పెట్రోల్ కంటే డీజిల్ ఇంజిన్లే ఎక్కువ కాలుష్యం సృష్టించడానికి 5 కారణాలు ఇవే
దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు పెద్ద పెద్ద నగరాలు కూడా కాలుష్యం కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. పట్టణాల్లో పెరిగిన వాహన రద్దీ ఈ కాలుష్యానికి ముఖ్య కారణాలలో ఒకటి. నగర కాలుష్యంలో దాదాపు 20-22 శాతం వాటా వాహనాలదే అని అంచనా. ఈ నేపథ్యంలో పెట్రోల్ వాహనాలతో పోలిస్తే డీజిల్ ఇంజిన్‌లు ఎందుకు ఎక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తున్నాయనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో తలెత్తుతోంది.
డీజిల్ ఇంజిన్ల నుంచి వెలువడే పొగ, వాయువులు పెట్రోల్ ఇంజిన్‌ల కంటే చాలా హానికరం. దీనికి ప్రధాన కారణం డీజిల్ వాహనాల నుంచి నైట్రోజన్ ఆక్సైడ్, పార్టిక్యులేట్ మ్యాటర్ వంటి ప్రమాదకరమైన కాలుష్య కారకాలు అధిక మొత్తంలో విడుదల కావడమే. డీజిల్ ఇంజిన్లు ఎక్కువ కాలుష్యాన్ని రిలీజ్ చేయడానికి గల ముఖ్యమైన 5 కారణాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం.

ఎక్కువ నైట్రోజన్ ఆక్సైడ్ ఉద్గారం
డీజిల్ ఇంజిన్లు ఎక్కువ కాలుష్యాన్ని రిలీజ్ చేసేందుకు ముఖ్య కారణాలలో ఒకటి నైట్రోజన్ ఆక్సైడ్ వాయువు అధికంగా విడుదల కావడం. డీజిల్ ఇంజిన్‌లో ఇంధనం అధిక కంప్రెషన్ రేషియో, ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద మండుతుంది. ఈ అధిక ఉష్ణోగ్రత వద్ద, గాలిలో ఉండే నైట్రోజన్, ఆక్సిజన్ కలిసిపోయి నైట్రోజన్ ఆక్సైడ్‌లను ఉత్పత్తి చేస్తాయి. ఈ నైట్రోజన్ ఆక్సైడ్ వాయువు పొగమంచు, యాసిడ్ వర్షానికి ప్రధాన కారణమవుతుంది. ఇది శ్వాసకోశ వ్యాధులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుంది.
అధిక పార్టిక్యులేట్ మ్యాటర్ ఉద్గారాలు
డీజిల్ ఇంజిన్ల నుంచి వచ్చే నల్లటి పొగ, అంటే పార్టిక్యులేట్ మ్యాటర్ లేదా సూక్ష్మ కణాలు చాలా హానికరం. పెట్రోల్‌తో పోలిస్తే డీజిల్ బరువైనది, తక్కువ బాష్పీభవనం చెందే ఇంధనం. దీని దహనం సమయంలో ఇంధనం పూర్తిగా మండిపోకపోవడం వల్ల నల్లటి పొగ లేదా సూక్ష్మ కణాలు ఏర్పడతాయి. ఈ సూక్ష్మకణాలు చాలా చిన్నవిగా ఉండడం వల్ల ఊపిరితిత్తులలోకి లోతుగా వెళ్లిపోతాయి. దీనివల్ల క్యాన్సర్, ఆస్తమా, గుండె జబ్బులు వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

అసమాన దహన ప్రక్రియ
పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌లలో దహన ప్రక్రియ భిన్నంగా ఉండటం కూడా కాలుష్యానికి ఒక కారణం. పెట్రోల్ ఇంజిన్‌లో స్పార్క్ ప్లగ్ ద్వారా ఇంధనం మండుతుంది, దీనివల్ల దహనం సమానంగా, పూర్తిగా జరుగుతుంది. కానీ డీజిల్ ఇంజిన్‌లో అధిక వేడి గాలిలోకి ఇంధనం ఇంజెక్ట్ చేయబడుతుంది.. దీనివల్ల దహనం అసమానంగా జరుగుతుంది. ఈ అసమాన దహనం కారణంగానే డీజిల్ ఇంజిన్ల నుండి మండని ఇంధనం, పార్టిక్యులేట్ మ్యాటర్ కణాలు ఎక్కువగా విడుదల అవుతాయి.
ఎక్కువ సల్ఫర్ కారణంగా అధిక కాలుష్యం
డీజిల్ ఇంధనంలో సహజంగానే పెట్రోల్ కంటే సల్ఫర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ అధిక సల్ఫర్ శాతం కారణంగా డీజిల్ ఇంజిన్ల నుంచి సల్ఫర్ డయాక్సైడ్ కూడా అధికంగా విడుదల అవుతుంది. ప్రస్తుత రోజుల్లో అల్ట్రా-లో సల్ఫర్ డీజిల్‌ను ఉపయోగిస్తున్నప్పటికీ, డీజిల్ బరువైన రసాయన నిర్మాణం కారణంగా అన్ని రకాల కాలుష్య కారకాలను (NOx, PM, SOx) ఒకేసారి నియంత్రించడం చాలా కష్టమైన పని.

ల్యాబ్, రియల్ డ్రైవింగ్‌లో తేడా
ఆధునిక డీజిల్ ఇంజిన్‌లలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు అనేక పరికరాలు ఉన్నప్పటికీ, అవి నిజ జీవితంలో సరిగా పనిచేయవు. ఆధునిక డీజిల్ కార్లలో డీజిల్ పార్టిక్యులేట్ ఫిల్టర్ (DPF), క్యాటలిటిక్ రిడక్షన్ సిస్టమ్ (SCR) వంటి పరికరాలు అమర్చుతారు. ల్యాబ్ టెస్టులలో ఇవి మంచి ఫలితాలు ఇస్తాయి.
అయితే, నగర ట్రాఫిక్‌లో లేదా తక్కువ వేగంతో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈ సిస్టమ్స్ సరిగా పనిచేయడానికి అవసరమైన సరైన ఉష్ణోగ్రత ను చేరుకోలేవు. ముఖ్యంగా ఫిల్టర్‌ను శుభ్రం చేసే సమయంలో ఎక్కువ కాలుష్యం విడుదల అవుతుంది.


Click it and Unblock the Notifications








