ఓలా–ఉబర్‌కు చెక్.. దేశంలో మొదటిసారి..డ్రైవర్‌కు మొత్తం కమిషన్ దక్కించే క్యాబ్ సర్వీస్
భారతదేశ రవాణా రంగంలో ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలుకుతూ భారత్ టాక్సీ అనే సహకార (Co-operative) ఆధారిత మొబిలిటీ ప్లాట్‌ఫామ్ అధికారికంగా ప్రారంభమైంది. ఓలా (Ola), ఉబర్ (Uber), ర్యాపిడో (Rapido) వంటి ప్రైవేట్ యాప్‌లకు ఇది సరికొత్త ప్రత్యామ్నాయంగా నిలవనుంది.
ముఖ్యంగా కమర్షియల్ డ్రైవర్లకు తమ ఆదాయంపై మరింత కంట్రోల్, మంచి సంపాదన, వారి జీవనోపాధిపై పూర్తి యాజమాన్యాన్ని కల్పించే లక్ష్యంతో ఈ ప్లాట్‌ఫామ్ రూపొందించారు. ఇది కమీషన్ రహిత (No Commission) మోడల్‌లో పనిచేయడం ద్వారా ప్రైవేట్ యాప్‌ల నుంచి భిన్నంగా నిలుస్తోంది, అంటే డ్రైవర్లు రైడ్‌ల ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని వారే ఉంచుకోవచ్చు.

భారత్ టాక్సీ' అంటే ఏమిటి? యాజమాన్యం ఎవరిది?
భారత్ టాక్సీ అనేది పూర్తిగా రిజిస్టర్డ్ డ్రైవర్ల యాజమాన్యంలో నడుస్తున్న ఒక సహకార ట్యాక్సీ-హెయిలింగ్ వ్యవస్థ. ఇది MSCS చట్టం, 2002 కింద సాహ్‌కార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ (Sahkar Taxi Cooperative Ltd) ద్వారా నిర్వహించబడుతోంది. ప్రభుత్వ యాజమాన్యం లేని, ప్రపంచంలోనే మొట్టమొదటి జాతీయ రైడ్-హెయిలింగ్ నెట్‌వర్క్‌గా ఇది గుర్తింపు పొందింది.
ఈ కోఆపరేటివ్‌కు ఇఫ్కో (IFFCO), నాబార్డ్ (NABARD), ఎన్‌డీడీబీ (NDDB), ఎన్‌సీడీసీ (NCDC), జీసీఎంఎంఎఫ్ (GCMMF) వంటి ఎనిమిది పెద్ద సంస్థల సహకారం ఉంది. ఈ ప్లాట్‌ఫామ్ డ్రైవర్లచే నిర్వహించబడుతున్నందున, ఇందులో సభ్యులు కేవలం సర్వీస్ ప్రొవైడర్స్ (Service Providers) మాత్రమే కాకుండా, ప్లాట్‌ఫామ్‌లో వాటాదారులుగా (Stakeholders) మారుతారు.

డ్రైవర్లకు 100% ఆదాయం
ఈ కొత్త యాప్‌లో అతిపెద్ద మార్పు ఆదాయం విషయంలోనే ఉంది. డ్రైవర్లు ఇప్పుడు మధ్యవర్తులకు అధిక కమీషన్లు చెల్లించాల్సిన అవసరం లేకుండా, ప్రతి రైడ్ నుంచి వచ్చే 100% ఆదాయాన్ని తమ వద్దే ఉంచుకుంటారు. అంతేకాకుండా, సభ్యులు సహకార బోర్డులో ప్రజాస్వామ్య ప్రాతినిధ్యం కలిగి ఉంటారు. వార్షిక లాభాలు, డివిడెండ్లను పంచుకుంటారు.
ఈ ప్లాట్‌ఫామ్ టూ-వీలర్లు, ఆటోలు, ట్యాక్సీలు, ఫోర్-వీలర్లను ఒకే నెట్‌వర్క్‌లోకి తీసుకువస్తుంది. ప్రయాణీకుల కోసం రియల్-టైమ్ రైడ్ ట్రాకింగ్, బహుళ భాషా ఇంటర్‌ఫేస్, పారదర్శక ధరల నిర్మాణం, 24/7 కస్టమర్ సర్వీస్ వంటి ముఖ్య ఫీచర్లను అందిస్తుంది. మెరుగైన భద్రత కోసం ఢిల్లీ పోలీసులు రూపొందించిన సేఫ్టీ ఫ్రేమ్‌వర్క్ కూడా ఇందులో ఉంది.

ఓలా, ఉబర్‌పై డ్రైవర్ల ఫిర్యాదులకు పరిష్కారం
ప్రైవేట్ యాప్‌లలో డ్రైవర్లు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలైన - పెరుగుతున్న కమీషన్ల కారణంగా తగ్గిన ఆదాయం, ప్లాట్‌ఫామ్ విధానాలలో ప్రాతినిధ్యం లేకపోవడం, ఊహించని చెల్లింపులు వంటి వాటికి సహకార మోడల్ పరిష్కారం చూపుతుంది.
పూర్తి యాజమాన్యం, పారదర్శక ఖాతాలు, లాభాల భాగస్వామ్యాన్ని అందించడం ద్వారా, కమర్షియల్ డ్రైవింగ్ వృత్తికి సుస్థిరత తీసుకురావడానికి ఈ ప్లాట్‌ఫామ్ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఈ యాప్ ఢిల్లీ, గుజరాత్‌లలో బీటా టెస్టింగ్ కోసం ఆండ్రాయిడ్ ఫోన్లలో అందుబాటులో ఉంది. త్వరలోనే ముంబై, బెంగళూరు, పూణేలతో పాటు ఇతర ప్రధాన మెట్రో నగరాలకు విస్తరించడంతో పాటు ఐఓఎస్ వెర్షన్ కూడా విడుదల కానుంది. ఇక ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణంతో పాటు, డ్రైవర్లకు చేతి నిండా డబ్బులు వస్తాయి.


Click it and Unblock the Notifications








