ISRO తర్వాత ప్రాజెక్ట్ గగన్‌యాన్.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా..?
ప్రపంచంలోని ఏ దేశమూ వెళ్లని, కనీసం వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోని చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసి. భారత్ చరిత్ర సృష్టించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపైన సాఫ్ట్ ల్యాండ్ చేసిన తొలి దేశంగా భారత్ నిలిచింది. అలాకే చంద్రుడిపైన సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగానే గుర్తింపు పొందింది.
జూలై 14న శ్రీహరికోట నుంచి ప్రయోగించిన చంద్రయాన్-3 ఆగస్టు 23న చంద్రుడి మీద సురక్షితంగా సాఫ్ట్ ల్యాండ్ అయింది. అనంతరం నాలుగు గంటల తర్వాత ల్యాండర్ నుంచి ప్రగ్యాన్ రోవర్ బయటకు వచ్చి.. చంద్రుడి మీద అడుగుపెట్టింది. సెకనుకు సెంటీమీటర్ చొప్పున ముందుకు సాగుతోంది. 14 రోజులపాటు చంద్రుడిపై వివిధ పరిశోధనలు చేయనుంది.

దీంతో ప్రపంచం మొత్తం భారత్ పనితీరును ప్రశంసించింది. దాంతోపాటు తర్వాత ఏం చేయబోతోందని ఆరా తీస్తోంది. ఫలితంగా అందరి దృష్టి భారత అంతరిక్ష సంస్థ ఇస్రో భవిష్యత్ ప్రాజెక్టులపైన పడింది. మానవుడిని అంతరిక్షంలోకి పంపేందుకు ఇస్రో గగన్‌యాన్ పేరిట ప్రణాళికలు సిద్ధం చేసింది. భూమి నుంచి మానవుడిని అంతరిక్షంలోకి పంపి, మరియు అతడిని సురక్షితంగా భూమికి తీసుకురావడానికి పక్కా ప్లాన్ అవసరం. ఇందుకోసం ఇస్రో తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.
అసలు ఏంటీ గగన్‌యాన్ : 2018 సంవత్సరంలో ప్రధాని మోడీ ఈ ప్రాజెక్టును ప్రకటించారు. గగన్‌యాన్ అంటే సంస్కృతంలో అంతరిక్ష నౌక అని అర్థం. ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపి, మూడు రోజులపాటు అక్కడే ఉంచి, అనంతరం వారిని సురక్షితంగా భూమికి తీసుకురావడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.

ఇస్రో ఈ గగన్‌యాన్ ప్రాజెక్టును 2021లో అమలు చేసేందుకు ప్లాన్ చేసింది. కానీ కరోనా సహా ఇతర కారణాలు వల్ల ఈ ప్రాజెక్టు వాయిదా పడింది. ముగ్గురు వ్యోమగాములను భూమికి సుమారు 400 కిలోమీటర్ల ఎత్తులో మూడు రోజులపాటు ఉంచి, వివిధ రకాల అధ్యయనాలు చేసి వారిని సురక్షితంగా భూమికి తీసుకురావడం ఈ ముఖ్య ఉద్దేశం.
ఇందులో రాకెట్‌తోపాటు, వ్యోమగాములకు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు వారు సురక్షితంగా భూమికి చేరుకొనేందుకు వీలుగా క్రూ ఎస్కేప్ సిస్టమ్ అనే కొత్త పరికరాన్ని రూపొందించారు. అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపించే ముందు.. మూడు సార్లు రిహార్సల్ చేయాలని ఇస్రో భావిస్తోంది. పేలోడ్‌లు లేకుండా ఒకసారి, పేలోడ్‌లతో రెండుసార్లు రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపిన తర్వాత మెరుగైన ఫలితాలు వస్తేనే వ్యోమగాములను అంతరిక్షంలోనికి పంపాలని ఇస్రో నిర్ణయించింది.

ఈ ప్రాజెక్టులోని వ్యోమగాముల కోసం ప్రత్యేకమైన స్పేస్ సూట్‌ను బెంగళూరు స్పేస్ ఎక్స్‌పో 2019లో ప్రదర్శించారు. దీన్ని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలోని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇందులో అమర్చిన సిలిండర్‌తో వ్యోమగామి సుమారు 60 నిమిషాలపాటు శ్వాస పీల్చుకొనేందుకు వినియోగించవచ్చు.
చంద్రయాన్-3లో ప్రయోగించిన ఎల్‌వీఎం-3 రాకెట్‌నే గగన్‌యాన్ ప్రాజెక్టులోనూ ఇస్రో వినియోగిస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.9023 కోట్లు కేటాయించింది. వ్యోమగాములకు శిక్షణ ఇచ్చేందుకు రష్యాలోని Glavkosmos ఒప్పందం కుదుర్చుకుంది. తొలి రెండు దశల శిక్షణను బెంగళూరులో, మూడో దశ శిక్షణను రష్యాలో ఇవ్వనున్నారు. ఈ గగన్‌యాన్ ప్రాజెక్టు విజయం సాధిస్తే.. అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపే నాలుగో అతిపెద్ద దేశంగా భారత్ అవతరిస్తుంది. అమెరికా, రష్యా, చైనా మాత్రమే మానవులను అంతరిక్షంలోకి పంపాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్‌మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








