ఒకే ఒక్కడు సినిమా తరహాలో విజయ్ తన అభిమాని చేయి విరిచాడా? కారు డోర్ సరిగ్గా మూయకపోతే ఇలాగే జరుగుతుంది!
నటుడు విజయ్ సినిమాలే కాకుండా ఇప్పుడు రాజకీయాల్లో కూడా చాలా చురుకుగా ఉన్నారు. గతంలో కొత్తగా రాజకీయ పార్టీని ప్రారంభించారు. తాజాగా వాటి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల కోయంబత్తూరులో ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఈ సదస్సు కోసం విజయ్ తన కారులో కోయంబత్తూరుకు వెళుతుండగా జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటనలో ఆయన కారులో వెళ్తున్న క్రమంలో చాలా మంది అభిమానులు ఆయనను వెంబడిస్తున్నారు. అయితే ఈ సమయంలో ఒక అభిమాని చేయి తలుపులో చిక్కుకునే విధంగా వీడియోలో కనిపించింది. దీన్ని చూసిన కొందరు గతంలో టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో అర్జున్ హీరోగా వచ్చినటువంటి సెన్సేషనల్ మూవీ ఒకే ఒక్కడు సినిమాలో మాదిరి సీన్ లాగా ఉందని అనుకుంటున్నారు.
ఇక ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే, కోయంబత్తూరులో ఇటీవల జరిగిన ఒక ముఖ్యమైన రాజకీయ కార్యక్రమానికి ప్రముఖ నటుడు విజయ్ ప్రత్యేక విమానంలో వచ్చి చేరారు. తన రాజకీయ ఆరంభానికి ఇది మరొక కీలకమైన అడుగు కావడంతో, విజయ్ ఉత్సాహంగా అభిమానులను కలుసుకోవడానికి ముందుకు వచ్చారు. విమానాశ్రయానికి వచ్చిన వెంటనే, ఆయన ఫార్చ్యూనర్ కారులో రోడ్ మార్గంలో కార్యక్రమంలో పాల్గొనడానికి బయలుదేరారు.

విజయ్ ప్రయాణం మొదలైనప్పటి నుండే, వేలాది మంది అభిమానులు ఆయన కారును వెంబడించారు. నినాదాలతో, చేతులు ఊపుతూ, ఆయన ప్రయాణిస్తున్న కారును చుట్టుముట్టారు. ఆ సందడి మధ్య, విజయ్ ఆకస్మాత్తుగా తన కారు తలుపు కొద్దిగా తెరిచి మళ్ళీ వెంటనే మూసివేసిన దృశ్యం కెమెరాల్లో నమోదైంది. అయితే ఈ దృశ్యాలు ఒకే ఒక్కడు సినిమాలో రఘువరన్ తమ నాయకుని చేతిని కారు విండోలో నలిపినట్లుగా ఉందని కొంత మంది అన్నారు.
అయితే, సంఘటనను దగ్గరగా పరిశీలించినప్పటికీ, విజయ్ ఎవరికీ హాని చేయలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఒక అభిమాని విజయ్ కారు డోర్ తాకే ప్రయత్నం చేశాడు, అదే సమయంలో కారు డోర్ పూర్తిగా మూసుకోపోలేదని దాన్ని నడుపుతున్న డ్రైవర్ చెప్పడంతో, ఆయన డోర్‌ను మూసివేశారు. కానీ సరిగ్గా అదే టైంలో అభిమాని చెయి డోర్ దగ్గరగా వచ్చింది. అతనికి ఎలాంటి గాయం కాలేదు. డోర్‌ను మూసివేయాలని డ్రైవర్ డాష్‌బోర్డ్‌పై హెచ్చరిక చూపిస్తుంది.

విజయ్ కారు డోర్ సరిగ్గా మూయకపోవడంతో దాన్ని నడుపుతున్న డ్రైవర్‌కు డాష్‌బోర్డ్‌పై హెచ్చరిక చూపించింది. దీంతో డ్రైవర్ ఆ విషయాన్ని గ్రహించి విజయ్‌ను మీ వైపు డోర్ సరిగ్గా పడలేదు అని హెచ్చరించడంతో దాన్ని మూసివేశారు. కానీ అదే టైంలో అభిమాని చేయి కూడా డోర్ దగ్గరగా రావడంతో దీనిని కొందరు తప్పుగా అర్ధం చేసుకున్నారు. డోర్ ఒక్కసారి మూసిన సన్నివేశాన్ని వీడియోలో పదే పదే తెరుచుకుంటూ మూసుకుంటున్నట్లు చూపించారు.
విజయ్ కారు డ్రైవర్, కారును ముందుకు నడిపిస్తున్న సమయంలో, తలుపు సరిగా లాక్ కాలేదని గమనించి, కొద్దిగా ఆలస్యంగా తలుపును సరిచేశాడు. అదృష్టవశాత్తూ, ఈ మధ్యలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. కారు చుట్టూ భారీ సంఖ్యలో అభిమానులు, మద్దతుదారులు ఉన్న సమయంలో ఇటువంటి నిర్లక్ష్యం కొన్ని సార్లు పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి డోర్ లాక్ విషయంలో జాగ్రత్త వహించాలి.

ఇది కేవలం విజయ్ ఎదుర్కొన్న సమస్య మాత్రమే కాదు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఎప్పుడు బహిరంగంగా కార్యక్రమాల్లో పాల్గొన్నా, వారు ప్రయాణించే వాహనాలను అభిమానులు, నాయకులు తరచూ వెంబడించడం సాధారణ. తమ అభిమానాన్ని చాటించేందుకు, తమ అభిమానిని ఒక్కసారి చూడాలని, పలకరించాలనే ఆసక్తితో వారు వాహనాల వెంట పరుగులు తీయడం, బైకులపై వెంబడించడం జరుగుతూనే ఉంటుంది.


Click it and Unblock the Notifications








