మీకు తెలుసా.. భారతదేశంలో అంబులెన్సులుగా ఉపయోగపడే 10 వాహనాలు, ఇవే..
కరోనా మహమ్మారి కోరల్లో పడి ఇప్పటికి కూడా చాలా దేశాలు కొట్టుమిట్టాడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశంలోకి మరో కొత్త వేరియంట్ వచ్చేసింది. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం మళ్ళీ వచ్చేసింది. కరోనా మళ్ళీ అధికంగా విజృంభిస్తే నిరంతరం వైద్య సదుపాయం అందుబాటులో ఉండాలి. కావున అంబులెన్సులు కూడా ఎప్పుడూ అందుబాటులో ఉండాలి.
భారతదేశంలో అంబులెన్సులుగా పనికొచ్చే 10 వాహనాలు గురించి మనం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

మారుతి సుజుకి ఓమ్నీ:
అంబులెన్స్ అంటేనే మొదటి గుర్తొచ్చేది మారుతి సుజకి యొక్క 'ఓమ్ని'. భారతదేశంలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఓమ్ని అంబులెన్సుగా ఉపయోగపడుతూనే ఉంది, ఇప్పటికి కూడా ఓమ్నీ అంబులెన్సులు విరివిగా అందుబాటులో ఉన్నాయి. మారుతి ఓమ్నీ యొక్క అంబులెన్స్ ఎడిషన్ నిలిపివేసినప్పటికీ సాధారణ ప్యాసింజర్ వాహనాన్నే అంబులెన్సుగా ఉపయోగిస్తున్నారు. అయితే దీనిని చాలా జాగ్రత్తగా వినియోగించాల్సి ఉంటుంది. ఈ విషయం మరచిపోకూడదు.

మారుతి సుజుకి ఈకో:
మారుతి సుజుకి కంపెనీ యొక్క ఈకో కూడా అంబులెన్సుగా ఉపయోగపడే వాహనాలలో ఒకటి. మారుతి సుజుకి ఇప్పటికీ ప్రత్యేక మాడిఫైడ్ మారుతి ఈకో అంబులెన్సులను అభివృద్ధి చేస్తుంది. చిన్న హాస్పిటల్స్ లో లేదా నర్సింగ్ హోమ్ వంటి వాటిలో ఇలాంటివే అంబులెన్సులుగా ఉపయోగపడుతున్నాయి.
మారుతి ఈకో కేవలం అంబులెన్సులుగా మాత్రమే కాకుండా స్కూల్ వ్యాన్ గా, నిత్యావసరం వాహనంగా కూడా ఉపయోగిస్తున్నారు. అయితే అంబులెన్సుగా ఉపయోగించడానికి ఇది కూడా సరైన వాహనం కాదు, కానీ దీనిని కూడా చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి.

టాటా వింగర్:
మారుతి సుజుకి కాకూండా టాటా మోటార్స్ యొక్క వింగర్ ఖచ్చితంగా అంబులెన్సుగా ఉపయోగపడే వాహనం. రోగికి కావలసిన సదుపాయాలు ఇందులో అందుబాటులో ఉంటాయి, కావున ఇది అంబులెన్సుగా వినియోగించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

టాటా వింగర్ అనేది చిన్న వాహనం అయినప్పటికీ సరిగ్గా కస్టమైజ్ చేస్తే ఇది ఖచ్చితమైన అంబులెన్స్ అవుతుంది. అనేక ఆసుపత్రులు ఇప్పటికే వింగర్ అంబులెన్స్ యొక్క పాత వెర్షన్ ను కలిగి ఉన్నాయి. కాగా టాటా వింగర్ బిఎస్ 6 వాహనాలు కూడా అంబులెన్సులుగా ఉపయోగపడుతున్నాయి.

మహీంద్రా బొలెరో:
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'మహీంద్రా బొలెరో' కూడా అత్యవసర వాహనమైన అంబులెన్సుగా ఉపయోగపడుతుంది. మహీంద్రా బొలెరో అంబులెన్స్ 2500 సిసి ఇంజిన్ మరియు స్ట్రెచర్ మీద పడుకున్న రోగి కాకుండా 5 సీటింగ్ సామర్థ్యంతో వస్తుంది. కావున రోగితో పాటు ముగ్గురు సహాయక సిబ్బంది లేదా కుటుంబ సభ్యులు ఇందులో ఉండవచ్చు.

