ఫోల్డింగ్ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించిన కొరియన్ యూనివర్సిటీ
పార్కింగ్ సమస్యను అధిగమించేందుకు కొరియాకు చెందిన అడ్వాన్స్‌డ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీకి చెందిన పరిశోధకుల బృందం ఓ అద్భుతమైన ఫోల్డింగ్ ఎలక్ట్రిక్ కారును రూపొందించారు. ఆర్మాడిల్లో-టి (Armadillo-T)గా పిలిచే ఈ ఎలక్ట్రిక్ కారును పార్క్ చేయాలనుకున్నప్పుడు రిమోట్ సాయంతో ఫోల్డ్ చేసి దీని పొడవును సగానికి తగ్గించవచ్చు.
ఆర్మాడిల్లోనే ఓ క్షీరదం నుంచి స్ఫూర్తి పొంది ఈ ఎలక్ట్రిక్ కారుకు ఆ పేరును పెట్టారు. స్పానీష్ భాషలో ఆర్మాడిల్లో అంటే కవచం ఉన్న చిన్న జీవి అని అర్థం. వీటి శరీరంపై ధృడమైన కవచం ఉంటుంది. శత్రువుల నుంచి రక్షించునేందుకు ఇవి తల, కాళ్లను కవచం లోపలికి ముడుచుకుంటాయి. సరే దీని విషయం అటుంచి, ఆర్మాడిల్లో-టి ఫోల్డింగ్ ఎలక్ట్రిక్ కారు గురించి తెలుసుకుందాం రండి.

ఆర్మాడిల్లో-టి స్పేస్ సేవింగ్ ఫోల్డింగ్ మెకానిజం
ఈ ఎలక్ట్రిక్ కారు 2.8 మీటర్ల పొడవు ఉంటుంది. రిమోట్ ద్వారా ఈ కారును ఫోర్డ్ చేసినప్పుడు దాదాపు సగ భాగం 180 డిగ్రీ కోణంలో మడుచుకుంటుంది, అప్పుడు దీని పొడవు 1.68 మీటర్లు మాత్రమే. ఈ మైక్రో ఎలక్ట్రిక్ కారులో ఇద్దరికి మాత్రమే (డ్రైవర్‌తో కలిపి) చోటు ఉంటుంది.

స్మార్ట్ ఫోన్ కంట్రోల్
ఆర్మాడిల్లో-టి ఎలక్ట్రిక్ కారును స్మార్ట్ ఫోన్‌ను అనుసంధానం చేసుకొని, ఫోన్ సాయంతో కంట్రోల్ చేయవచ్చు. పార్కింగ్ స్థలం గుర్తించిన తర్వాత, స్మార్ట్‌ఫోన్‌లోని అప్లికేషన్ సాయంతో ఈ కారును రిమోట్‌గా ఫోల్డ్ చేయవచ్చు. కారు పట్టేందుకు సరైన ఖాలీ లేనట్లయితే, ఈ కారు చక్రాలను 360 డిగ్రీ కోణంలో తిప్పుకోవచ్చు.

సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ టైమ్
ఈ మైక్రో ఎలక్ట్రిక్ కారు ప్రతి చక్రంలో ఒక్కొక్క మోటార్ చొప్పున మొత్తం నాలుగు మోటార్లు ఉంటాయి. ఈ మోటార్లు 13.6 కి.వా. బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తాయి. ఈ కారు మొత్తం బరువు 450 కేజీలు. దీని గరిష్ట వేగం గంటకు 60 కి.మీ. ఇది కేవలం 10 నిమిషాల ఛార్జింగ్ వ్యవధిలో 100 కి.మీ. దూరం ప్రయాణించడానికి సరిపడా ఛార్జ్ లభిస్తుంది.
వీడియో
ఈ కారులో సైడ్ మిర్రర్లకు బదులుగా కెమెరాలను ఉపయోగించారు. ఈ కెమెరాలు బయటి దృశ్యాలను చిత్రీకరించి, డ్యాష్‌బోర్డులో ఉండే స్క్రీన్లపై ప్రదర్శింపజేస్తాయి. మరి ఈ కారు పనితీరుకు సంబంధించిన వీడియోను వీక్షిద్దాం రండి.


Click it and Unblock the Notifications








