వెహికల్ స్క్రాపింగ్ ద్వారా ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా.??.. మీ డబ్బును చాలా ఆదా చేసుకోవచ్చు.!!
వెహికల్ స్క్రాప్(Vehicle Scrap) చేయడం మన దేశంలో కొత్తే కావచ్చు. కానీ అమెరికాతో సహా పలు దేశాల్లో ఇది చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. అంటే, పాత వాహనాలను ఇంట్లో ఓ మూలన పెట్టేయడం లేదా బహిరంగ ప్రదేశాల్లో పడేయకుండా స్క్రాపింగ్ సెంటర్‌కు తీసుకెళ్లి వాటిని సరిగ్గా ధ్వంసం చేయడమే ఈ వెహికల్ స్క్రాపింగ్..
అయితే ఈ వెహికల్ స్క్రాపింగ్(Vehicle Scrappage) వల్ల లాభమేంటని మీకు సందేహం రావచ్చు. దీని ద్వారా చాలా ప్రయోజనాలున్నాయి. కానీ మన దేశంలో వాహనం అంటే చాలా మందికి సెంటిమెంట్. కొందరు దానితో ఎనలేని బాండింగ్‌ను కలిగి ఉంటారు. అందుకే మార్కెట్లోకి ఎన్ని కొత్త వాహనాలు వచ్చినా తాము ఇష్టపడి కొనుక్కున్న వాహనాన్ని వదిలిపెట్టలేరు. కొత్త వాహనం కొన్నా పాత వెహికల్‌ను అపురూపంగా దాచుకుంటారు.

కానీ పాత వాహనాలు వాతావరణంలో వాయు కాలుష్యాన్ని ఎక్కువగా విడుదల చేస్తున్నాయనే సంగతి తెలిసిందే.. అయితే నేటి తరం వాహనాల ద్వారా కాలుష్యం ఏర్పడటం లేదా అని మీరు అడగొచ్చు. ప్రస్తుతం మార్కెట్లో విడుదలవుతున్న ఆధునిక కార్లు BS6తో సహా వివిధ తనిఖీలు మరియు పరీక్షల తర్వాత అందుబాటులోకి వస్తాయి. కాబట్టి వాటి ద్వారా పెద్దగా వాయు కాలుష్యం ఏర్పడదు. అందుకే పాత వాహనాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం.
కాగా ఇక వెహికల్ స్క్రాపింగ్(Old Vehicles Scrapping) విషయానికొస్తే.. ఇది వాయు కాలుష్యాన్ని నివారించడమే కాకుండా, పాత వాహనాల నుంచి లోహాలను కొత్త వాహనాల తయారీలో ఉపయోగించవచ్చు. తద్వారా ఆటోమొబైల్స్ ఉత్పత్తిలో ఇనుము మరియు రాగి వంటి లోహాల కొరతను పరిష్కరించే అవకాశం ఉంటుంది. ఇంకా దీని ద్వారా కొత్త వాహనాల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది.

కానీ దేశంలో పాత వాహనాలు ఉన్నవారు ఎవరూ కూడా తమ వాహనాలను ధ్వంసం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావడం లేదని కేంద్రం గమనించింది. అందుకే కొన్నేళ్ల క్రితమే వాహన విధ్వంసం పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు.
ఈ పథకం ద్వారా మీరు మీ పాత వాహనాన్ని ప్రభుత్వం ఆమోదించిన స్క్రాపింగ్ సెంటర్‌లో స్క్రాప్ చేయడం వల్ల కొత్త వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు మీకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి. కొత్త వాహనం యొక్క ఎక్స్-షోరూమ్ ధర 4% నుండి 6% వరకు తగ్గుతుంది.

అలాగే, కొత్త వాహనం కొనుగోలుపై చెల్లించే రోడ్డు పన్ను కూడా 25 శాతం మేర తగ్గుతుంది ఇంకా అసలు గుడ్ న్యూస్.. RTOలో మీ కొత్త వాహనాన్ని నమోదు చేసుకునేందుకు రుసుము పూర్తిగా 100% తగ్గించబడుతుంది. అంటే మీ కొత్త వాహనానికి ఆర్‌టీఓ రిజిస్ట్రేషన్ ఫీజు ఏమీ చెల్లించాల్సిన అవసరం ఉండదు.
మీ పాత వాహనాన్ని స్క్రాప్ చేసిన తర్వాత, స్క్రాపింగ్ సెంటర్‌లో సర్టిఫికేట్ జారీ చేస్తారు. ఈ సర్టిఫికెట్‌ను మీరు కొత్త వాహనం కొనుగోలు చేసేటప్పుడు ప్రయోజనాలను పొందవచ్చు. అయితే పాత వాహనం యజమాని కొత్త వాహనాన్ని కొనుగోలు చేయకపోతే.. ఈ ధృవీకరణ పత్రాన్ని అతని కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు ఉపయోగించుకోవచ్చు.

అయితే ఈ కథనంలో మీకు పాత వాహనాలు అని మాత్రమే చెబుతున్నాం. అయితే, వాహనం ఎంత పాతది, ఎన్ని సంవత్సరాలు ఉపయోగించారు, ఇంకా వాహనం బట్టి స్క్రాపింగ్ విధానం మారుతుంటుంది. పెద్ద భారీ ట్రక్కులు మరియు బస్సులు 10 సంవత్సరాలు నడిచినప్పుడు కాలం చెల్లినవిగా పరిగణించబడతాయి. అయితే కార్లు 15 సంవత్సరాలు నడిచినప్పుడు వాటిని పాతవిగా పరిగణిస్తారు. అయితే దీనిపై పూర్తి నివేదిక ఇంకా విడుదల కాలేదు.
ఇటీవల కొత్త వాహనం కొనుగోలు చేసేటప్పుడు తన పాత కారును స్క్రాప్ చేస్తే రూ. 50,000 ఫ్లాట్ బెనిఫిట్ పొందవచ్చని పేర్కొంటూ ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కొత్తగా కొనుగోలు చేసే వాహనానికి రోడ్డు పన్నులో రూ.50,000 వరకు రాయితీ లభించనుంది. ఈ విధానం ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వ ఆర్థిక శాఖ వద్ద పరిశీలనలో ఉండగా.. ఆమోదం రావాల్సి ఉంది.

కానీ భారతీయులకు తమ పాత వాహనాలపై ఉన్న సెంటిమెంట్ కారణంగా వాటిని ధ్వంసం చేయడానికి ఇష్టపడటం లేదు. వారు ధైర్యం చేసి పర్యావరణ హితం కోసం ఆలోచించినట్లయితే ఈ ప్రాజెక్టు దేశమంతటా కార్యరూపం దాల్చుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని తప్పనిసరి చేసినట్లయితే పాత వాహనాల స్క్రాపింగ్ ఊపందుకుంటుంది.


Click it and Unblock the Notifications