ఫోర్స్ ట్రాక్స్:
ఫోర్స్ మోటార్స్ యొక్క ఫోర్స్ ట్రాక్స్ కూడా భారతదేశంలో అంబులెన్స్ గా ఉపయోగపడుతున్న వాహనం. ఎందుకంటే కంపెనీ దీనిని అంబులెన్సుగా ఉపయోగపడటానికి కావాల్సిన ఏర్పాట్లు చేసింది. కావున ఇది ఖచ్చితమైన అంబులెన్సుగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా భారతీయ రోడ్లకు ఇది చాలా అనుకూలమైన వాహనం కూడా.

ఈ అంబులెన్స్ లో ఆటోలోడర్ స్ట్రెచర్, ప్రత్యేకంగా రూపొందించిన ర్యాంప్ ద్వారా అమర్చబడి ఉంటుంది, కావున రోగిని లోపల నుంచి బయటకు తీయడానికి మరియు బయట నుంచి లోపల ఉంచడానికి అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా మెడిసిన్ క్యాబినెట్ మరియు ఆక్సిజన్ సిలిండర్ బ్రాకెట్లు ఈ అంబులెన్స్ లో అందుబాటులో ఉంటాయి.

ఫోర్స్ ట్రావెలర్:
ఫోర్స్ ట్రావెలర్ భారతదేశంలో అంబులెన్సుగా ఉపయోగపడే వాహనం. ఇది మెరుగైన భద్రతలను అందిస్తుంది. ఇందులో లైవ్ ట్రాకింగ్ మరియు లైవ్ ఫుటేజ్ స్ట్రీమింగ్ వంటివి ఉంటాయి. కావున ఇది రోగి రావడానికి ముందు అంబులెన్స్ ను ట్రాక్ చేయడానికి మరియు దానికి అనుగుణంగా ఆసుపత్రిలో అవసరమైన ఏర్పాట్లు చేయడానికి సహాయపడుతుంది.

మహీంద్రా సుప్రో:
భారతదేశంలో అంబులెన్సులుగా ఉపయోగపడుతున్న వాహనాల జాబితాలో మహీంద్రా సుప్రో ఒకటి. కరోనా సమయంలో కంపెనీ దీనిని తక్షణ ఉపయోగం కూడా రూపొందించింది. కంపెనీ ఈ అంబులెన్స్ యొక్క మొదటి బ్యాచ్ ని మహారాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. ఇందులో ఫోల్డబుల్ స్ట్రెచర్ కమ్ ట్రాలీ, మెడికల్ కిట్ బాక్స్, ఆక్సిజన్ సిలిండర్ మొదలైనవన్నీ అందుబాటులో ఉంటాయి.

ఎంజి హెక్టర్:
ఎంజి మోటార్స్ యొక్క హెక్టర్ కూడా కరోనా సమయంలో అంబులెన్సుగా ఉపయోగపడింది. ఎంజి హెక్టర్ కరోనా సమయంలో గుజరాత్ ప్రభుత్వానికి అందించారు. ఇందులో ఆటోలోడింగ్ స్ట్రెచర్, ఆక్సిజన్ సిలిండర్, సహాయకుడి కోసం జంప్ సీటు మరియు మరెన్నో అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. కావున ఇది అంబులెన్సుగా వినియోగించడానికి అనుకూలంగా ఉంటుంది.

టయోటా ఇన్నోవా:
టయోటా కంపెనీ యొక్క ఇన్నోవా అంబులెన్స్ గా ఉత్పత్తి చేయనప్పటికీ, దీని భద్రతను ఇతర ఫీచర్స్ వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని అంబులెన్స్ గా ఉపయోగించడానికి అనువైనదిగా తెలిసింది. కరోనా మహమ్మారి సమయంలో టయోటా రెడ్ క్రాస్ సొసైటీ మరియు ప్రభుత్వానికి ఐదు కస్టమైజ్ ఇన్నోవా అంబులెన్సులను అందించింది.

బైక్ అంబులెన్స్:
భారతదేశంలో కార్లు (నాలుగు చక్రాల వాహనాలు) మాత్రమే కాకుండా బైకులు కూడా అంబులెన్సులుగా ఉపయోగపడుతున్నాయి. ఇందులో చెప్పుకోదగ్గది హీరో మోటోకార్ప్ అంబులెన్సులు.
ఇవి అంబులెన్సులుగా ఉపయోగించడానికి కావలసిన విధంగా మాడిఫై చేయడం జరిగింది. ఇందులో ఫస్ట్ ఎయిడ్ కిట్, ఆక్సిజన్ సిలిండర్, సైరన్ మొదలైనవి అందుబాటులో ఉన్నాయి. హీరో మోటోకార్ప్ కరోనా సమయంలో 60 యూనిట్ల మోడిఫై బైక్ అంబులెన్సులను ప్రభుత్వానికి అందించింది.


Click it and Unblock the Notifications








