ఏం జరుగుతోంది అసలు.. 900 కార్ ఇంజిన్‌లు మాయం! ఐదేళ్లుగా బ్రహ్మాండంగా ప్లాన్ చేసిన దొంగతనాలు!
దక్షిణ కొరియా బ్రాండ్ కియా మోటార్స్ (kia Motors) ఇండియాలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, మహీంద్రా వంటి కార్ల తయారీదారులకు బలమైన పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. భారతదేశం అంతటా ఇప్పుడు కియా కార్లు కనిపిస్తున్నాయి. కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలోని కార్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి దేశీయంగా విక్రయాలు జరుపుతూనే అంతర్జాతీయంగా మంచి మార్కెట్ కలిగిన దేశాలకు సైతం ఎగుమతులు చేస్తుంది. ఏపీ నుంచి రోడ్డు, వాయు, సముద్ర మార్గాల ద్వారా వాహనాలు రవాణా చేయడానికి అనుకూలమైన వాతావరణం ఉండటం కారణంగా కియా ఇండియా ప్రతి ఏడాది కస్టమర్ల డిమాండ్ మేరకు అధునాతన ఫీచర్స్ కలిగిన లేటెస్ట్ డిజైన్‌లతో కార్లను తయారు చేసి విక్రయిస్తుంది.
అయితే ఇప్పుడు కియా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవడానికి ఒక ప్రధాన కారణం ఉంది. శ్రీసత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి కంపెనీ ప్లాంట్‌లో 900 కారు ఇంజిన్లు దొంగతనానికి గురయ్యాయి. దీనికి సంబంధించి కియా ఇండియా అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గత ఐదు సంవత్సరాలుగా ఈ చోరీ జరిగినట్లు మార్చి 19న అధికారులకు ఫిర్యాదు చేయగా, ఇప్పుడు ఈ విషయం బయటకు తెలిసింది.

పోలీసు అధికారులు తమకు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా పేర్కొన్న దాని ప్రకారం, ఇంజిన్ దొంగతనాలు 2020 సంవత్సరంలో మొదలయ్యాయి. ఇది గత ఐదేళ్లుగా నిరంతరం జరుగుతుంది. ఇప్పటి వరకు దాదాపు 900 ఇంజిన్‌లు చోరీకి గురైనట్లు తెలిపారు. ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌కు ఇంజిన్‌లు వచ్చే రూట్‌తో పాటు లోపలికి వచ్చాక కూడా జరిగినట్లు ప్రాథమిక విచారణ ద్వారా తెలిసిందని పెనుకొండ సబ్-డివిజనల్ పోలీస్ అధికారి వై వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
సాధారణంగా, సంస్థ లోపల నుంచి ఏ చిన్న వస్తువు కూడా బయటకు తీసుకెళ్లడం సాధ్యం కాదు. అలాంటి పరిస్థితుల్లో ఇన్ని ఇంజిన్‌లు చోరీకి గురవడం గమనార్హం. ఈ నేపథ్యంలో దొంగతనాల వెనుక లోపల పనిచేస్తున్న వారి హస్తం కూడా ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్లాంట్‌లో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన వారితో పాటు ప్రస్తుతం అక్కడే పనిచేస్తున్న వారిని విచారించే పనిలో వారు ఉన్నారు.
ఇప్పటికే కొన్ని కీలకమైన తప్పులను వారు గుర్తించినట్టు సమాచారం. సాధారణంగా కియా మోటార్స్‌కు చెందిన ఇంజిన్లు ఇతర దేశాల నుంచి సముద్ర మార్గం ద్వారా తమిళనాడులోని చెన్నై పోర్టుకు మొదటగా చేరుకుంటాయి. ఆ తరువాత వాటిని ప్రత్యేక కంటైనర్లలో రోడ్డు మార్గం ద్వారా డైరెక్ట్‌గా కియా ప్లాంట్ ఆవరణలో ఉన్నటువంటి హ్యుండాయ్ గ్లోవిస్‌కు తరలిస్తారు. ఆ గోదాముల్లో భద్రపరచిన ఈ ఇంజిన్లను అవసరమైనప్పుడు పరిశ్రమకు పంపుతారు.
ఇంజిన్ల డేటా పరంగా తేడాలు రావడంతో చోరీకి గురైనట్లు తెలిసింది. కొద్ది రోజుల క్రితం దీన్ని గుర్తించిన సంస్థ ఎండీ, సీఈఓ విషయం తీవ్రతను అర్థం చేసుకొని, గోప్యంగా దర్యాప్తు చేయాలంటూ గ్వాంగులీ జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. అయితే, ఇది అధికారికంగా ఫిర్యాదు చేసిన తరువాత మాత్రమే దర్యాప్తు కొనసాగించగలమని పోలీసులు తెలిపారు. అందుకే మార్చి 19న, కియా ఇండస్ట్రియల్ ఏరియా పోలీస్‌స్టేషన్‌లో అధికారికంగా కేసు నమోదు చేశారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








