పొగమంచు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
భారత్‌లో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నిర్లక్ష్యం, అతివేగం కారణంగా రోజు ఎక్కడో చోట ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా కర్ణాటకలో ఘోర ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కూలీలు మరణించారు. చిక్‌బళ్లాపూర్‌లో రోడ్డుపైన ఆగి ఉన్న ట్యాంకర్‌ను టాటా సుమో వాహనం అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో 13 మంది వలస కూలీలు మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

దసరా సందర్భంగా శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన కూలీలు ఇంటికి వచ్చారు. అనంతరం బెంగళూరులోని హొంగసంద్రకు వెళ్తున్నారు. ఉదయం సమయంలో పొగమంచు కారణంగా టాటా సుమో వాహన డ్రైవర్‌కు రహదారి సరిగా కనిపించలేదని తెలుస్తోంది. దీంతో అతివేగంగా ట్యాంకర్‌ను ఢీకొట్టాడు.
ఈ ఘోర ప్రమాదంలో టాటా సుమో వాహనంలో 14 మంది ప్రయాణం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే 5 ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో 8 మంది చిక్‌బళ్లాపూర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు.

పొగ మంచు దట్టంగా కురుస్తున్న సమయంలో ప్రయాణంలో చాలా రిస్క్‌తో కూడుకున్నది. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది అనుభవజ్ఞులైన డ్రైవర్లు సైతం కొంత ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. అయితే పొగమంచు కురుస్తున్న ప్రాంతాలున్న రోడ్లపై ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ కింది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.

లోభీమ్ లైట్లనే వినియోగించాలి: పొగమంచు కురుస్తున్న ప్రాంతాల్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు హైభీమ్ లైట్లను వినియోగిస్తారు. హైభీమ్ లైట్ల ఎక్కువ కాంతినిస్తాయని భావిస్తారు. అయితే ఈ హైభీమ్ లైట్ల కారణంగా వచ్చే కాంతి పొగమంచులో కలిసిపోతుంది. అదే లోభీమ్ లైట్లను వినియోగించడం ద్వారా ఎదురుగా వస్తున్న వాహనాల డ్రైవర్లకు మీ ఉనికి తెలుస్తుంది. ఫలితంగా అప్రమత్తం అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు పొగమంచు ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు కచ్చితంగా ఫాగ్ లైట్లను వినియోగించాలి.
వార్నింగ్ లైట్ : దట్టమైన పొగమంచు ప్రాంతాల్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వార్నింగ్ లైట్‌ను ఆన్ చేసుకొని ప్రయాణించడం ఉత్తమం. ఫలితంగా మనకు ఎదురుగా, వెనుకన వచ్చే వాహనదారులు మన వాహనం ఉనికిని గుర్తించే అవకాశం ఉంటుంది. మరియు పొగమంచు సమయంలో వీలైనంత నెమ్మదిగా డ్రైవింగ్ చేయడం చాలా ఉత్తమం. మరియు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.

రేడియం లైటింగ్స్ : ప్రస్తుతం చాలా వరకు రాష్ట్ర, జాతీయ రహదారులు రేడియం లైటింగ్స్‌ను కలిగి ఉంటున్నాయి. ఇవి రోడ్లను రెండుగా విభజిస్తాయి. మరియు బ్రిడ్జి, ఇరుకైన రోడ్డు వద్ద అదనపు రేడియమ్ లైటింగ్, తెలుపు, పసుపు రంగుల్లో రోడ్డు మార్కులుంటాయి. వీటిని సరిగా అనుసరించడం ద్వారా ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు.
ఢీ ఫాగర్ : వాహనం యొక్క అద్దాల మీద ఉన్న మంచును కరిగించేందుకు వినియోగిస్తారు. శీతాకాలంలో పొగమంచు కారణంగా కారు ముందు, వెనుక అద్దాల మీద తెల్లగా మంచు పేరుకుపోతుంది. ఫలితంగా రోడ్డును సరిగా చూసేందుకు అవకాశం ఉండదు. ఈ మంచును ఆటోమేటిక్‌గా కరిగించేందుకు చాలా కార్ల తయారీ సంస్థలు ఢీ ఫాగర్‌ను అందిస్తున్నాయి. దీని కారణంగా అద్దం కాస్త వేడెక్కి అక్కడున్న మంచును కరిగిస్తుంది.

మ్యూజిక్ సౌండ్ తగ్గించుకోండి : పొగ మంచులో ప్రయాణం చేస్తున్న సమయంలో వీలైనంత వరకు అప్రమత్తంగా ఉండాలి. పాటలు వింటూ డ్రైవింగ్ చేయడం మంచి అనుభూతిని కలిగించినా.. ఇలాంటి రోడ్లపై మ్యూజిక్ సిస్టమ్ సౌండ్‌ను వీలైనంత తక్కువగా ఉంచాలి. లేదా పూర్తిగా సౌండ్ ఆఫ్ చేసినా మంచిది.
పొగమంచు దట్టంగా కురుస్తు్న్న ప్రాంతాల్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ముందున్న వాహనాలతో తగినంత దూరాన్ని పాటించండి. ముందున్న వాహనం ఏదైనా ప్రమాదానికి గురైనా, వెంటనే స్పందించి అప్రమత్తం అయ్యేందుకు సమయం ఉంటుంది. ముందున్న వాహనాలను టెయిల్ లైట్లు, బ్రేక్ లైట్ల ద్వారా అనుసరించవచ్చు.

హెడ్‌లైట్ల పనితీరు : పొగమంచు, రాత్రి వేళల్లో ప్రయాణానికి ముందు వాహనం హెడ్‌లైట్ల పనితీరును తనిఖీ చేయాలి. ఒక లైట్ మాత్రమే పనిచేస్తున్న సమయంలో ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. సింగిల్ హెడ్‌లైట్ కారణంగా.. వాహనం టూ వీలర్ అని పొరపాటు పడే అవకాశం ఉంది. ఆ కారణంగా ప్రమాదాలు జరగవచ్చు.


Click it and Unblock the Notifications








