ఆదిపురుష్ సినిమా విడుదలే కాలేదు.. అప్పుడే డైరెక్టర్‌కి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చేసిన ప్రొడ్యూసర్: ధర ఎంతంటే?
సినీపరిశ్రమలో గిఫ్ట్స్ అందించడం ఇటీవల కాలంలో సర్వ సాధారణంగా మారిపోయింది. సినిమా సక్సెస్ అయితే గిఫ్ట్స్ అందించడం, ఎక్కువ కలెక్షన్ చేస్తే గిఫ్ట్స్ అందించడం వంటివి గతంలో కూడా చాలా చూసాము. అయితే ఇప్పుడు సినిమా ఇంకా రిలీజ్ కాలేదు, కానీ అప్పుడే ఆ ప్రొడ్యూసర్ సినిమా డైరెక్టర్ కి ఒక కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చేసాడు.. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ ఇటీవల నటించిన కొత్త చిత్రం 'ఆదిపురుష్'. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నట్లు ఇప్పటికే తెలిసిపోయింది. అయితే ఈ సినిమా డైరెక్టర్ ఆయిన ఓం రౌత్‌కి, నిర్మాత భూషణ్ కుమార్ ఒక ఖరీదైన ఫెరారీ కారుని గిఫ్ట్ గా అందించాడు. ఈ కారులో ఓం రౌత్ చక్కర్లు కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోలను కూడా మీరు ఆర్టికల్ లో చూడవచ్చు.

ఈ వీడియోలో కనిపించే ఈ కారు ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో (Ferrari F8 Tributo) అని తెలుస్తోంది. దీని ధర అక్షరాలా రూ. 4.02 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఇది రెడ్ కలర్ లో చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఓం రౌత్ ముంబై వీధుల్లో ఈ సూపర్ కారుని డ్రైవ్ చేస్తూ కనిపించాడు.

ఫెరారీ F8 ట్రిబ్యూటో కారు 3.9-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ వి8 పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది 710 బిహెచ్‌పి పవర్ మరియు 770 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 2.9 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం మరియు 7.8 సెకన్లలో గంటకు 0 నుంచి 200 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇది గరిష్టంగా గంటకు 340 కిమీ వరకు వేగవంతం అవుతుంది. మొత్తం మీద పనితీరులో చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇది ఓం రౌత్ గ్యారేజీలో అత్యంత వేగవంతమైన కారుగా నిలిచింది.

ఫెరారీ సెప్టెంబరు 2022 లో F8 ట్రిబ్యూటో స్థానంలో సరికొత్త 296 GTB ని భర్తీ చేసింది. F8 ట్రిబ్యూటో 2020 లో తిరిగి భారతదేశానికి వచ్చింది. ఇది ఆధునిక డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. కావున ఎక్కువమంది సెలబ్రెటీలు ఈ కారుని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు.

ఇదిలా ఉండగా ఈ సంవత్సరం ప్రారంభంలో, భూషణ్ కుమార్ కార్తిక్ ఆర్యన్‌కు ఒక సరికొత్త మెక్‌లారెన్ GT ని గిఫ్ట్ గా అందించాడు. ఈ సూపర్ కార్ ధర రూ. 3.73 కోట్లు. కార్తీక్ ఆర్యన్ నటించిన భూల్ భూలయ్యా 2 సినిమా భారీ విజయాన్ని సాధించి రూ. 180 కోట్ల కంటే ఎక్కువ వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. ఈ కారణంగానే కార్తీక్ ఆర్యన్ ని ఖరీదైన కారు గిఫ్ట్ గా లభించింది.

కార్తిక్ ఆర్యన్ పొందిన ఈ మెక్‌లారెన్ జిటి సూపర్ కారు భారతదేశంలో విక్రయించబడిన మొదటి మెక్‌లారెన్ జిటి. అంతే కాకూండా ఇది భారతదేశంలో విక్రయించబడిన అత్యంత చౌకైన మెక్‌లారెన్ కారు. ఇది ఆరంజ్ కలర్ లో చాలా ఆకర్షణీయంగా ఉంది. అదే సమయంలో ఇది బ్లాక్ కలర్ అల్లాయ్ వీల్స్ మరియు రూఫ్ వంటివి బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

మెక్‌లారెన్ జిటి సూపర్ కారు 4.0-లీటర్ ట్విన్-టర్బో వి8 ఇంజన్ పొందుతుంది. ఇంజిన్ 611 బిహెచ్‌పి పవర్ మరియు 630 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కి జతచేయబడి ఉంటుంది. అదే సమయంలో పవర్ ఓపెన్ డిఫరెన్షియల్ ద్వారా పవర్ వెనుక చక్రాలకు మళ్లించబడుతుంది. ఈ కారు కేవలం 3.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. అదే సమయంలో ఇది 9 సెకన్లలో గంటకు 200 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇక దీని గరిష్ట వేగం గంటకు 327 కిలోమీటర్లు. ఇది అత్యంత వేగవంతమైన కార్లలో ఒకటి.
ఇక ఆదిపురుష్ సినిమా విషయానికి వస్తే, ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో, సీతగా కృతిసనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారు. కాగా ఈ సినిమా 2023 జనవరి 12 న సంక్రాంతి కానుకగా తెలుగు, కన్నడ, తమిళం, హిందీ మరియు మలయాళీ భాషల్లో విడుదల కానుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
మనం ఇప్పటికే గతంలో ఖరీదైన కార్లను గిఫ్ట్స్ గా ఇచ్చిన సందర్భాలు చాలా చూసాము. అయితే సినిమా విడుదలకు ముందే ఇంత ఖరీదైన కారుని గిఫ్ట్ గా ఇవ్వడం బహుశా ఇదే మొదటిసారి అయి ఉంటుంది. ఇప్పటికే భూషణ్ కుమార్ ఫెరారీ 458 ఇటాలియా, బెంట్లీ ఫ్లయింగ్ స్పర్, మెర్సిడెస్-మేబ్యాక్ S500 మరియు ఆడి R8 స్పైడర్ వంటి ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు.


Click it and Unblock the Notifications








