హరిద్వార్‌లో వరద ఉద్ధృతిలో చిక్కుకున్న యాత్రికుల బస్సు.. 53 మంది సేఫ్..
వర్షాకాలం స్టార్ట్ అయ్యాక దేశవ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. భారీ వానలకు ఆయా రాష్ట్రాల్లో విపరీతంగా వరదలు వచ్చి చాలా ప్రాంతాలు వరద నీటిలోనే ఉన్నాయి. ఈ క్రమంలో కోట్ల విలువ చేసే కార్లు కూడా కొట్టుకుపోయాయి. ప్రభుత్వ సర్వీసు బస్సులు సైతం వరదనీటిలో చిక్కుకుపోయాయి.
నిన్న(సెప్పెంబర్ 15) ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా 53 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు నది వరదలో చిక్కుకుంది. కాగా ప్రయాణికులందరినీ విజయవంతంగా రక్షించినట్లు సమాచారం. ప్రయాణికులంతా నేపాల్ నుంచి హరిద్వార్‌కు బయలుదేరిన యాత్రికులని సమచారం.

నిన్న ఉదయం బిజ్నోర్- హరిద్వార్ ఎన్‌హెచ్ 74 రోడ్డులో నేపాల్ నుంచి హరిద్వార్‌కు 53 మంది యాత్రికులతో బస్సు వెళ్తుండగా కొత్వాలి నది ప్రవాహానికి వరదలో చిక్కుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ, ప్రొక్లైన్ యంత్రాల సాయంతో అందులోని 53 మంది యాత్రికులను వరద నుంచి సురక్షితంగా బయటకు తరలించారు.
కొండ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా హరిద్వార్ మరియు ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లా సరిహద్దులో ప్రవహించే కొత్వాల్ నది నీటి మట్టం అకస్మాత్తుగా పెరగడంతో చాలా బస్సులను వరదలు ముంచెత్తాయి. ఈ మేరకు వరద ఉధృతి పెరుగుతుండటంతో స్థానికులు బయటకు రావద్దని పోలీసులు సూచిస్తున్నారు.

నది వరదలో చిక్కుకున్న బస్సులోని ప్రయాణికులు మోకాళ్ల లోతు నీటిలో నడుచుకుంటూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండటాన్ని వీడియోలో చూడవచ్చు. నది నీటిలో బస్సు పాక్షికంగా మునిగిపోయింది. అధికారులు యాత్రికులను రక్షించిన అనంతరం జేసీబీ యంత్రం సాయంతో నది వరదలో చిక్కుకున్న బస్సును బయటకు తీశారు.
బస్సు డ్రైవర్‌తో సహా మొత్తం 53 మంది యాత్రికులను రక్షించామని, స్థానిక పోలీసు అధికారి తెలిపారు. అందరూ సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. గురువారం(సెప్టెంబర్ 14) అర్థరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి హరిద్వార్ జిల్లాలోని రాణిపూర్, జ్వాలాపూర్ మార్కెట్, మోతీ బజార్ సహా నగరంలోని పలు ప్రాంతాలు జలదిగ్భందంలో ఉన్నాయి.

గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లోని పలు ప్రధాన రహదారులు మూసుకుపోయాయి. రోడ్డు మార్గాల్లో కొండచరియలు విరిగిపడిన సంఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. భారీ వర్షాల కారణంగా నిర్జన ప్రదేశాల్లో చిక్కుకున్న పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని రోజులు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని వాతావారణ శాఖ సూచిస్తోంది.
కాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సెప్టెంబర్ 15 నుంచి 17 వరకు 64.5 మిమీ నుంచి 115.6 మిమీ వరకు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న ప్రాంతాల్లో "ఆరెంజ్" అలర్ట్ కూడా వాతావరణ శాఖ జారీ చేసింది.
సెప్టెంబర్ 18 వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఉత్తరప్రదేశ్‌లోనే మాత్రమే కాకుండా ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్, నైనిటాల్, చంపావత్, చమోలి, బాగేశ్వర్ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుందని డెహ్రాడూన్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ విక్రమ్ సింగ్ తెలిపారు. ఇందుకోసం సంబంధిత ప్రాంతాల జిల్లా కలెక్టర్లు విపత్తు నియంత్రణ గదులను ఏర్పాటు చేశారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.


Click it and Unblock the Notifications








