ఇకపై రెడ్ సిగ్నల్ జంప్ చేసినా ఫైన్ ఉండదు.. తక్షణమే అమల్లోకి వచ్చిన కొత్త రూల్!
ప్రస్తుతం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది. సమయం ఆదా, వేగంగా వెళ్లేందుకు చాలామంది సిగ్నల్ జంపింగ్ చేస్తూ ఉంటారు. కూడళ్ల వద్ద రెడ్ సిగ్నల్ ఉంటే ఎవరైనా జంపింగ్‌కి పాల్పడితే జరిమానా విధిస్తారు. అయినా కానీ కొందరు వీటిని పట్టించుకోవడం లేదు. దీంతో సిగ్నల్స్ వద్ద కొన్నిసార్లు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక చెన్నై, బెంగళూరు, కేరళ వంటి ముఖ్య నగరాల్లో ఇలాంటి సిగ్నల్ జంపిగ్‌లు, ట్రాఫిక్ నియమాలను కఠినతరం చేసేందుకు ఆటోమేటిక్ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని ఎవరైనా ఉల్లంఘిస్తే ఏఐ కెమెరాలు ఆ వాహనదారులకు ఆటోమేటిక్‌గా జరిమానా విధిస్తాయి. దీంతో పోలీసులు వారికి చలానా జారీ చేస్తారు.
అయితే తాజాగా బెంగళూరులో ఈ ఆటోమేటిక్ సిస్టమ్‌లో కొన్ని మార్పులు తెచ్చారు. ఆ నిబంధనల ప్రకారం ఎవరైనా రెడ్ సిగ్నల్‌ని ఉల్లంఘిస్తే వారికి ఎటువంటి జరిమానా వేయరు. ఈ విధానం తక్షణమే అమల్లోకి వస్తుందని బెంగళూరు పోలీసులు తెలిపారు. అసలు రెడ్ సిగ్నల్ జంప్ చేసినా ఎందుకు ఫైన్ వేయరు? ఈ విధానాన్ని ఎందుకు తీసుకువచ్చారనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..

సాధారణంగా రోడ్లపై వాహనాలు నడిపేటప్పుడు రోడ్ సేఫ్టీ నియమ నిబంధనలు పాటించడం వల్ల జరిమానాల బారిన పడకుండా తప్పించుకోవచ్చు. కొన్ని మెట్రో నగరాల్లో వాహనాలను పర్యవేక్షించడానికి ఆటోమేటిక్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలు ఏఐ టెక్నాలజీతో ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే ఆటోమేటిక్‌గా జరిమానా విధిస్తాయి. ప్రస్తుతం చెన్నై, కేరళ, బెంగళూరుతో పాటు ఇతర ప్రధాన నగరాల్లో వీటిని ఇన్‌స్టాల్ చేశారు.
తాజాగా బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధించే పద్ధతిలో కొత్త నిబంధనలను ప్రకటించారు. దీని ప్రకారం రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఏదైనా వాహనం వెనుక అంబులెన్స్ ఆగితే ఆ వాహనాలు రెడ్ సిగ్నల్ రూల్స్‌ని బ్రేక్ చేసినా ఎటువంటి జరిమానా విధించరు. బెంగళూరు వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ కారణంగా అంబులెన్స్‌లో ట్రాఫిక్‌లో నిలిచిపోతున్నాయి.

కీలక సమయాల్లో బాధితుల ప్రాణాలను కాపాడే అంబులెన్స్‌లు దీర్ఘకాలికంగా ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో సకాలంలో చికిత్స అందడం లేదు. దీనిపై ప్రజలు ఫిర్యాదు చేయడంతో బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు కొన్ని మినహాయింపులు ఇచ్చారు. కొత్త నియమాల ప్రకారం ఇకపై అంబులెన్స్ రాగానే సిగ్నల్ దాటి అంబులెన్స్‌కి దారి ఇవ్వవచ్చని వాహనదారులకు పోలీసులు తెలిపారు. కొన్ని సందర్భాల్లో ఏఐ కెమెరా విధించే జరిమానాలను మాన్యువల్‌గా పరీక్షించి జరిమానాలను సైతం రద్దు చేయనున్నారు.
బెంగళూరు ప్రాంతంలో డ్రైవింగ్ చేసేటప్పుడు ఎవరైనా ఇలాంటి ఉల్లంఘనలకు చలానా జారీ అయితే వారు వెంటనే సమీపంలోని బెంగళూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ని సంప్రదించి వారి చలానాను రద్దు చేసుకోవచ్చు. ఎవరైనా జరిమానా చెల్లించినా ఆ మొత్తాన్ని రీఫండ్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అంతే కాదు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న అంబులెన్స్‌ని దారి ఇచ్చేందుకు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడు కొత్త టెక్నాలజీని అవలంబించాలని నిర్ణయించారు.

బెంగళూరు నగరంలో తిరిగే అంబులెన్సుల్లో జీపీఎస్ సెటప్‌తో ఉన్నాయి. ఇవి ఎల్లప్పుడూ ఆన్‌లైన్ సిగ్నల్‌కి కనెక్ట్ చేయబడతాయి. దీని ప్రకారం జీపీఎస్ పరికరం అమర్చిన వాహనం సిగ్నల్ దగ్గరకు వస్తే ఆటోమేటిక్‌గా అంబులెన్స్‌కి గ్రీన్ సిగ్నల్ పడేలా చేయనున్నారు. దీని ప్రకారం అంబులెన్స్ రాగానే గ్రీన్ సిగ్నల్ పడే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. మొదటి దశలో కొన్ని సిగ్నల్స్ దాటే 10 అంబులెన్సులను మాత్రమే పరీక్షిస్తున్నారు.
త్వరలోనే పూర్తి స్థాయిలో అంబులెన్స్‌లకు మార్గం సుగమం చేయడానికి బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించనున్నారు. అంబులెన్సుల కోసం దారి ఇచ్చేందుకు బెంగళూరు పోలీసులు తీసుకున్న చర్యలను ప్రజలు అభినందిస్తున్నారు. అయితే దీనిని నిరూపయోగం చేయవద్దని పలువురు హెచ్చరిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యను సైతం తీర్చేందుకు సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించి ఇలాంటి మరెన్నో ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయాలని ప్రజలు కోరుతున్నారు.


Click it and Unblock the Notifications








