ఈ వీడియో చూసి థార్ ఓనర్లకు వార్నింగ్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా.. వినకుంటే నష్టపోయేది మీరే..!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ భారీ వర్షాల కారణంగా వరదలు కూడా సంభవిస్తున్నాయి. దీంతో చెరువులు, నదులలో నీటి మట్టం భారీగా పెరిగిపోతోంది మరియు రోడ్లపై వాగులు పొంగిపొర్లుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నీటితో నిండిన రోడ్లపై ప్రయాణాలు మానుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నా, కొందరు మాత్రం నిర్లక్ష్యంతో వరదలలో ప్రయాణించి ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. వాగుల్లో కొట్టుకుపోతున్న వాహనాల గురించి మనం నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం, అయినా సరే కొందరు మాత్రం తమ వైఖరిని మార్చుకోవడం లేదు.

మాకేమవుతుందిలే మేము నడిపేది బలమైన వాహనం అనే ధీమాతో ఉరకలేస్తున్న వాగులను దాటేందుకు ప్రయత్నిస్తుంటారు. తాజాగా, కొందరు మహీంద్రా థార్ యజమానులు కూడా జోరుగా పారుతున్న ఓ వాగును దాటేందుకు ప్రయత్నించారు. దాదాపు బానెట్ వరకూ మునిగిపోయే లోతుతో, ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులో రెండు మహీంద్రా థార్ వాహనాలు ఒకదాని వెనుక మరొకటి వెళ్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది. చాలా మంది థార్ ఆఫ్-రోడ్ సామర్థ్యాన్ని ప్రశంసిస్తున్నప్పటికీ, వారు చేసిన పిచ్చి పనికి మాత్రం కామెంట్ల రూపంలో తిట్టిపోస్తున్నారు.

ఈ వీడియో కాస్తా అటూ ఇటూ షేర్ మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా కంటపడింది. దీంతో ఈ వీడియోని తిరిగి రీట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్రా, థార్ యజమానులను సున్నితంగా హెచ్చరించారు. థార్ ఎస్‌యూవీపై వారు ఉంచిన నమ్మకాన్ని నేను ప్రశంసిస్తున్నాను, కానీ ఇది చాలా ప్రమాదకరమైన చర్య. థార్ యజమానులందరినీ నేను కోరుకునేది ఒక్కటే, మీరు మాత్రం దయచేసి ఇలాంటి సాహసాలు చేయకండి అని ఆనంద్ మహీంద్రా తన ట్వీట్ లో తెలిపారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోల ప్రకారం, ఈ సంఘటన గోవాలో జరిగింది. కొల్లాంలో ఉండే దూద్‌సాగర్ అనే నది వర్షం కారణంగా ఉధృతంగా ప్రవహిస్తోంది, దీంతో రోడ్డుపై వర్షపు నీరు కూడా తీవ్రస్థాయిలో ప్రవహిస్తోంది. ఈ వీడియోలో రెండు మహీంద్రా థార్ ఎస్‌యూవీలు ఈ వాగును సులభంగా దాటుతున్నట్లు కనిపిస్తుంది. అయితే, ఏమాత్రం అనుకోని సంఘటన జరిగినా వాహనంలోని వారంతా వాగులో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి, వర్షకాలంలో ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణించడం కన్నా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం మంచిది లేదా వరద ఉధృతి తగ్గే వరకూ వేచి ఉండటం ఇంకా మంచిది.

మహీంద్రా గడచిన 2020 సంవత్సరంలో తమ కొత్త తరం థార్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది డిజైన్ పరంగా మాత్రమే కాకుండా శక్తి సామర్థ్యాల పరంగా కూడా మునుపటి కన్నా ఎన్నో రెట్లు మెరుగు పడింది. ప్రస్తుతం, భారతదేశంలో లభిస్తున్న అత్యుత్తుమ ఆఫ్-రోడ్ వాహనాలలో మహీంద్రా థార్ కే ఎవరైనా మొదటి ఓటు వేస్తారు. శక్తివంతమైన ఇంజన్స్ మరియు అత్యుతమ్మ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో మహీంద్రా థార్ ఇటు సిటీ ప్రయాణాలకు మరియు ప్రత్యేకించి అటు ఆఫ్-రోడ్ ప్రయాణాలకు చాలా అనుకూలంగా ఉంటుంది.

