Amitabh Bachchan ట్రాఫిక్‌లో అమితాబ్ బేజార్.. బైక్‌పై షూటింగ్ లొకేషన్‌కి..
దేశంలో అత్యంత రద్దీగా ఉండే నగరాల్లో ముంబై ఒకటి. ఇది అక్కడి సామాన్యులకే కాకుండా వ్యాపార వేత్తలకు, బాలీవుడ్ నటీనటులకు కూడా పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఆదివారం షూటింగ్‌కు వెళ్తుండగా అలాంటి సమస్యలోనే చిక్కుకున్నారు. అభిమాని సాయంతో ఆయన బైక్‌పై షూటింగ్ స్పాట్‌కు సమయానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందుకు కారణం కూడా ఉంది.
అమితాబ్ వయసు 80. ఇప్పటికీ ఆయన సినిమాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. చాలా సినిమాల్లో నటిస్తూనే షూటింగ్స్‌లోనూ పాల్గొంటున్నారు. ఎప్పటిలాగే అమితాబ్ షూటింగ్‌కు వెళ్లేందుకు తన కారులో బయలుదేరారు. అమితాబ్ బచ్చన్ అంటే గుర్తొచ్చేది అతని స్టార్ డమ్ మాత్రమే కాదు.. సమయపాలన, ఆయన హుందాతనం, నిరాడంబరత. తాజాగా అదే నిరాడంబరతతో నెటిజన్ల మనసు దోచుకున్నారు అమితాబ్.

షూటింగ్ లొకేషన్‌కు ఎల్లప్పుడూ సమయానికి చేరుకునే అమితాబ్.. ఈ సారి(ఆదివారం) ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. ఓ వైపు రోడ్డుపై కారు కదలలేనంతగా వాహనాలు. మరో వైపు షూటింగ్‌కు ఆలస్యమవుతోంది. దీంతో ఇప్పట్లో ట్రాఫిక్ సమస్య తీరదు అని నిర్ధారించుకుని కారు దిగారు అమితాబ్. అటుగా బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని లిఫ్ట్ అడిగారు. బిగ్ బీకి అభిమాని అయిన ఆ బైకర్ సంతోషంగా అమితాబ్‌కు లిఫ్ట్ ఇచ్చారు. అలా ఆయన షూటింగ్‌కు చేరుకున్నారు.
అభిమానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు అమితాబ్. అభిమానితో బైక్‌పై కూర్చొని ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. అందులో అమితాబ్ బ్లాక్ టీ-షర్టు, బ్లూ ప్యాంటు, బ్రౌన్ బ్లేజర్, తెలుపు స్నీకర్లను ధరించారు. 'లిఫ్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు బడ్డీ.. మీకు తెలీదు.. ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న నన్ను సమయానికి గమ్య స్థానానికి చేర్చారు. మీరు షార్ట్ వేసుకుని పసుపు రంగు టీషర్టు ధరించి క్యాప్ పెట్టుకున్న బైక్ యజమాని.' అంటూ పోస్ట్ చేశారు అమితాబ్.
ఏదేమైనా అమితాబ్ ఈ వయసులో సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం చూస్తుంటే యువత తలదించుకోవాలి అనడంలో సందేహం లేదు. కష్టమైనా అనుకున్న సమయానికి షూటింగ్ లొకేషన్‌కు చేరుకోవాలనే ఆయన కమిట్‌మెంట్‌ను అందరూ మెచ్చుకోవాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్ట్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా ఈ సంఘటనపై కొందరు అభిమానులు మాత్రం వినూత్నంగా స్పందించారు. "డియర్ సర్ హెల్మెట్ ధరించకపోతే ఎలా.? మీరు సమయానికి మీ గమ్యస్థానానికి చేరుకోగలిగారు. కానీ అంతకంటే ముందు భద్రత కూడా ముఖ్యమే కదా" అని స్పందించారు. "దయచేసి హెల్మెట్ ధరించండి" అంటూ సలహాలు ఇచ్చారు. ఏదేమైనా అమితాబ్ చేసిన పనికి నెటిజన్స్‌తో పాటు బిగ్ బీ అభిమానులు ఫిదా అయ్యారు. 'అమితాబ్ మీరు నిజంగానే సూపర్ స్టార్' అని కామెంట్స్ చేస్తున్నారు.
అమితాబ్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న 'ప్రాజెక్ట్ కె' షూటింగ్‌లో ఉన్నారు. ప్రాజెక్ట్ కె సినిమాలో దీపికా పదుకొణె (Deepika Padukone) హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇటీవల, అతను రిభు దాస్‌గుప్తా రచన, దర్శకత్వం వహించిన సెక్షన్ 84 సినిమా షూటింగ్‌లోనూ తిరిగి బిజీ అయిపోయారు. ఇందులో డయానా పెంటీ, అభిషేక్ బెనర్జీ మరియు నిమ్రత్ కౌర్ నటిస్తున్నారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








