Rare Cars Collection 230 డిఫరెంట్ కార్లను కలిగి ఉన్న వ్యక్తి.. అన్ని మోడల్స్ ఎందుకు కలెక్ట్ చేశాడో తెలుసా..
సాధారణంగా ఔత్సాహికులు పాతకాలం నాటి నుంచి ఉన్న నాణేలను కలెక్ట్ చేసుకోవడం మనం చూశాం. వాటిపై అభిరుచితో ఎంతో శ్రమించి వాటిని సేకరించి అపురూపంగా దాచుకుంటారు. మరికొంతమందికి బైక్‌లు, కార్లు కొనుగోలు చేయడమంటే ఇష్టం. ముఖ్యంగా సెలబ్రిటీల గ్యారేజీలో ప్రముఖ బ్రాండ్ల వాహనాల గురించి తరచూ వార్తల్లో చూస్తుంటాం.
మామూలుగా సెలబ్రిటీల గ్యారేజీలో పదిలోపు వాహనాలను మాత్రమే చూసుంటాం. కానీ ఇక్కడ ఓ వృద్ధుడు మాత్రం అంబానీ, అదానీలను మరిచిపోయేలా పదుల సంఖ్యలో కాదు వందల సంఖ్యలో కార్లను కొనుగోలు చేసి తన గ్యారేజీలో పెట్టుకున్నారు. అవన్నీ వింటేజీ కార్లు. బయటి ప్రపంచానికి తెలియకుండా ఎన్నో ఏళ్లుగా 230 కార్లను సేకరించి ఔరా అనిపించారు. వివరాల్లోకి వెళితే..

నెదర్లాండ్స్‌కు చెందిన పాల్‌మెన్.. బయటి ప్రపంచానికి తెలియకుండా 200కి పైగా కార్లను కొనుగోలు చేసి వాటిని కాపాడుకుంటూ వస్తున్న వ్యక్తి. అవన్నీ ఎంతో అపురూపమైన పాతకాలపు కార్లే. కార్లంటే మక్కువతో చిన్నతనం నుంచే కార్లను సేకరించడం మొదలుపెట్టాడు పాల్‌మెన్. అలాగే తాను సేకరించిన కార్లన్నింటినీ గోడౌన్లలో దాచి ఉంచారు.
ముఖ్యంగా పాల్‌మెన్ తన వద్ద ఇన్ని కార్లు ఉన్న విషయం ఎవరికీ తెలియకుండా ఇంతకాలం రహస్యంగా ఉంచారు. ఇందుకోసం ఆయన అతి పెద్ద గోదాములో ఈ కార్లను దాచిపెట్టారు. వాడకంలో లేని చర్చిలు మరియు ఖాళీ గోడౌన్లలో ఈ వింటేజీ కార్లను నిల్వ చేసేవారు. బయటి ప్రపంచానికి తెలిస్తే దొంగతనం చేస్తారని భావించి కార్లను భద్రంగా దాచి ఉంచారు.

తన వద్ద ఇన్ని కార్లు ఉన్న సంగతి బయటి ప్రపంచానికి తెలియకుండా మెయింటెన్ చేశారు సరే.. మరి ఇంతకాలం వాడకుండా ఉంటే కార్లు పనికిరాకుండా పోతాయనే అనుమానం కూడా మీకు రావచ్చు. అందుకే ఆ సమస్య తలెత్తకుండా పాల్‌మెన్ ఎప్పటికప్పుడు ఆ కార్లను ప్రారంభిస్తూ.. ఎవరికీ తెలియకుండా నడపడం చేసేవారు. కానీ ఎక్కువగా నిర్వహణలో లేకపోవడంతో కార్లన్నీ దుమ్ము పట్టిపోయి ఉన్నాయి.
ఈ కార్లన్నీ దుమ్ముతో మురికిగా కనిపించినా ఒక్కో కారు ఓ అరుదైన సంపద. పాల్‌మెన్ కలిగి ఉన్న కార్లన్నీ చాలా అరుదైన పాతకాలపు కార్లు. ఒక్కో కారు వేల యూరోల విలువైనదనిగా చెబుతున్నారు. ఇంతకాలం రహస్యంగా ఉంచిన పాల్‌మెన్ ఇంత సడెన్‌గా ఈ కార్లను వెలుగులోకి తీసుకురావడం వెనుక ఓ కారణం ఉంది. అదేంటంటే..

పాల్‌మెన్‌కు వయసు మీద పడటం, అనారోగ్య సమస్యలు, తనకంటూ వారసులు లేకపోవడంతో ఈ కార్లన్నిటినీ వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ప్రముఖ కార్ల వేలం కంపెనీని ఆశ్రయించారు. ఆల్ఫా రోమియో, లాన్సియా, మసెరటి, ఫెరారీ, ఫేస్ వేగా, ఆస్టన్ మార్టిన్ మరియు జాగ్వార్ వంటి డజన్ల కొద్దీ బ్రాండ్‌ల వింటేజీ కార్లు పాల్‌మెన్ గ్యారేజీలో ఉన్నాయి.
ఈ కార్లన్నింటి విలువ కొన్ని లక్షల యూరోలు ఉంటుందని అంచనా. ముఖ్యంగా ఒక్క లాన్సియా అరేలియా వి24 స్పైడర్ అమెరికా కారు విలువ 2.5 మిలియన్ యూరోలు అని సమాచారం. ఈ కారు మోడల్‌కు సంబంధించి 240 యూనిట్లు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా అమ్మకానికి ఉత్పత్తి చేయబడ్డాయి. వీటిలో 57 యూనిట్లకు మాత్రమే కుడి చేతి స్టీరింగ్ ఉంది. వీటిలో ఒకటి మాత్రమే ప్రస్తుతం పాల్‌మెన్ వద్ద ఉంది.

ఇప్పటికే ఆన్‌లైన్ వేలం ప్రారంభం కాగా జూన్ 7 నాటికి ఈ కార్లన్నింటినీ వేలం వేయాలని వేలం సంస్థ ప్లాన్ చేస్తోంది. పాల్‌మెన్‌కు చెందిన అన్ని కార్లు త్వరలో అమ్ముడవుతాయని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అరుదైన మరియు పాతకాలపు వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. ఈ సమయంలో ఒకరి వద్ద మాత్రమే 230 పాతకాలపు వాహనాలు ఉండటం ఆటో ప్రియులను ఆశ్చర్యానికి గురి చేసింది.


Click it and Unblock the Notifications








