నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను.. కారులో ఉన్నప్పుడు తప్పకుండా ఆ పని చేస్తా, మీరు కూడా చేయండి: ఆనంద్ మహీంద్రా
టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ గడచిన ఆదివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసినదే. కారు వెనుక సీటులో కూర్చుని ప్రయాణిస్తున్న సైరస్ మిస్త్రీ మరియు జహంగీర్ పండోల్‌లు వెనుక సీట్లలోని సీట్ బెల్టులను ధరించని కారణంగా మృతి చెందినట్లు పోలుసులు తెలిపారు.
Recommended Video
ఈ నేపథ్యంలో, ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా గ్రూప్ అధినేత, ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ ఖాతాలో ఓ ప్రతిజ్ఞ చేశారు. తాను కారులో ప్రయాణిస్తున్న వెనుక సీటులో కూర్చున్నా సరే తప్పనిసరిగా సీట్ బెల్టు ధరిస్తానని, ప్రజలందరూ కూడా దీనిని తప్పనిసరిగా పాటిస్తామని ప్రతిజ్ఞ చేయాలని ఆయన కోరారు.

సైరస్ మిస్త్రీ వెనుక సీటులో ఉన్నారని, ఆ సమయంలో ఆయన సీటు బెల్ట్ ధరించలేదని వచ్చిన వార్తల నేపథ్యంలో ఆనంద్ మహీంద్రా ఇలా ట్వీట్ చేశారు.. "కారు వెనుక సీటులో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ నా సీటు బెల్ట్ ధరించాలని నేను నిశ్చయించుకున్నాను. మీరు కూడా ఆ ప్రతిజ్ఞ చేయాలని మిమ్మల్నందరినీ కోరుతున్నాను. దానికి మనమందరం మా కుటుంబాలకు రుణపడి ఉంటాము" అని పోస్ట్ చేశారు.

సైరస్ మిస్త్రీ (54 ఏళ్లు) గుజరాత్‌లోని ఉద్వాడ నుంచి ముంబైకి వెళ్తుండగా ప్రమాదంలో మరణించారు. ఆ సమయంలో కారులో మిస్త్రీతో పాటుగా ముందు సీట్లలో టాటా గ్రూప్ మాజీ ఇండిపెండెంట్ డైరెక్టర్ డారియస్ పండోల్, అతని భార్య అనహిత పండోల్ మరియు వెనుక సీటులో డారియస్ పండోల్ సోదరుడు జహంగీర్ పండోల్ ప్రయాణిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వెనుక సీటులో కూర్చున్న సైరస్ మిస్త్రీ మరియు జహంగీర్ పండోల్ ఇద్దరూ మరణించగా, కారు నడుపుతున్న అనాహిత పండోల్ మరియు ఆమె భర్త డారియస్ పండోల్ తీవ్రంగా గాయపడ్డారు.

అనహిత పండోల్ ముంబైలోని ఓ ప్రముఖ హాస్పిటల్ లో గైనకాలజిస్ట్ గా పనిచేస్తున్నారు. ప్రమాద సమయంలో వీరు ప్రయాణిస్తున్న మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ ఎస్‌యూవీ గరిష్టంగా గంటకు 130 కిమీ వేగంతో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. అధిక వేగం కారణంగా, కారు అదుప తప్పి రోడ్డు పక్కన డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు.

సైరస్ మిస్త్రీ తలకు బలమైన గాయం..
రోడ్డు ప్రమాదంలో మరణించిన సైరస్ మిస్త్రీ మరియు జహంగీర్ లను కాసాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చిన సమయంలో వారిద్దరినీ పరీక్షించిన డాక్టర్ డాక్టర్ శుభమ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, "మొదట, సైరస్ మిస్త్రీ మరియు జహంగీర్ పండోల్‌తో సహా ఇద్దరు వ్యక్తులను తీసుకువచ్చారు. వారిద్దరూ మరణించారు. వారిని తీసుకువచ్చిన స్థానికులు సైరస్ మిస్త్రీ అక్కడికక్కడే మరణించినట్లు మాకు చెప్పారు. జహంగీర్ పండోల్ ఘటనా స్థలంలో సజీవంగానే ఉన్నాడు, అయితే అతడిని ఆస్పత్రికి తరలించే సమయంలో మరణించాడు. మేము సాయంత్రం 5 గంటల సమయంలో జహంగీర్ పండోల్ మరిణించినట్లు ప్రకటించాము" అని చెప్పాడు

వీరద్దరు ఆస్పత్రికి వచ్చిన 10 నిమిషాల తర్వాత, రెండవ అంబులెన్స్ మిగిలిన ఇద్దరు క్షతగాత్రులతో వచ్చిందని, వారిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయని, వారికి అవసరమైన ప్రథమ చికిత్స అందించి ఉన్నత కేంద్రానికి తరలించామని డాక్టర్ చెప్పారు. ఆ తర్వాత వారు బంధువులు ఆ ఇద్దరినీ (అనహిత పండోల్, డారియస్ పండోల్) రెయిన్‌బో ఆసుపత్రికి తరలించారు, అక్కడ నుండి వారిని ముంబైకి విమానంలో తరలించారని శుభమ్ సింగ్ తెలిపారు. సైరస్ మిస్త్రీ తలకు బలమైన గాయం కాగా, జహంగీర్ పండోల్‌కు ఎడమ కాలు విరిగిపోయిందని మరియు అతని తలకు కూడా గాయమైందని డాక్టర్లు చెప్పారు.

సైరస్ మిస్త్రీ అకాల మరణం దిగ్భ్రాంతికరం: ప్రధాని నరేంద్ర మోదీ
సైరస్ మిస్త్రీ మరణం కార్పొరేట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా మిస్త్రీ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. సైరస్ మిస్త్రీ అకాల మరణం దిగ్భ్రాంతికరమని, అతను భారతదేశ ఆర్థిక పరాక్రమాన్ని విశ్వసించే మంచి వ్యాపార నాయకుడని ప్రధాని అభివర్ణించారు. ఆయన మృతి వాణిజ్య, పారిశ్రామిక రంగానికి తీరని లోటు అని, అతని కుటుంబసభ్యులకు మరియు స్నేహితులకు సంతాపం తెలియజేస్తున్నానని, మిస్త్రీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

అతను ఓ విజయవంతమైన పారిశ్రామికవేత్త: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే
సైరస్ మిస్త్రీ మరణం పట్ల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వ్యాఖ్యానిస్తూ.. "టాటా సన్స్ మాజీ చీఫ్ సైరస్ మిస్త్రీ మరణం గురించి విని దిగ్భ్రాంతికి గురయ్యాను. అతను ఓ విజయవంతమైన పారిశ్రామికవేత్త మాత్రమే కాదు, పరిశ్రమలో యువ, ప్రకాశవంతమైన మరియు దూరదృష్టి గల వ్యక్తిగా కూడా కనిపించాడు. ఇది తీరని నష్టం.. నా హృదయపూర్వక నివాళి" అని చెప్పారు.

ఆయన ఆత్మకు శాంతి కలగాలి: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
ఇదే ఘటనపై కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. "మహారాష్ట్రలోని పాల్ఘర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ దురదృష్టవశాత్తూ మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన అత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.


Click it and Unblock the Notifications