మహీంద్రా థార్ భారతదేశానికి కొత్త మోడల్ ఏమీ కాదు. కంపెనీ ఈ లైఫ్ స్టైల్ ఎస్‌యూవీని దాదాపు 2010 సంవత్సరం నుండి భారత మార్కెట్లో విక్రయిస్తోంది. అప్పటి నుండి కూడా ఇది మంచి ఆఫ్-రోడర్ ఎస్‌యూవీగా దేశవ్యాప్తంగా ఆఫ్-రోడింగ్ ఔత్సాహికులను ఆకట్టుకుంటూ వస్తోంది. థార్ ఎస్‌యూవీని మార్కెట్లో ప్రారంభించిన దాదాపు 10 సంవత్సరాల తర్వాత, అక్టోబర్ 2020లో కంపెనీ ఇందులో కొత్తగా రెండవ తరం మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది డిజైన్, టెక్నాలజీ మరియు ఫీచర్ల పరంగా మొదటి తరం థార్ కన్నా ఎంతో అధునాతనంగా ఉంది మరియు మార్కెట్లో అనతి కాలంలో సక్సెస్‌ఫుల్ మోడల్ గా మారింది.

ప్రస్తుతం, మహీంద్రా థార్ ఎస్‌యూవీ కోసం కస్టమర్లు ఏడాదికి పైగా వేచి ఉండేందుకు కూడా సిద్ధంగా ఉన్నారంటే, దీని పాపులారిటీ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కొత్త తరం మహీంద్రా థార్ ఎస్‌యూవీని కంపెనీ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో విక్రయిస్తోంది. పెట్రోల్ వెర్షన్‌లో సరికొత్త 2.0 లీటర్ టి-జిడిఐ ఎమ్‌స్టాలియన్ ఇంజన్ ను ఉపయోగించగా, డీజిల్ వెర్షన్ లో 2.2 లీటర్ ఎమ్‌హాక్ ఇంజన్ ను ఉపయోగించారు. ఇందులోని 2.0-లీటర్ ఎమ్-స్టాలియన్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్‌ను మరియు 300 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, 2.2-లీటర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజన్ 130 బిహెచ్‌పి పవర్‌ను మరియు 320 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
Found this post in my inbox this morning. While I appreciate their faith in the Thar, this looks like an incredibly dangerous manoeuvre. I appeal to Thar owners to exercise restraint. pic.twitter.com/UpKq5jAG8x
— anand mahindra (anandmahindra) July 22, 2022
మహీంద్రా థార్ ఫిక్స్డ్ హార్ట్ టాప్, సాఫ్ట్ టాప్ మరియు కన్వర్టిబుల్ టాప్ అనే మూడు రకాల రూఫ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇందులో కన్వర్టిబుల్ టాప్ కలిగిన వేరియంట్లకు అత్యధిక డిమాండ్ మరియు అత్యధిక వెయిటింగ్ పీరియడ్ ఉంటోంది. మార్కెట్లో థార్ ఏఎక్స్ ఆప్షనల్ మరియు ఎల్ఎక్స్ అనే రెండు ట్రిమ్స్‌లో లభిస్తుంది. కేవలం థార్ ఏఎక్స్ ఆప్షనల్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. కాగా, థార్ ఎల్ఎక్స్ ట్రిమ్స్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తో పాటుగా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో కూడా అందుబాటులో ఉంటాయి.

మహీంద్రా థార్ విషయంలో మరొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఇది గ్లోబల్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్టులో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ ను కూడా దక్కించుకుంది. ఈ కారులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, క్రూయిజ్ కంట్రోల్, మాన్యువల్ షిఫ్ట్-ఆన్-ఫ్లై 4x4 సిస్టమ్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు రూఫ్-మౌంటెడ్ స్పీకర్స్ మొదలైన ఫీచర్లు చాలానే ఉన్నాయి. ఈ ఎస్‌యూవీలోని అన్ని వేరియంట్లలో షిఫ్ట్-ఆన్-ఫ్లై ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో పాటుగా మెకానికల్ లాకింగ్ డిఫరెన్షియల్స్‌ను స్టాండర్డ్‌గా అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications