ నడిపేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడైతే రోడ్డుకు, వాహన చక్రానికి మధ్య బంధం (ట్రాక్షన్) తెగిపోతుందో వెంటనే మనం ప్రమాదాన్ని ఎదుర్కోవలసి వస్తుంది.

7. విన్యాసాలు చేయడం :
మిత్రుల ముందో ఇంకొకరి ముందో తమ బలాన్ని నిరూపించుకోవడం కోసం ఇష్టం వచ్చినట్లు కొందరు విన్యాసాలు చేస్తుంటారు. సాధారణంగా విన్యసాలు నిపుణుల పర్యవేక్షణలో చేయబడుతాయి. వాటిని అనుసరిస్తే ప్రమాదం జరగడం ఖాయం.

8. మద్యం సేవించి నడపడం :
దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం మద్యం సేవించి వాహనం నడపటం వలనే జరుగుతున్నాయి. మద్యం సేవించి నడపటం మనకే కాదు ఇతరులకూ ప్రమాదకరమే. మత్తు వల్ల మెదడు కంట్రోల్ తప్పి సక్రమంగా నడపలేక పోతాం. ఇది ప్రమాదాలకు దారి తీస్తుంది.

9. కండీషన్ లో లేని బైక్ :
ప్రమాదాలకు కొన్ని సార్లు మనుషులే కాదు వాహనాలు కారణం అవుతుంటాయి. సరైన కండీషన్ లో లేని బైక్ పట్టాలు తప్పిన రైలు బండితో సమానం. బైక్ కండీషన్ లో లేకుంటే ప్రమాదాన్ని కోరి తెచ్చుకున్నట్లే.

10. డీహైడ్రేషన్ :
ప్రమాదాలకు వాహన చోదకుడి శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం కూడా ఒక కారణమే. ఇలాంటి ప్రమాదాలు వేసవిలో ఎక్కువగా జరుగుతుంటాయి. కాబట్టి వేసవిలో బైక్ నడుపుతున్నప్పుడు అవకాశం ఉన్నపుడల్లా నీరు, శీతల పానీయాలు తీసుకోవడం ఉత్తమం.

బైక్ నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. నిబంధనలను తప్పక పాటించండి....
హెల్మెట్ ధరించండి......
జాగ్రత్తగా డ్రైవ్ చేయండి.......
హ్యావ్ ఎ సేఫ్ జర్నీ.........


Click it and Unblock the Notifications