పోలీసులకే ఝలక్ ఇచ్చిన ఏఐ కెమెరా.. అందరికీ ఒకే రూల్స్ అంటున్న AI.. ఫొటోలు వైరల్.!!
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి వాహనదారులకు నిత్యం పోలీసులు షాకిస్తుండగా.. ఈ సారి పోలీసులకే ఝలక్ ఇచ్చింది ఏఐ కెమెరా. రూల్స్ సామాన్యులకే కాదు పోలీసులకు కూడా అని తెలిసేలా.. సంబంధిత ఫొటోలను క్లిక్‌మనిపించి వారికి పంపించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కేరళ ప్రభుత్వం AI కెమెరాలను ప్రవేశపెట్టిన తర్వాత ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి చలాన్లు విపరీతంగా పెరిగిపోయాయి. సీసీ కెమెరాలు గుర్తించాలని కేసులను సైతం ఏఐ కెమెరాలు పట్టేసి జరిమానాతో సహా పోలీసులకు పంపిస్తున్నాయి. దీంతో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన సదరు వాహనదారులకు పోలీసులు సరాసరి చలాన్ పంపిస్తున్నారు.

ఈ క్రమంలో ఏఐ కెమెరా తీసిన ఓ ఫొటో వైరల్ అవుతోంది. కేరళ పోలీసు వాహనం(AI Camera Challan To Police)లో అధికారులు సీట్ బెల్ట్ ధరించకండా ప్రయాణిస్తుండటాన్ని ఏఐ కెమెరా గుర్తించింది. దీంతో ఆ విజువల్‌ను క్లిక్ మనిపించి ట్రాఫిక్ ఉల్లంఘన కింద వారికి జరిమానా విధించి చలాన్ పంపించింది. దీనిని ఇన్‌స్టాగ్రామ్ పేజీల్ అప్‌లోడ్ చేశారు.
అయితే ఈ సంఘటన కేరళలో ఎక్కడ జరిగిందనే స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు. చేవ్రొలెట్ టవేరా నియో SUV వాహనం కేరళ రిజిస్ట్రేషన్ నంబర్‌ను కలిగి ఉంది. ఇది పోలీసులు ఉపయోగించే అధికారిక వాహనంగా తెలుస్తోంది. ఎందుకంటే ఆ వాహనం రాష్ట్ర పోలీస్ చీఫ్ పేరుతో రిజస్టర్ చేయబడంది.

ఈ కారులో డ్రైవర్‌తో పాటు సహ-ప్రయాణికుల సీటులో ఉన్న వ్యక్తి సీటు బెల్ట్ ధరించలేదని స్పష్టం చేస్తూ AI కెమెరా ఫొటోలు తీసింది. కాగా ఇది రాత్రి సమయంలో తీసిన చిత్రం. అయితే అదే కారు పగటి సయమంలో ప్రయాణిస్తుండగా తీసిన చిత్రంలో డ్రైవర్ సీట్ బెల్ట్ ధరించినట్లుగా ఏఐ కెమెరా చూపిస్తోంది.
ట్రాఫిక్ నిబంధనల ప్రకారం సీటు బెల్ట్ ధరించకుండా కారు నడపకూడదు. రూల్స్‌ను అతిక్రమిస్తే చలాన్ జారీ చేసే అధికారం ట్రాఫిక్ పోలీసులకు ఉంటుంది. సీట్ బెల్ట్ పెట్టుకుని కారులో ప్రయాణించడం ద్వారా ఎన్నో ప్రమాదాల్లో ప్రయాణికులు స్వల్ప గ్రాయాలతో బయటపడ్డ సందర్భాలు ఉన్నాయి.

కాగా కేరళలో మోటార్ వెహికల్ డిపార్ట్‌మెంట్ సహా ఇతర ప్రభుత్వ విభాగాలపై కొన్ని సందర్భాల్లో చలాన్ మినహాయింపులు ఉన్నాయి. గతంలో సమస్యలు ఎదుర్కోవడంతో వీటిపై పరిమితులు విధించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు, ఇతర ప్రభుత్వ విభాగాల అధికారులకు ఏఐ కెమెరాలు విధించే చలాన్ నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే ఇది ఓవర్ స్పీడ్ విషయంలో మినహాయింపు ఇచ్చినట్లుగా సమాచారం,
ఈ సందర్భంలో, పోలీసు శాఖకు చెందిన అధికారులపై ఏఐ కెమెరా చలాన్ జారీ చేయగా.. దీనిపై అధికారులు ఇంకా స్పందించలేదు. ఆన్‌లైన్ సమాచారం ద్వారా ఈ పోలీస్ కారుపై జూన్ 2023 నుంచి దాదాపు 11 చలాన్‌లు పెండింగ్‌లో ఉన్నాయని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

ఏఐ కెమెరాలు ఇటీవల వైరల్ కావడంతో అందుకు సంబంధించి ఫొటోలు ఆన్‌లైన్‌లో తెగ షేర్ అవుతున్నాయి. కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రాష్ట్ర, జాతీయ రహదారులపై 726 ఏఐ కెమెరాలను అమర్చింది. తాజాగా కేరళకు చెందిన ఓ బైకర్ ఇటీవల పాల్పడిన 155 ట్రాఫిక్ ఉల్లంఘనలకు గాను అతడికి రూ. 86,500 జరిమానా విధించారు. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకూ అదే అత్యధికం.


Click it and Unblock the Notifications








