Awareness: పెట్రోల్ బంకుల్లో మోసాలు.. తెలివిగా దోచేస్తారు.. అలెర్ట్ గా లేకుంటే అంతే సంగతులు!!
దేశంలో పెట్రోలు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇదే అదనుగా కొందరు పెట్రోల్ బంక్ యజమానులు/సిబ్బంది కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. మనలో చాలామంది పెట్రోల్ ఫిల్ చేయించేటప్పుడు కచ్చితంగా ఈ విషయాలను తెలుసుకోవాలి. తద్వారా ఈ రోజుల్లో జరుగుతున్న కొత్త తరహా డిజిటల్ మోసాల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. అందుకు సంబంధించిన వివరాలు మీకోసం..

రీడింగ్ లో మోసం..
కొలతలో మోసం, నాణ్యత లేని ఇంధనాన్ని నింపడం, ఎక్కువ డబ్బు తీసుకోవడం వంటి వివిధ మార్గాల్లో జరుగుతున్న మోసాల్ని వార్తల్లో రోజు చూస్తున్నాము. మనం వీటిపై కాస్త శ్రద్ధ పెడితే వీటి నుంచి సులభంగా తప్పించుకోవచ్చు. కొన్ని సూచనలు పాటిస్తే మీ జేబు లూటీ కాకుండా చూసుకోవచ్చు.
ఇచ్చిన నగదు కంటే తక్కువ ఇంధనం నింపే సందర్భాలు తరచుగా జరుగుతాయి. మీరు మీ వాహనంలో పెట్రోల్/డీజిల్ నింపడానికి వెళ్లినప్పుడు సిబ్బంది చేసే చిన్న ట్రిక్ తో మోసపోవచ్చు. ఉదాహరణకు మీరు రూ.500కి ఇంధనం నింపాలి అని మీరు చెప్తే అతను మీ దృష్టిని మళ్లించి మీటర్‌ని రీసెట్ చేయక పోవచ్చు. దీంతో ముందుగా రూ.100 ఎంట్రీ ఉంటే రూ.500 వచ్చే వరకు ఇంధనం నింపుతారు. కానీ, మీకు కేవలం రూ.400 ఇంధనం మాత్రమే లభిస్తుంది.

సింథటిక్ ఆయిల్ తో ..
ఈ రోజుల్లో కొందరు పెట్రోల్ బంకు సిబ్బంది వినూత్న మోసాలు చేస్తున్నారు. అనుమతి లేకుండా మీ వాహనాన్ని సింథటిక్ ఆయిల్‌తో (పవర్ పెట్రోల్) నింపేస్తున్నారు. పెట్రోలు, డీజిల్ ధరలతో పోలిస్తే దీని ధర 5 నుంచి 10% ఎక్కువగా ఉండడంతో బంకుల్లో అడిగినంత చెల్లించే పరిస్థితి నెలకొంది. సింథటిక్ ఆయిల్ మరింత సమర్థవంతమైనది అయినప్పటికీ, ఇది ఖరీదైనది కాబట్టి బంక్‌కి వెళ్లి సాధారణ ఇంధనంతో నింపమని సిబ్బందికి చెప్పండి.

చిప్ ద్వారా..
ఇంధన పంపిణీ యంత్రంలో ఎలక్ట్రానిక్ చిప్‌ను అమర్చడం ద్వారా, పెట్రోల్/డీజిల్ కొలత మోసం చేయవచ్చు. తెలంగాణలో 2020లో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. లీటర్ వచ్చే మిషన్ లో చిప్ ని ఉపయోగించి కేవల 970 ml ఇంధనం వచ్చేలా చేశారు. ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది.ఇలాంటి వాటిపై మీకు అనుమానం వస్తే వెంటనే బంక్ లో అందుబాటులో ఉండే లీటర్ గేజ్‌తో కొలవవచ్చు.

కల్తీ ఇంధనం..
వాహనాల్లో కల్తీ ఇంధనాన్ని నింపే విధానాన్ని చాలా ఏళ్లుగా కొందరు పెట్రోలు బంకు సిబ్బంది చేస్తున్నారు. పెట్రోలు, డీజిల్‌లో ఇంధనాన్ని ఇతర ఆయిల్స్ ని కలిపిన బంక్ లను సీజ్ చేసిన సందర్భాలను కొట్టిపారేయలేం.. ఈ రకమైన రీఫ్యూయలింగ్ వాహనం ఇంజన్‌పై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. మీరు నింపుతున్న ఇంధనంలో కల్తీ ఉందా లేదా అనేది సులభంగా తెలుసుకోవచ్చు.

ఫిల్టర్ పెట్రోల్ ద్వారా..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి పెట్రోల్ బంకులో కస్టమర్లు అడగకుండానే ఫిల్టర్ పేపర్లు ఇవ్వాలి. పేపర్‌పై రెండు చుక్కల అనుమానాస్పద పెట్రోల్ పోసి మరక పడితే అది కల్తీ అని అర్థం. లేకపోతే పెట్రోల్ స్వచ్ఛమైనదని తెలుసుకోవాలి. ఇప్పుడు పెట్రోలు, డీజిల్ ధరలను సవరించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఈ విషయంలో బంకులకు ఎలాంటి అధికారం ఉండదు.. ఇంధన యంత్రంపై రేటు సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకుని ఫిల్ చేసుకోవాలి.
మొత్తం మీద కొన్ని పెట్రోల్ బంకులు పాత పద్ధతులతో పాటు కస్టమర్లను మోసం చేయడానికి కొత్త మార్గాలను కనుగొంటున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మోసపోవడమే కాకుండా మీ వాహనాలు కూడా పాడవుతాయి. నకిలీ పెట్రోల్ తో ఆ తర్వాత ఎక్కువ డబ్బులు బైక్ లేదా కారుకి చెల్లించాల్సి ఉంటుంది. ఇక నుంచి పెట్రోల్, డీజిల్ నింపాల్సి ఈ చిన్నపాటి సూచనలు ఉపయోగించి మోసాల నుంచి సులభంగా తప్పించుకోవచ్చు.


Click it and Unblock the Notifications








