Ayodhya Ram Mandir ‘అయోధ్య' వెళ్లాలనుకునే భక్తులకు గుడ్‌న్యూస్.. ఆ రోజు నుంచి 1000కి పైగా ప్రత్యేక రైళ్లు..
భారత ప్రభుత్వం ఉత్తరప్రదేశ్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న అయోధ్య రామ మందిరం నిర్మాణం దాదాపు పూర్తి కావస్తోంది. కొత్త ఏడాదిలో ఈ ఆలయం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో దేశం నలుమూలల నుంచి తరలి వచ్చే భక్తుల సౌకర్యార్థం అయోధ్యకు 100 రోజుల పాటు 1000 ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
కొత్త సంవత్సరం 2024 జనవరి 22న అయోధ్య శ్రీరామ మందిరం(Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవం కానుంది. ఆ రోజున రాముడి విగ్రహ ప్రతిష్ఠకు ముహూర్తం ఖరారైంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి. మరుసటి రోజు నుంచి సాధారణ భక్తులకు శ్రీరాముడి దర్శన భాగ్యం కల్పించనున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జనవరి 22న శ్రీరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ నేపథ్యంలో అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి రామ దర్శనానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. వివిధ ప్రాంతాల నుంచి అయోధ్యకు 1000 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.
కాగా మొదటి 100 రోజుల వరకూ ఈ స్పెషల్ ట్రైన్స్(Special Trains To Ayodhya Ram Mandir) అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ, డిమాండ్ దృష్ట్యా రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. జనవరి 19వ తేదీ నుంచి ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. శ్రీ రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి మూడు రోజుల ముందు నుంచే ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకురానుంది.

మూడు రోజుల ముందు నుంచే రైళ్లను అందుబాటులోకి తీసుకురావడం వల్ల భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అయోధ్యకు చేరుకునే అవకాశముంటుందని రైల్వే అధికారులు భావించారు. ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, పుణే, కోల్‌కత్తా, నాగ్‌పూర్, లక్నో, జమ్మూతో పాటు పలు నగరాల నుంచి స్పెషల్ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది రైల్వే శాఖ. డిమాండ్ ఆధారంగా రైళ్ల శాఖ మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.
జనవరి 23 నుంచి రామ మందిరాన్ని భక్తులు దర్శించుకోవచ్చు. కాగా డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆయా రూట్లలో ఎన్ని రైళ్లు నడపాలో రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంటుంది. మరో వైపు కొన్ని రైళ్లను ప్రత్యేకంగా భక్తుల కోసం రిజర్స్ చేసి ఛార్టెర్డ్ సర్వీసులు కూడా అందించనున్నట్లు అధికారులు తెలిపారు.

అయోధ్యకు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అయోధ్య రైల్వే స్టేషన్‌ని ఆధునికంగా అధికారులు అభివృద్ధి చేస్తున్నారు. రైల్వే స్టేషన్‌కు ప్రతిరోజూ 50 వేల మంది ప్రయాణికులు వచ్చినా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. జనవరి 15 నాటికి రైల్వే స్టేషన్ పనులు పూర్తి కానున్నాయి.
ప్రయాణికుల డిమాండ్‌కి తగ్గట్టుగా క్యాటరింగ్ సర్వీస్‌లను అందించేందుకు IRCTC ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. భక్తుల కోసం కొన్ని చోట్ల ప్రత్యేకంగా ఫుడ్ స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. అంతే కాకుండా అయోధ్య రామ మందిరానికి వచ్చే భక్తులను ఆకర్షించేందుకు అధికారులు మరో వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. యాత్రికులు సరయు నదిపై విహరించేందుకు విద్యుత్ పడవల్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు.
కాగా అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి సంబంధించి ఇప్పటికే ట్రస్ట్ సభ్యులు.. ప్రధాని మోదీకి ఆహ్వానం అందించారు. ప్రధానితో పాటు మరో 6 వేల మంది గెస్ట్‌లకు ఆహ్వానం అందింది. ప్రముఖ పూజారులు, దాతలతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా వీరిలో ఉన్నారు. 2023 ఆగస్టులో రామ మందిర విగ్రహానికి మోదీ శంకుస్థాపన చేయగా.. మూడున్నరేళ్ల తర్వాత ఈ ఆలయం పూర్తి కావస్తోంది.


Click it and Unblock the Notifications








