ఢిల్లీ పేలుడు తర్వాత పాత కారు కొనాలంటే జంకుతున్న జనం..కొనుగోలు చేసే ముందు ఈ వివరాలు తప్పక చూసుకోండి!
తాజాగా ఢిల్లీలో జరిగిన పేలుడు (Delhi Blast) ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనపై జరిగిన దర్యాప్తులో పేలుడు కోసం ఉపయోగించిన కార్లు పాతవి (Used Cars) లేదా సెకండ్ హ్యాండ్ కార్లని తేలింది. ఇంకా ఆ కార్ల యజమాన్య హక్కుల బదిలీ (Ownership Transfer) సరిగా జరగలేదని కూడా వెల్లడైంది. ఈ ఒక్క ఘటన, మనం పాత కార్లను కొనుగోలు చేసేటప్పుడు లేదా విక్రయించేటప్పుడు డాక్యుమెంట్ల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో మరోసారి గుర్తు చేసింది.
కార్ల కొనుగోలు లేదా అమ్మకం సమయంలో యజమాన్య హక్కుల బదిలీ సరిగా జరగకపోతే, అసలు యజమాని అమాయకుడు అయినా చట్టపరమైన చిక్కుల్లో (Legal Problems) పడవచ్చు. మరి పాత కారు కొనేటప్పుడు, అమ్మేటప్పుడు తప్పనిసరిగా చెక్ చేసుకోవాల్సిన ముఖ్యమైన వివరాలు, RTO ప్రక్రియ వివరాలు తెలుసుకుందాం.

ఇటీవల జరిగిన ఢిల్లీ పేలుడు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. పాత కారు కొనే ముందు కారు ఆర్సీ, ఇన్సూరెన్స్, పీయూసీసీ, ఎన్‌ఓసీ తప్పనిసరిగా చెక్ చేయాలి. దేశంలో ప్రతి నెలా లక్షలాది యూజ్డ్ కార్లు కొనుగోలు, విక్రయాలు జరుగుతాయి. కానీ చాలా మంది డాక్యుమెంట్ల తనిఖీని కేవలం ఒక లాంఛనంగా భావిస్తారు. కొన్నిసార్లు పాత వాహనాలు తప్పుడు చేతుల్లోకి వెళ్తాయి. అసలు యజమాని ఎటువంటి తప్పు లేకుండానే ఇబ్బందుల్లో పడతాడు.
ఢిల్లీ పేలుడు వంటి కేసులలో కూడా ఇదే జరిగింది. కారు పాత యజమాని పేరుపైనే ఉంది. దీనివల్ల దర్యాప్తు సంస్థలు మొదట అతనిని అనుమానితుడిగా భావించాయి. కాబట్టి మీరు కూడా పాత కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, జాగ్రత్త! కారు ఆర్సీ, ఇన్సూరెన్స్, పీయూసీసీ, ఎన్‌ఓసీ, యాజమాన్య బదిలీ స్థితిని తప్పనిసరిగా చెక్ చేయండి. ఎందుకంటే మీ చిన్నపాటి నిర్లక్ష్యం భవిష్యత్తులో పెద్ద చట్టపరమైన సమస్యలకు కారణం కావచ్చు.

నేటి కాలంలో పాత లేదా యూజ్డ్ కారును కొనుగోలు చేయడం, అమ్మడం సర్వసాధారణం అయింది. కానీ ఈ ప్రక్రియలో అత్యంత ముఖ్యమైన దశ కారు యాజమాన్య హక్కుల బదిలీ. చాలా మంది డాక్యుమెంట్స్ వర్క్స్ పూర్తి చేస్తారు. కానీ కొందరు ఈ స్టెప్ విస్మరిస్తారు. కానీ గుర్తుంచుకోండి. ఇది ఎప్పుడూ వాయిదా వేయకూడని పని, ఎందుకంటే పేరు బదిలీ కాకపోతే భవిష్యత్తులో జరిమానా లేదా చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు.
పాత కారు అమ్మకం లేదా కొనుగోలు తర్వాత, అమ్మకందారుడు, కొనుగోలుదారుడు ఇద్దరూ కలిసి యాజమాన్య బదిలీ ప్రక్రియను పూర్తి చేయాలి. దీని కోసం ఆర్‌టీఓ ద్వారా నిర్దేశించిన కొన్ని ఫారాలు, పత్రాలను పూరించాలి, సమర్పించాలి.

యాజమాన్య బదిలీ కోసం ఫారం 29, ఫారం 30 ని పూరించడం అవసరం. ఒకవేళ వాహనం వేరే రాష్ట్రానికి బదిలీ చేయబడుతున్నట్లయితే, ఫారం 28 (ఎన్‌ఓసీ) అవసరం అవుతుంది. ఇది పాత ఆర్‌టీఓ నుంచి జారీ అవుతుంది. ఒకవేళ కారుపై లోన్ ఉన్నట్లయితే, రుణం చెల్లించబడిందని నిరూపించడానికి బ్యాంకు నుంచి ఫారం 35, ఎన్‌ఓసీ కూడా తీసుకోవాలి.
అమ్మకందారుడు వాహనం ఒరిజినల్ ఆర్సీ, చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్, పీయూసీసీని సమర్పించాలి. కొనుగోలుదారుడు తన గుర్తింపు, చిరునామా రుజువు అయిన ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడి ఇవ్వాలి. రెండు పార్టీలు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో అన్ని పత్రాలను ఫారాలతో పాటు ఆర్‌టీఓలో సమర్పించాలి. కొన్ని రాష్ట్రాలలో పాన్ కార్డ్ లేదా ఫారం 60/61, ట్రాఫిక్ పోలీసుల నుంచి క్లియరెన్స్ రిపోర్ట్ కూడా అడుగుతారు.
అన్ని పత్రాలు, ఫారాలను కొనుగోలుదారుడి కొత్త ఆర్‌టీఓ ఆఫీసులో సమర్పించాలి. ఈ పనిని మీరు Parivahan.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ప్రారంభించవచ్చు.. కానీ సంతకం చేసిన డాక్యుమెంట్స్ ఒరిజినల్ కాపీలను ఆర్‌టీఓలో ఆఫ్‌లైన్‌లో సమర్పించడం అవసరం.
కారు కొత్త యజమాని బదిలీ రుసుము, పెండింగ్‌లో ఉన్న పన్నులు, ఏవైనా పాత చలాన్లను చెల్లించాలి. అలా చేయకపోతే ఆర్‌టీఓ యాజమాన్య బదిలీని నిలిపివేయవచ్చు. అన్ని డాక్యుమెంట్ల ధృవీకరణ తర్వాత, ఆర్‌టీఓ కొత్త యజమాని పేరుపై కొత్త రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ను జారీ చేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ సాధారణంగా కొన్ని వారాల్లో పూర్తవుతుంది.


Click it and Unblock the Notifications








