ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు బహుమతిగా ఎలక్ట్రిక్ కారు.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్
ఆనంద్ మహీంద్రా.. పరిచయం అవసరం లేని పేరు. దేశంలో ప్రముఖ వ్యాపారవేత్తగానే కాకుండా సామాజిక సమస్యలపై సోషల్ మీడియా వేదికగా స్పందించే ఆనంద్ మహీంద్రాకు సినీ నటుల తరహాలో ప్రత్యేకంగా అభిమానులున్నారు. దేశంలో ఏదైనా రంగంలో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన వారికి తనదైన శైలిలో బహుమతులు ఇస్తుంటారు. ఇప్పటికే చాలా మందికి బహుమతులు ఇచ్చి సత్కరించారు.
దీంతోపాటు శబరిమల అయ్యప్ప దేవాలయం, షీర్డీ సాయి బాబా ఆలయానికి మహీంద్రా సంస్థ కార్లను అందించారు. ప్రజ్ఞానందకు కూడా కారు బహుమతిగా ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా ఆనంద్ మహీంద్రాను చాలా మంది కోరారు. అయితే అందులో ఓ ట్వీట్‌పై స్పందించిన ఆనంద్ మహీంద్రా.. చాలా మంది తనకు ఇటువంటి విజ్ఞప్తులే చేస్తున్నారని చెప్పారు.

అయితే తనకు మరో ఆలోచన ఉందని తెలిపారు. ప్రజ్ఞానందకు బదులుగా.. తమ కుమారుడి ఆసక్తిని గమనించి, ఇంతటి వాడిని చేసిన అతని తల్లిదండ్రులకు కారు బహుమతిగా ఇవ్వాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. కుమారుడు ఆసక్తిని గమనించి, ప్రోత్సహించిన ప్రజ్ఞానంద తల్లిదండ్రులు నాగలక్ష్మి, రమేష్‌బాబుకు కృతజ్ఞతలు చెప్పారు. వారికి మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ కారును బహుమతిగా ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం ఆన్‌లైన్ గేమ్‌లతో ప్రపంచాన్ని మరిచిపోతున్న పిల్లలున్న పరిస్థితుల్లో.. ప్రజ్ఞానంద ఆటకు మద్దతు ఇవ్వడమే కాకుండా, విలువలను కూడా పెంచారని ప్రశంసలు కురిపించారు. ఇదో మంచి పరిణామమని ఆనంద్ మహీంద్రా చెప్పారు. ఆనంద్ మహీంద్రా ట్వీట్‌పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. వేలాది మంది కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం భారత మార్కెట్‌లో మహీంద్రా XUV400 EV కారు ధర రూ.15.99 లక్షల నుంచి 19.39 లక్షల మధ్య ఉంది. ఈ కారు ఫన్, ఫాస్ట్, ఫియర్‌లెస్ డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. ఈ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. 34.5kWh లేదా 39kWh బ్యాటరీ ప్యాక్‌లను కలిగి ఉంటుంది. వరుసగా 375 కి.మీ మరియు 456 కి.మీ రేంజ్ ఇస్తుంది.
మహీంద్రా XUV 400 ఎలక్ట్రిక్ కారు గరిష్ఠ వేగం 150 kmph, మరియు ఈ కారు కేవలం 8.3 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగలదు. ఈ కారు బ్యాటరీని గృహ విద్యుత్ కనెక్షన్ ఉపయోగించి 3.3kW AC ఛార్జర్‌తో ఛార్జింగ్ చేసేందుకు 13 గంటల సమయం పడుతుంది. ఫాస్ట్ ఛార్జర్‌తో 50 నిమిషాల్లోనే 0-80 శాతం ఛార్జింగ్ చేయవచ్చు.
ఈ కారు 7.0 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కార్ టెక్, ప్రాజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఆకర్షణీయమైన సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్ సహా అనేక అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉంది. మరికొద్ది రోజుల్లోనే ఈ కారు ప్రజ్ఞానంద ఇంటికి డెలివరీ కానున్నట్లు తెలుస్తోంది. 2023 మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన నికత్ జరీన్‌కు మహీంద్రా థార్ కారును బహుమతిగా ఇచ్చారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








