సోలార్ ఆటోరిక్షాలో బెంగుళూరు నుంచి లండన్‌కి!
ఆటోరిక్షాలో మీరు 10 కిలోమీటర్లు లేదా మహా అయితే 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఉంటారు. కానీ ఎవ్వరైనా ఆటోరిక్షాలో ఏకంగా 9600 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ప్రయత్నం చేస్తారా, అందులోను భారతదేశం నుంచి లండన్ వరకు. వినడానికే విచిత్రంగా ఉంది కదా.. కానీ బెంగుళూరుకు చెందిన నవీన్ రాబెల్లీ మాత్రం ఆ ప్రయత్నం చేస్తానంటున్నాడు.
అందులోనూ తాను స్వతహాగా తయారు చేసుకున్న సోలార్ పవర్డ్ ఆటోరిక్షాతో ఈ ప్రయోగం చేయనున్నాడు. బెంగుళూరుకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ రేవా (ప్రస్తుతం మహీంద్రా రేవా)లో ఉద్యోగం చేస్తూ మానేసిన నవీన్, అక్కడ పనిచేసిన అనుభవంతో సౌరశక్తితో నడిచే ఆటోరిక్షాను తయారు చేశాడు.
ఈ సోలార్ ఆటోరిక్షాకు నవీన్ పెట్టిన పేరు తేజాస్. ఇతను డీజిల్‌తో నడిచే ఆటోరిక్షాను పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించిన ఈకోఫ్రెండ్లీ వాహనంగా మార్చేశాడు. తన ఈకో-ఫ్రెండ్లీ ట్రావెల్‌ను ప్రమోట్ చేసేందుకు నవీన్ తన తేజాస్ (సోలార్ ఆటోరిక్షా)లో 10 దేశాలను దాటి, సుమారు 9,600 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించి లండన్ చేరుకోవాలని భావిస్తున్నాడు.
నవీన్ రెగ్యులర్ డీజిల్ ఆటోరిక్షాను సేకరించి, అందులోని ఇంజన్ తొలగించి బాడీ చుట్టూ, పైభాగంలో సోలార్ ప్యానెళ్లు, క్రింది భాగంలో బ్యాటరీలు, మోటార్లను అమర్చి తేజాస్‌ను కస్టమైజ్ చేశాడు. ఎనిమిది గంటలు చార్జ్ అయితే, బ్యాటరీల సాయంతో దాదాపు 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని నవీన్ చెబుతున్నాడు.
ఈ సోలార్ ఆటోరిక్షాను తయారు చేయటానికి నవీన్ దాచుకున్నదంతా ఖర్చు చేసేశాడు. ఈ ఆటోరిక్షాలోని ఫ్లోరింగ్‌ను ఫిక్స్ చేయటానికి మరియు ప్రస్తుతం ఇందులో ఉపయోగిస్తున్న భారమైన లీడ్ యాసిడ్ బ్యాటరీలను తేలికైన, సమర్థవంతమైన లిథియం అయాన్ బ్యాటరీలతో రీప్లేస్ చేసేందుకు డబ్బు అవసరం.
ఈ ఉత్పత్తి తుది దశకు చేరుకుంటే, సాంప్రదాయ డీజిల్ ఇంజన్‌తో నడిచే ఆటోరిక్షా కన్నా చవక ధరకే దీనిని అందించవచ్చని నవీన్ చెప్పాడు. నవీన్ తన ట్రిప్‌లో భాగంగా, ముందుగా బెంగుళూరు నుంచి ముంబై వెళ్లనున్నాడు. ఆ తర్వాత నౌకలో ఈ ఆటోరిక్షాను ఇరాన్ తీసుకువెళ్లనున్నాడు. అక్కడి నుంచి పర్షియన్ గల్ఫ్, టర్కీ, బల్గేరియా మీదుగా యూరప్ అక్కడి నుంచి ఫ్రెంచ్ పోర్ట్ చేరుకోనున్నాడు.
నీవన్ రాబెల్లీ ట్రిప్‌లో అతనికి కంపెనీ ఇచ్చేందుకు రావుల్ కోపక కూడా ఈ ట్రిప్‌లో తనతో చేరనున్నాడు. నవీన్ ట్రిప్‌నంతా రావుల్ ఓ డాక్యుమెంటరీగా చిత్రీకరించనున్నాడు. ఆటో వెనుక భాగంలో ఉండే ప్రాంతంలో అతను విశ్రాంతి తీసుకుంటాడు. ఏదైతేనేం.. బాగుంది కదూ ఈ సోలార్ ఆటోరిక్షా. మరి మనం కూడా వీరి ట్రిప్‌కు ఆల్ ది బెస్ట్ చెబుదామా..?


Click it and Unblock the Notifications









