చంద్రయాన్-3 ల్యాండింగ్‌కు సర్వం సిద్ధం.. లైవ్ ఎక్కడ చూడాలంటే.. !
140 కోట్ల భారతీయులు సహా యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్‌పై ఇస్రో కీలక ప్రకటన చేసింది. విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ ప్రక్రియ సాయంత్రం 5:44 గంటలకు ప్రారంభం అవుతుందని వెల్లడించింది. సాయంత్రం 5:20 గంటల నుంచి ప్రత్యక్షప్రసారం ప్రారంభం అవుతుందని తెలిపింది. అన్ని అనుకున్నట్లు జరిగితే 6:04 నిమిషాలకు చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కానుంది.
ఈ ల్యాండింగ్ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది. ఇస్రో వెబ్‌సైట్, యూట్యూబ్, ఫేస్‌బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కానుంది. దీంతోపాటు DD నేషనల్ ఛానల్‌లోనూ లైవ్ చూడవచ్చు. లైవ్ కోసం ఇస్రో సర్వం సిద్ధం చేసింది.

చంద్రయాన్-3ను జూలై 14 మధ్యాహ్నం 2:35 గంటలకు శ్రీహరికోట నుంచి ప్రయోగించింది. అప్పటి నుంచి అన్ని కీలక దశలను చంద్రయాన్-3 విజయవంతంగా పూర్తిచేసుకుంది. ఇవాళ విజయవంతంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపైన ల్యాండ్ కానుంది. ఇదే జరిగితే చంద్రుడి దక్షిణ ధ్రువంపైన సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టిస్తోంది.
అయితే ఇప్పటికే అమెరికా, చైనా, రష్యా దేశాలు చంద్రుడిపైన సాఫ్ట్ ల్యాండింగ్ చేశాయి. అయితే ఇప్పటి వరకు ఎవరూ వెళ్లని చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసి కీలక పరిశోధనలు చేయాలని ఇస్రో ప్లాన్ చేసింది. విశ్వం యొక్క రహస్యాలు, చంద్రుడి మీద నివాసాల ఏర్పాటు సహా కీలక పరిశోధనలు చేయాలని భావిస్తోంది.

చంద్రయాన్-2 ల్యాండర్ కంటే చంద్రయాన్-3 ల్యాండర్ చాలా భిన్నంగా ఉంటుందని ఇస్రో తెలిపింది. ల్యాండర్ సెన్సార్లు, ఇంజిన్ విఫలమైనా.. చంద్రుని ఉపరితలంపై సురక్షితంగా ల్యాండింగ్ అయ్యేలా రూపొందించినట్లు వెల్లడించింది. ఇప్పటికే చంద్రుడి కక్ష్యలో ఉన్న ఆర్బిటర్‌తోనూ, భూమి మీద ఉన్న బేస్ సెంటర్‌లతోనూ సమాచారం పంచుకోగలదు. అయితే రోవర్ మాత్రం కేవలం ల్యాండర్‌కు మాత్రమే సమాచారం ఇవ్వగలదు.
ఈ సాయంత్రం 6:04 విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ అయిన నాలుగు గంటల తర్వాత ప్రగ్యాన్ రోవర్ బయటకు వస్తుంది. చంద్రుడి ఉపరితలంపైకి చేరుకుంటుంది. సెకనుకు సెంటీమీటర్ వేగంతో కదులుతుంటుంది. అక్కడ 14 రోజులపాటు (చంద్రుడిపై ఒక్క పగలుతో సమానం) పరిశోధనలు చేస్తుంది.
చంద్రయాన్-3లోని ల్యాండర్, రోవర్‌ల జీవితకాలం 14 రోజులు మాత్రమే. ఎందుకంటే చంద్రుడినిపై సూర్యరశ్మి ఉన్నంత వరకే విక్రమ్, ప్రగ్యాన్ వ్యవస్థలు పనిచేస్తాయి. 14 రోజుల తర్వాత (లూనార్ పగలు).. అక్కడి ఉష్ణోగ్రతలు మైనస్ 180 డిగ్రీలకు పడిపోతాయి. అలాంటి పరిస్థితులో చంద్రయాన్-3లోని పరికరాలు డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఒకవేళ.. చంద్రుడిపై మళ్లీ సూర్యోదయం అయ్యేవరకు విక్రమ్, ప్రగ్యాన్‌లు డ్యామేజీ కాకుంటే మరో 14 రోజులపాటు పనిచేసే అవకాశం ఉంటుందని ఇస్రో తెలిపింది.


Click it and Unblock the Notifications








