40 ఏళ్ల మహిళ చేసిన ఈ సాహసానికి ప్రశంసల జల్లు కురుస్తోంది.. ఇంతకీ ఏం చేసిందంటే?
ఒకప్పుడు వంటింటికి మాత్రమే పరిమితమైన ఆడవాళ్ళు ఇప్పుడు ప్రపంచాన్ని సైతం అవలీలగా ఏలుతున్నారు. అన్ని రంగాల్లోనూ తమదైన ముద్ర వేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఈ రోజు ఎందులోనూ పురుషులకంటే తక్కువ కాదని నిరూపించుకుంటూనే ఉన్నారు. దీనికి సంబంధించిన చాలా సంఘటనలు ఇదివరకే మనం చాలా చదువుకున్నాం. ఇప్పుడు ఇలాంటి మరో సంఘటన వెలుగులోకి వచ్చింది.

భారతదేశంలో మహిళలు వాహనాలను డ్రైవ్ చేస్తారనే విషయం అందరికి తెలుసు, అయితే హెవీ వెహికల్స్ డ్రైవ్ చేయడంలో మహిళలు ఇంకా కొంత వెనుకబడే ఉన్నారు. కానీ కొంతమంది మహిళలు ఈ సాహసాలను కూడా చేసేస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లోని మహిళలు ఈ రంగంలో ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే భారతీయ మహిళలో ఇందులో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నారు.

ఇటీవల కేరళ కొట్టాయంకు చెందిన నలభై ఏళ్ల జలజా రతీష్, కేరళ నుంచి కార్గోలారీని నడుపుకుంటూ కశ్మీర్ ట్రిప్‌నూ అప్ అండ్ డౌన్ పూర్తి చేసి అందరిని ఆశ్చర్యపరుస్తోంది. డ్రైవింగ్ చేయాలంటే తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ అవసరం, ఇందుకోసం కొందరు మహిళలు డ్రైవింగ్ స్కూల్‌కు కూడా వెళుతున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ పొందుతున్నారు.

జలజకు చిన్నప్పటి నుంచి డ్రైవింగ్ చేయడం అంటే ఎంతో ఇష్టం. అంతే కాకుండా కొత్త కొత్త ప్రదేశాలను చూడటం అంటే మరింత ఇష్టం. ఈమె తనకు పెళ్లి అయినా తరువాత భర్త ప్రోత్సాహంతో డ్రైవింగ్ నేర్చుకుంది. అయితే ఇంటి పనులు చూసుకుంటూనే డ్రైవింగ్‌పై మంచి పట్టు రావడంతో తానె సొంతంగా ఎక్కడికైనా వెళ్లాలని చాలా రోజులుగా ఎదురు చూస్తూనే ఉంది.

అయితే తన భర్తకు ముంబైకు ట్రాన్స్‌పోర్ట్ ఆర్డర్ రూపంలో అవకాశం వచ్చిన తరువాత, ఆమె భర్తతో కలిసి బయలు దేరింది. ఈ ట్రిప్పులో తానే స్టీరింగ్ పట్టి డ్రైవింగ్ చేసింది. ఇందులో ఎటువంటి ఇబ్బంది లేకుండా ముంబై ట్రిప్పు చేసి గొప్ప అనుభూతిని పొందింది. మరో సారి కూడా ముంబై వెళ్లే అవకాశం లభించింది. ఇది కూడా ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తయ్యింది. దీనితో ఆమెకి తనపైన తనకు నమ్మకం కుదిరింది. దీనితోనే సూదూర ప్రాతాలకు వెళ్లాలని నిర్ణయించుకుంది.

ఈ ప్రణాళికలో భాగంగానే ఆమె తన భర్త రతీష్, మరో బంధువు అనీష్‌తో కలిసి 2022 ఫిబ్రవరి 2 న పెరంబదూర్ నుంచి ప్లైవుడ్ లోడ్ చేసుకుని అక్కడి నుంచి తన ప్రయాణం ప్రారంభించి మొదట పూణేలో డెలివరీ ఇచ్చింది. అక్కడ నుంచి మరో లోడ్ తో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యాణ, పంజాబ్ రాష్ట్రాల మీదుగా మొత్తానికి కాశ్మీర్ చేరుకుంది. ఇది విన్న అందరూ కూడా ఆశ్చర్యానికి లోనవ్వడమే కాకుండా ఆమెను ఎంతగానో ప్రశంసించారు.

