భర్తకు చెప్పకుండా చేసిన పని.. బెంజ్ కంపెనీనే కాపాడింది.. అసలు ఆమె ఏం చేసింది.. ఆ రహస్యం ఏంటి!
ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ రంగంలో ఎంతో ప్రసిద్ధి చెందిన మెర్సిడెజ్-బెంజ్(Mercedes Benz) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జర్మనీకి చెందిన ఈ కంపెనీ అన్ని దేశాల్లో మార్కెట్‌ను కలిగి ఉంది. ఇది ఖరీదైన లగ్జరీ కార్ల తయారీ సంస్థగా గుర్తింపు పొందింది. చాలా మంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీ తారలు, క్రికెటర్లు వంటి మొదలగు సెలబ్రిటీల దగ్గర ఖచ్చింతగా బెంజ్ కంపెనీకి చెందిన కనీసం ఒక్క కారైన ఉంటుంది. అంతటి ప్రాముఖ్యత కలిగిన బెంజ్ ప్రపంచంలోని దిగ్గజ సంస్థగా ఇప్పుడు పేరందుకుంటుంది. అయితే ప్రస్తుతం ఇంతటి పేరు, ప్రఖ్యాతలు సంపాదించినప్పటికి ప్రారంభం సమయంలో మాత్రం కంపెనీ చాలా ఆటుపోట్లను ఎదుర్కొంది. ఎన్నో కష్టాలను తట్టుకుని అన్నింటిని దిగ్విజయంగా దాటుకుని ఈ స్థాయికి చేరుకుంది. అయితే దీని వెనుక ఒక మహిళ కష్టం ప్రధానంగా ఉంది. ఆమె కారణంగానే మెర్సిడెజ్-బెంజ్ టాప్ కంపెనీలలో ఒకటిగా ఉంది.
అసలు ఆమె ఎవరంటే, బెంజ్ సృష్టికర్త కార్ల్ ఫ్రెడరిక్ బెంజ్(Carl Friedrich Benz) భార్య 'బెర్తా బెంజ్(bertha benz)'. ఈమె కారణంగానే ఆటోమొబైల్ రంగంలో బెంజ్ కంపెనీ ఈ రోజు ఇంత పెద్ద స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది. మరో విషయం ఏంటంటే, ప్రపంచానికి కార్లను పరిచయం చేసిన ఘనత కూడా ఈమెకే దక్కుతుంది. బెంజ్ కంపెనీ సృష్టికర్త కార్ల్ ఫ్రెడరిక్ బెంజ్ జర్మనీకి చెందిన ప్రొఫెషనల్ ఆటోమోటివ్ ఇంజనీర్, డిజైనర్.

ఈయన జనవరి 1885 లో మోటర్‌వాగన్‌ను అనే ఆటోమొబైల్‌ను సృష్టించాడు. అయితే తన మొదటి కారు రోడ్డుపై ఎలా ప్రయాణిస్తుందో అనే డౌట్ మాత్రం అలాగే ఉండిపోయింది. మార్కెట్లో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందా అనే సందిగ్ధంలో ఉన్నాడు.ఇలాంటి సమయంలో అతని భార్య బెర్తా బెంజ్ మాత్రం దానిపై పూర్తి నమ్మకాన్ని ఉంచి అతనికి భరోసా ఇచ్చింది. అయినప్పటికీ ఆయనలో భయం మాత్రం తగ్గలేదు.
మొదటి కారును తయారు చేసిన తర్వాత దాన్ని మార్కెట్లో అమ్మడానికి కార్ల్ బెంజ్ బాగా కష్టపడ్డాడు. అలా దాదాపు మూడు సంవత్సరాలు గడిచిపోయింది. అప్పటికి కూడా విక్రయాలు అంతగా లేకపోవడంతో చాలా నిరుత్సాహపడ్డాడు. ఎందుకు తమ కార్లను కొనుగోలు చేయడం లేదని ఆందోళన పడుతున్న సమయంలో ఆయన భార్య బెర్తా బెంజ్ ధైర్యంగా ముందడుగు వేసింది. అందుకోసం కీలక నిర్ణయం తీసుకుంది.

1888 ఏడాదిలో ఒకరోజు ఉదయం, నిద్రలేచిన వెంటనే తన భర్త కార్ల్ బెంజ్‌కు చెప్పకుండా ఆమె ఇద్దరు కొడుకులు రిచర్డ్, యూజెన్‌లతో కలిసి స్వయంగా మూడు చక్రాలు కలిగిన వాహనాన్ని బయటకు తీసి రోడ్డుపై ప్రయాణించడం ప్రారంభించింది. ఆమె అలా రోడ్డుపై వెళ్తుంటే అందరూ కూడా ఆసక్తికరంగా చూడటం మొదలుపెట్టారు. వాహనం అంటేనే కొత్తగా విచిత్రంగా అనిపించడం, పైగా దాన్ని ఒక మహిళ నడుపుతుండటాన్ని అందరూ అలా చూస్తూనే ఉండిపోయారు.
రోడ్డుపై మూడు చక్రాల వాహనాన్ని ప్రజలు చూసి ఆశ్చర్యపోయారు. అలా ఆమె ఆ రోజు పేటెంట్-మోటార్‌వాగన్‌లో మ్యాన్‌హీమ్ నుండి ప్ఫోర్‌జీమ్‌కు దాదాపు 106 కిలోమీటర్ల వరకు ప్రయాణించింది. ఇక్కడ మరో విషయం ఎంటంటే, పేటెంట్ వ్యాగన్ టెస్ట్ కోసం ఈ మూడు చక్రాల వాహనాన్ని కొద్ది దూరం నడిపించగా, బెర్తా బెంజ్ మాత్రం ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ప్రపంచానికి కార్ల గురించి తెలియజేయడానికి మరింత ఎక్కువ దూరం ప్రయాణం చేసింది.

ఆమె స్వయంగా కారును నడిపి అందరికి చూపించడంతో ఆ తర్వాత బెంజ్ కార్లపై మరింత నమ్మకం ఏర్పడి అమ్మకాలు క్రమంగా పెరిగాయి. అయితే మొదట్లో కారులో కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చినప్పటికీ వాటన్నింటిని మెల్లగా పరిష్కరిస్తూ ముందుకు సాగారు. ఆమె తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయం కారణంగానే బెంజ్ ఇంతటి మైలు రాయికి చేరుకుంది.


Click it and Unblock the Notifications








