క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి కోరిక నెరవేర్చిన అపోలో హాస్పిటల్.. భావోద్వేగానికి లోనైన ఆనంద్ మహీంద్రా.!!
దురదృష్టవశాత్తు కొంతమంది చిన్నారులు చిన్నవయసులోనే నయం కాని రోగాల బారిన మృత్యు ఒడికి చేరుకునే పరిస్థితి నెలకొంటుంది. ప్రభుత్వాలు కూడా అలాంటి చిన్నారుల కోసం ప్రత్యేక చొరవ తీసుకుని వారికి ఏవైనా కోరికలు ఉంటే నెరవేరుస్తారు. ఇక్కడ ఓ బాలుడి విషయంలో కూడా అపోలో హాస్పిటల్, ఆనంద్ మహీంద్రా చేసిన పని కంటతడి పెట్టిస్తుంది.
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారి కోరికను అపోల్ హాస్పిటల్ యాజమాన్యం నెరవేర్చడంతో ఆ వీడియో పట్ల మహీంద్రా అండ్ మహీంద్రా యజమాని ఆనంద్ మహీంద్రా భావోద్వేగానికి లోనయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ చిన్నారి కోరిక ఏంటి.. అది ఆనంద్ మహీంద్రాను ఎందుకు కదిలించింది.. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ చిన్నారి పేరు కార్తీక్ సింగ్. చిన్న వయసులోనే ఈ బాబుకి క్యాన్సర్ రావడంతో తల్లిదండ్రులు క్రమం తప్పకుండా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అపోలోని ఆస్పత్రికి తీసుకెళ్లి కీమోథెరపీ చేయిస్తున్నారు. అయితే కార్తీక్ చికిత్సకు వచ్చిన ప్రతిసారీ మహీంద్రా థార్(Mahindra Thar SUV) కారు గురించే మాట్లాడుతుండేవాడు. మహీంద్రా థార్ ఎస్‌యూవీకి కార్తీక్ వీరాభిమాని.
కార్తీక్ తాను పెద్దయ్యాక మహీంద్రా థార్ ఎస్‌యూవీ కొనాలని, ఆ కారు అంటే తనకు ఎంతో ఇష్టమో అపోలో ఆస్పత్రి డాక్టర్లకు చెప్పేవాడట. అపోలో ఆసుపత్రి యాజమాన్యం ఇలాంటి కోరికలు ఉన్న వారి కోసం ప్రత్యేకంగా ఒక సిస్టంను ప్రవేశపెట్టింది, దీనిని "నన్హీ ఖ్వాహిషేన్" (చిన్న కోరికలు) అని పిలుస్తారట. కార్తీక్ పెద్దయ్యాక మహీంద్రా థార్‌ను నడపాలని లేదా సొంతం చేసుకోవాలని అనుకునేవాడు.

దీంతో అపోలో హాస్పిటల్ యాజమాన్యం కార్తీక్‌కు సర్‌ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేశారు. వారికి లక్నోలోని మహీంద్రా డీలర్‌షిప్‌తో సత్సంబంధాలు ఉండటంతో డీలర్‌షిప్‌ను సందర్శించి, వారికి కార్తీక్ స్టోరీని వివరించారు. దీంతో ఆ చిన్నారి కోరికను తీర్చడానికి డీలర్‌షిప్ ముందుకొచ్చింది. కార్తీక్ తదుపరి కీమో సెషన్ షెడ్యూల్ ఉన్నరోజు.. అతనిని పికప్ చేసుకోవడానికి మహీంద్రా థార్ అతని ఇంటికి వచ్చింది.
కార్తీక్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు కారు క్యాబిన్‌ను మొత్తం బెలూన్లతో నింపారు. దీంతో తన ఇంటి ముందుకు మహీంద్రా థార్ కారు చూడటంతో కార్తీక్ చాలా సంతోషించాడు. కారులో ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టుకుని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ సమయంలో కార్తీక్ సంతోషం మాటల్లో చెప్పలేనిది. కార్తీక్ విషయంలో అపోలో హాస్పిటల్స్ తీసుకున్న నిర్ణయం నిజంగా అభినందనీయం.

క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న వారికి తాము ఎన్ని రోజులు బతుకుతున్నామో తెలియక వారి కోరికలను లోపలే దాచిపెట్టుకుంటారు. కానీ ఇలాంటి జబ్బులు అదృష్టం బాగుంటే తగ్గే అవకాశం ఉంది. శారీరక బాధతో కుమిలిపోతున్న వారి చిన్న చిన్న కోరికలను నెరవేర్చడం ద్వారా వారు మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు.
తమ కుమారుడిని సంతోషపెట్టేందుకు ఆసుపత్రి అధికారులు చేసిన ప్రయత్నాలకు చిన్నారి తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో త్వరగా వైరల్ అయింది. ఈ వీడియో ఆనంద్ మహీంద్రా దృష్టికి వెళ్లడంతో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. వెంటనే ఆయన కూడా ఈ వీడియోను X (ట్విట్టర్లో)షేర్ చేశారు.

"నాకు మాటలు రావడం లేదు. నా కళ్ళలో నీళ్ళు మాత్రమే వస్తున్నాయి. @drsangitareddy, అపోలో హాస్పిటల్స్ యాజమాన్యం. చిన్నారి పట్ల మానవత్వంతో చొరవ చూపినందుకు ధన్యవాదాలు, మమ్మల్ని కూడా ఇందులో భాగం చేసినందుకు ధన్యవాదాలు. ఈ సంఘటనతో కార్తీక్‌కి నేను అభిమానినయ్యాను." అని ట్వీట్ చేశారు.
మహీంద్రా థార్ దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన SUV. ఈ కారుకు ఇప్పటికీ భారీ డిమాండ్ ఉంది. బుకింగ్ చేసినా కారు డెలివరీ తీసుకోవడానికి కొంతకాలం వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం నడుస్తున్న మహీంద్రా థార్ SUV దేశంలో అత్యంత సరసమైన 4×4 SUV. ఈ SUV పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఎంపికలలో అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








