ఏపీలో అశోక్ లేలాండ్ ప్లాంట్.. ప్రారంభించిన మంత్రి లోకేష్.. ఏకంగా ఎన్ని వేల ఉద్యోగాలంటే ?
ఏపీకి మరో పరిశ్రమ వచ్చింది. విజయవాడ సమీపంలోని మల్లవల్లి ఇండస్ట్రియల్ కారిడార్లో అశోక్ లేలాండ్ ప్లాంట్ ప్రారంభం అయింది. మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా అశోక్ లేలాండ్ ప్లాంట్ ప్రారంభించారు. సుమారుగా 75ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ ఏర్పాటైంది. దీని ద్వారా ఏడాదికి 4800 బస్సులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు ఈ ప్లాంట్ ద్వారా 1800ఉద్యోగాలు లభించనున్నాయి.
హిందూజా గ్రూప్ అనుబంధ సంస్థ, ప్రముఖ కమర్షియల్ వెహికల్ తయారీదారు అశోక్ లేలాండ్ నేడు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలో తన కొత్త బస్సు తయారీ ప్లాంట్‌ను ప్రారంభించింది. ఈ యూనిట్‌ను ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఇందులో భాగంగా అశోక్ లేలాండ్, హిందూజా గ్రూప్ స్విచ్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు కీలను ఏపీ ప్రభుత్వానికి అందించారు.

విజయవాడ నుండి 40 కి.మీ దూరంలో ఉన్న మల్లవల్లిలో ఉన్న ఈ ఆధునిక ప్లాంట్ 75 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలను నిలబెట్టడానికి అడ్వాన్స్ డ్ మ్యానుఫాక్ఛరింగ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. అశోక్ లేలాండ్ డీజిల్ బస్సులు, స్విచ్ మొబిలిటీ ఎలక్ట్రిక్ బస్సుల మొత్తం శ్రేణిని తయారు చేయడానికి ఈ ప్లాంట్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.
అశోక్ లేలాండ్ ప్లాంట్ ప్రారంభించిన తర్వాత మంత్రి నారా లోకేష్ బస్ మోడల్స్‌ను పరిశీలించారు. అలాగే ప్లాంట్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. మరోవైపు మల్లవల్లి ప్లాంట్ ద్వారా ఏడాదికి 2400 బస్సులను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత క్రమంగా 4800 బస్సులకు పెంచాలన్న ఆలోచనలో ఉన్నారు.

అలాగే మల్లవల్లి అశోక్ లేలాండ్ ప్లాంట్ ద్వారా తొలి విడతలో 600 మందికి, రెండో విడతలో 1200మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రపంచంలో బస్సుల ఉత్పత్తిలో అశోక్ లేలాండ్ ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే మల్లవల్లి పారిశ్రామికవాడలో అశోక్ లేలాండ్‌కు ప్రభుత్వం భూములు కేటాయించారు.
అనంతరం అశోక్ లేలాండ్ సంస్థ ఎలక్ట్రికల్ బస్ బాడీ బిల్టింగ్ ప్లాంట్ నెలకొల్పింది. తాజాగా టీడీపీ కూటమి సర్కారు హయాంలో నారా లోకేష్ చేతుల మీదుగా మల్లవల్లి అశోక్ లేలాండ్ ప్లాంట్ ప్రారంభం అయింది.

యువగళం పాదయాత్ర సమయంలో గన్నవరం వచ్చినప్పుడు మల్లవల్లిలో అశోక్ లేలాండ్ ప్లాంట్ ప్రారంభిస్తామని హామీ ఇచ్చినట్లు నారా లోకేష్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. "ఇది రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమైన సందర్భం. ఉపాధిని అందించడంలో, నైపుణ్యాభివృద్ధిని పెంచడంలో.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పెంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది" అని మంత్రి నారా లోకేష్ అన్నారు.
అశోక్ లేలాండ్ BS6 బస్ మోడళ్ల ఉత్పత్తి, ఎలక్ట్రిక్ వెహికల్ బాడీ బిల్డింగ్ కెపాసిటీ స్థిరమైన అభివృద్ధి, నిబద్ధతకు నిదర్శనం. ఇది ప్రధాని మోదీ సంకల్పమైన 'ఆత్మ నిర్భర్ భారత్' లక్ష్యాలను చేరుకునేందుకు సాయపడుతుంది. దార్శనికత, అధునాతన పర్యావరణ వ్యవస్థ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు ఉపకరిస్తుందన్నారు.

ప్రభుత్వ పరంగా వ్యాపార అనుకూల వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి, పెట్టుబడులను ప్రోత్సహించడానికి స్థిరమైన విధానాలతో మేం ముందుకు సాగుతున్నాయని నారా లోకేష్ చెప్పారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పరిశ్రమదారుల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించడంపై దృష్టి సారించామన్నారు నారా లోకేష్.
ఫలితంగా ఆర్సెలర్ మిట్టల్, బీపీసీఎల్, టీసీఎస్, ఎన్టీపీసీ, ఎల్జీ, టాటా పవర్ వంటి ప్రధాన సంస్థలు గత తొమ్మిది నెలల్లో రూ.7లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయన్నారు. వీటి ద్వారా 4 లక్షలకు పైగా ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నట్లు తెలిపారు.
కొత్త ప్లాంట్ ప్రారంభంతో, అశోక్ లేలాండ్ దేశంలోనే నంబర్ 1 బస్ బ్రాండ్‌గా, ప్రపంచవ్యాప్తంగా టాప్ 5లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటుంది. పూర్తిగా దేశంలో నిర్మించిన బస్సులకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడంలో ఈ సౌకర్యం మాకు సహాయపడుతుందని అశోక్ లేలాండ్ ఎండీ షేను అగర్వాల్ అన్నారు.
కొత్త ప్లాంట్‌లో ఉత్పత్తి ఇప్పుడే ప్రారంభమైంది. మా ఆర్డర్ బుక్ పెద్దదిగా ఉండడంతో ప్లాంట్ మొదటి రోజు నుంచే 100శాతం కెపాసిటీతో పనిచేయడం ప్రారంభిస్తుంది. కొత్త ప్లాంట్‌ను అత్యాధునిక పరికరాలతో ఏర్పాటు చేశామని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications








