టయోటా కారులో దెయ్యం.. AI కెమెరాల్లో వరుస మిస్టరీ ఫోటోలు..?
టెక్నాలజీ అభివృద్ధి ఆటోమొబైల్ రంగంలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. గత సంవత్సరం కేరళలో రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలను (Artificial Intelligence Camera) అమర్చారు. ఈ కెమెరాలు రోడ్డు భద్రతా నిబంధనలు ఉల్లంఘనలకు పాల్పడిన వారి ఫోటోలను తీసి, ఆన్‌లైన్ ద్వారా చలానాలు పంపిస్తున్నాయి.
భయాందోళన కలిగిస్తున్న వరుస ఫోటోలు : అయితే ఈ కెమెరాల (AI Camera) పనితీరుపై చాలా ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. దీంతోపాటు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు తీసిన లవర్స్, దంపతుల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఈ కెమెరాలు తీసిన ఫోటోలు భయాందోళన కలిగిస్తున్నాయి.

వెనుక సీట్లో దెయ్యం? : గతవారంలో కేరళలోని ఓ రోడ్డులో మారుతి 800 కారు వెనుక సీట్లు దెయ్యాన్ని AI కెమెరా క్లిక్‌మనిపించింది. కారులో ప్రయాణిస్తున్న వారు సీట్ బెల్ట్ ధరించకపోవడంతో.. ఆ ఫోటోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరా క్యాప్చర్ చేసింది. ఈ ఫోటోలో ముందు సీట్లు కూర్చొని ప్రయాణం చేస్తున్నవారితోపాటు వెనుక సీట్లో ఉన్న దెయ్యం కూడా కనిపించింది.
తాజాగా ఇలాంటి ఘటనే కేరళలోని కన్నూర్‌లో చోటుచేసుకుంది. టయోటా గ్లాంజాలో ప్రయాణిస్తున్న వ్యక్తి సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరా ఫోటోను క్యాప్చర్ చేసింది. అయితే ఈ ఫోటో చూసిన కారు యాజమాని ఒక్కసారిగా షాక్ అయ్యారు. తాను ఒక్కడినే కారులో ప్రయాణం చేసినట్లు ఆ కారు యాజమాని చెబుతున్నారు. అయితే తన పక్క సీట్లు కూర్చున్న మహిళ ఎవరో తనకు తెలియదని తెలిపారు.
దీంతోపాటు చలాన్ జారీ అయిన రోజు తాను ఆ మార్గంలో ప్రయాణం చేయలేదని చెబుతున్నారు. టయోటా కారు యజమానికి మినరల్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాన్ని నడిపిస్తున్నాడు. ఆ కారణంగా జిల్లావ్యాప్తంగా ప్రయాణం చేస్తుంటారు. అయితే చలాన్‌లో ఉన్న మార్గంలో తాను కచ్చితంగా ప్రయాణం చేయలేదని చెబుతున్నారు.
ఈ సంఘటనపై టయోటా కారు యజమాని స్పందించారు. రవాణా శాఖ అధికారులను వివరణ కోరినట్లు చెప్పారు. అయినా వారి నుంచి సరైన సమాధాం రాలేదని తెలిపారు. సీట్ బెల్ట్ పెట్టుకోనుందుకు చలాన్ నగదును చెల్లించేందుకు తాను సిద్ధమని అయితే కారులో ప్రయాణం చేస్తున్న మహిళ వివరాలు ఇవ్వాలని పట్టుబట్టినట్లు తెలుస్తోంది.
మారుతి 800 కారు ఘటనలో వెనుక సీట్లో ఉన్న మహిళ ఫోటోపై కేరళ రవాణా శాఖ వివరణ ఇచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలో సాంకేతిక సమస్య కారణంగా... వెనుక సీట్లు ఉన్న పిల్లల ఫోటోలకు బదులుగా.. మరో మహిళ ఫోటో కనిపించిందని వివరణ ఇచ్చింది. అయితే టయోటా కారు ఘటనపై అధికారులు ఎటువంటి వివరణ ఇవ్వలేదు.
కేరళలో మోటార్‌సైకిల్ పై హెల్మట్ లేకుండా ప్రయాణిస్తే రూ.500 జరిమానా విధిస్తారు. అదే బైక్‌పై ముగ్గురు ప్రయాణం చేస్తే రూ.1000, డ్రైవింగ్‌లో ఫోన్ మాట్లాడితే రూ.2000 జరిమానా విధిస్తారు. కేరళలో ఏర్పాటుచేసిన AI కెమెరాలు.. ఎటువంటి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కనిపించినా వెంటనే ఫోటో తీసి, డేటా సెంటర్‌కు పంపిస్తాయి. ఎంత రాత్రి సమయంలోనైనా ఈ హై రిజల్యూషన్ కెమెరాలు ఫోటోలు తీయగలవు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కేరళ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టు కోసం రూ.232 కోట్లు ఖర్చుచేసినట్లు తెలుస్తోంది. 726 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కెమెరాలను రాష్ట్ర, జాతీయ రహదారులపై ఏర్పాటుచేసింది. ఈ కెమెరాలు అమల్లోకి వచ్చిన తర్వాత రోడ్డు ప్రమాదాల సంఖ్య భారీగా తగ్గింది. అయితే ఈ కెమెరాల పనితీరుపై గతంలో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications








