ఆసియా క్రీడల విజేతపై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు.. ప్రత్యేక బహుమతి ఇవ్వాలని భావిస్తున్నట్లు వెల్లడి
ఆనంద్ మహీంద్రా.. పరిచయం అవసరం లేని పేరు. ప్రముఖ వ్యాపారవేత్తగానే కాకుండా సామాజిక సమస్యలు సహా ఇతర అంశాలపై తనదైన శైలిలో సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుంటారు. దీంతో ఆనంద్ మహీంద్రా సినీనటుల తరహాలో భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు. ఏదైనా రంగంలో ప్రత్యేకత కనబరిచిన వారికి తనకు తోచిన విధంగా బహుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తుంటారు.
తాజాగా ఆసియా క్రీడల్లో సత్తాచాటిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన రామ్ బాబూపై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. అతని క్రీడా స్ఫూర్తిని కొనియాడారు. అతని కుటుంబ అవసరాలకు అనుగుణంగా ట్రాక్టర్ గానీ పికప్ ట్రక్ గానీ ఇవ్వాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఈ రెండింటిలో ఏది కోరుకున్నా.. ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

ఆనంద్ మహీంద్రా ట్వీట్ : రోజువారి కూలీ నుంచి ఆసియా క్రీడల్లో పతకం సాధించే వరకు అతని సంకల్పం, ధైర్యాన్ని మెచ్చుకోవాలి. అతని ఫోన్ నంబర్ ఇవ్వండి. అతని కుటుంబానికి అవసరమైన ట్రాక్టర్ లేదా పికప్ ట్రక్ ఇవ్వాలని భావిస్తున్నా.. అంటూ మహీంద్రా సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
ఆసియా క్రీడల్లో 35 కి.మీ రేస్ వాక్ ఈవెంట్‌లో రామ్‌బాబు కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని సోన్ భద్ర జిల్లాలో రామ్ బాబు జన్మించారు. క్రీడల పట్ల తనకున్న మక్కువతో రోజువారీ కూలీగా పనిచేశాడు. మరియు వారణాసిలో వెయిటర్‌గా కొన్నిరోజులపాటు పనిచేసినట్లు సమాచారం. అనంతరం ఉపాధి హామీ పథకం కింద గ్రామంలో రోడ్డు నిర్మాణం కోసం తండ్రితో కలిసి గుంతలు తవ్వినట్లు రామ్‌బాబు ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
పేదరికం కారణంగా కుటుంబం నుంచి ఆర్థికంగా మద్దతు లభించలేదు. క్రీడల్లో పాల్గొనేందుకు కావాల్సిన పోషకాహారం సహా ఇతర అవసరాల కోసం పార్ట్ టైం ఉద్యోగం చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో రామ్ బాబు తెలిపాడు. అయితే వెయిటర్‌గా పనిచేయడం తీవ్రంగా నిరాశపరిచిందని, ఎవరూ సరైన గౌరవం ఇవ్వరని ఆవేదన వ్యక్తం చేశాడు.
వారణాసిలో వెయిటర్‌గా పనిచేస్తున్న సమయంలో కోచ్ చంద్రభాన్ యాదవ్‌తో పరిచయం ఏర్పడినట్లు రామ్ బాబు తెలిపారు. అయితే అక్కడ తక్కువ వేతనం మరియు కనీస గౌరవం లేకపోవడంతో స్వగ్రామానికి తిరిగి వచ్చినట్లు చెప్పాడు. 2019లో భోపాలోని SAI - (స్పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా) చేరినట్లు తెలిపాడు.

లాక్‌డౌన్ సమయంలో తిరిగి ఇంటికి వచ్చి ఉపాధి హామీ పథకంలో రోజువారి కూలీగా పనిచేసినట్లు చెప్పాడు. పని ఆధారంగా రోజుకు రూ.300 నుంచి రూ.400 వరకు వచ్చినట్లు చెప్పాడు. 2020 ఫిబ్రవరిలో జరిగిన నేషనల్ రేస్ వాక్ ఛాంపియన్‌షిప్‌లో 50 కి.మీ ఈవెంట్‌లో పాల్గొని రామ్‌బాబు 4 స్థానంలో నిలిచాడు.
గతంలోనూ జరిగిన చెస్ ఛాంపియన్ షిప్‌లో ప్రతిభ కనబరిచిన ప్రజ్ఞానందపైన ఆనంద్ మహీంద్రా స్పందించారు. కుమారుడి ప్రతిభను గుర్తించిన ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ కారు బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించినట్లు అప్పట్లో వెల్లడించారు. కుమారుడు ఆసక్తిని గమనించి, ప్రోత్సహించిన ప్రజ్ఞానంద తల్లిదండ్రులు నాగలక్ష్మి, రమేష్‌బాబుకు కృతజ్ఞతలు చెప్పారు. ప్రజ్ఞానంత ఆటకు మద్దతు ఇవ్వడమే కాకుండా, విలువలను కూడా పెంచుతున్నారని ప్రశంసలు కురిపించారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