కాశ్మీర్ చేరుకున్న జలజ అంతటితో ఆగకుండా మళ్ళీ కాశ్మీర్ నుంచి అక్కడక్కడా లోడ్స్ వేసుకుంటూ డెలివరీలు అందిస్తూ కేరళకు చేరుకుంది. నిజంగా ఒక మహిళా ఇది చేయడం అనేది సాధారణమైన విషయం కాదు. జలజ తన ఈ ట్రిప్ మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు చాలా వైరల్ అయ్యింది. చాలామంది జలజ సాహసాన్ని గొప్పగా పొగుడుతున్నారు. ఇది చూసిన చాలామంది మహిళలు తాము కూడా ప్రయత్నిస్తామని ముందుకు వస్తున్నారు.
జలజ తన ప్రయాణంలో గత కొన్నేళ్లుగా ఎన్నెన్నో అద్భుతమైన ప్రదేశాలను చూసినట్లు చెప్పుకొచ్చింది. దాదాపుగా తానూ సినిమాల్లో చూసిన విధంగా ఉంటుందని తన అనుభూతిని తెలిపింది. తన ప్రయాణంలో పెద్దగా ఖర్చు కాలేదని కూడా చెప్పింది. ఎందుకంటే తమ లారీలోనే వంట చేసుకోవడం, నిద్రపోవడం వంటివి చేయడం వల్ల అనవసరమైన ఖర్చులు రాలేదని చెప్పింది. అయితే తన ప్రయాణంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు ఆమె చెప్పింది. అయితే త్వరలోనే తాను మరో ఇలాంటి ట్రిప్ చేయడానికి ప్లాన్ వేస్తున్నట్లు చెప్పింది.
ఇదిలా ఉండగా కేరళలోని కొచ్చిలోని తొప్పుంపాడికి చెందిన 71 సంవత్సరాల జె.రాధామణి ఒకటి రెండు కాదు 11 వాహనాలను సులభంగా డ్రైవ్ చేసి అందరిని అబ్బురపరుస్తోంది. ఈమె ఎక్స్‌కవేటర్లు, ఫోర్క్‌లిఫ్ట్‌లు, క్రేన్లు, రోడ్ రోలర్లు, ట్రాక్టర్లు, కంటైనర్ ట్రెయిలర్లు, బస్సులు, లారీలు మరియు మరికొన్ని రకాల వాహనాలను నడపడానికి లైసెన్స్ పొందింది. కావున ఈ వాహనాలను ఈమె ఈ అన్ని వాహనాలను కూడా అధికారికంగా డ్రైవ్ చేయగలదు. నిజానికి రాధామణి తన 30 ఏళ్ల వయసులో తొలిసారిగా కారు డ్రైవ్ చేయడం నేర్చుకుంది. డ్రైవింగ్ నేర్చుకోవడానికి తన భర్త ప్రేరణ చాలా వరకు ఉందని ఆమె చెప్పుకొచ్చింది. ఈ కారణంగానే ఈమె చాలా త్వరగా డ్రైవింగ్ నేర్చుకోగలిగింది.

ఇవన్నీ గమనిస్తూ ఉంటె మహిళా సమాజం ఇప్పుడిప్పుడే అభివృద్ధివైపు వేగంగా అడుగులు వేస్తోందని స్పష్టంగా తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఇందులో మరింత మంది మహిళలు తమ ప్రతిభను తప్పకుండా ప్రపంచానికి చాటి చెబుతారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు, మనం కూడా వారు ఇలాంటి మరింత ఉన్నత గొప్ప సాహసాలను చేయాలను మనస్ఫూర్తిగా ఆశిద్దాం..


Click it and Unblock the Notifications








