155 చలాన్లు, రూ. 86,500 జరిమానా.. AI కెమెరా పనితనంతో ఖంగు తిన్న బైకర్, బైక్ అమ్మినా అంత డబ్బు రాదేమో.!!
భారత్‌లో వాహనదారులు తరచూ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడటం సాధారణమే. ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమించిన వారికి సీసీ కెమెరాల సాయంతో పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. అయితే కొందరి వాహనాలపై పదుల సంఖ్యలో ఉల్లంఘన కేసులు నమోదైన సందర్భాలూ ఉన్నాయి. కానీ వారు దర్జాగా రోడ్లపై తిరుగుతుంటారు. అందుకు ఉదాహరణే ఈ బైకర్..
రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు తగ్గించేందుకు కేరళ ప్రభుత్వం గత కొన్ని నెలల క్రితం AI కెమెరాలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. వీటి ద్వారా వాహనదారులు చేసే ఏ చిన్న తప్పునైనా ఇట్టే పసిగట్టి.. ఫొటోలు తీసి ట్రాఫిక్ అధికారులకు పంపిస్తుంది. తద్వారా సదరు వాహనదారులకు చలానా పంపిస్తున్నారు. ఇప్పటికే కేరళలోని వివిధ ప్రాంతాల్లో AI కెమెరాలు ఏర్పాటయ్యాయి.

కేరళలో ఈ సిస్టమ్ అమల్లోకి వచ్చాక చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. రోడ్డు ప్రమాదాలు కూడా చాలా వరకు తగ్గినట్లు నివేదికల్లో వెల్లడైంది. అయితే ఈ AI కెమెరాల నిఘా ఇంత ఉన్నప్పటికీ కొంత మంది దానిని చాలా లైట్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా కేరళకు చెందిన ఓ యువకుడిపై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 155 ఉల్లంఘనల కేసు నమోదయ్యాయి. ఈ మొత్తం అక్షరాలా రూ. 86,500.
ఇందుకు సంబంధించిన నివేదిక కేరళలోని కన్నూర్ జిల్లా నుంచి రాగా.. ఈ కేసులన్నీ కన్నూర్‌లోని మటూల్ ప్రాంతంలో జరిగినట్లు ట్రాఫిక్ అధికారులు వెల్లడించారు. మటూల్‌లో బైకర్ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ఫొటోలను AI కెమెరా బంధించింది. బైకర్ ఇదే అలవాటుగా చేసుకుని బైక్‌పై ఏకంగా 155 సార్లు కెమెరాకు చిక్కాడు.

బైక్‌పై వెళ్తూ బైకర్ ఇలా తరచూ ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమించడాన్ని గమనించిన మోటారు వాహన శాఖ అధికారులు అందుకు సంబంధించిన చలాన్లను జారీ చేసి ఏకంగా బైకర్ నివాసానికి తీసుకెళ్లి అప్పగించారు. అధికారులు ఇచ్చిన 86,500 జరిమానాను చూసి బైకర్ ఆశ్చర్యపోయాడు. కేరళలో AI కెమెరా ద్వారా జారీ అయిన అత్యధిక చలానా ఇదే కావడం గమనార్హం.
అయితే సదరు రైడర్ బైక్‌పై హెల్మెట్ లేకుండా వెళ్లడమే కాదు.. చాలా సార్లు AI కెమెరాను వెక్కిరించిన సందర్భాలూ ఉన్నాయట. రైడర్‌కు తాను నివసించే ప్రాంతంలో AI కెమెరాలు ఉన్నాయని తనకు తెలుసు కాబట్టే.. కావాలనే తరచూ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడని అధికారులు అంటున్నారు.

కాగా ట్రాఫిక్ రూల్స్ పట్ల బైకర్‌కు మొదట్లో మోటార్ వెహికల్ డిపార్ట్‌మెంట్ అధికారులు.. ఇలాంటి పొరపాట్లు రిపీట్ కాకుండా చూసుకోవాలని మెసేజ్‌లు, నోటీసులు పంపించారు. అయినప్పటికీ వాటన్నిటినీ బేఖాతరు చేస్తూ బైకర్ ఇలాంటి చర్యలకు పాల్పడుతూనే ఉన్నాడు. దీంతో ఏకంగా అతని ఇంటికే వెళ్లి 155 చలాన్లు అందజేశారు.
బైకర్ ఆ మొత్తాన్ని ఒకేసారి చూసి ఖంగు తిన్నాడు. వాటిని రద్దు చేయాలని అధికారులను అభ్యర్థించాడు. చలాన్లు కట్టడానికి బైక్‌ను విక్రయించినా అంత మొత్తం రాదని పేర్కొన్నాడు. తమ చేతుల్లో ఏమీ లేదని.. ఏమీ చేయలేమని మోటారు శాఖ అధికారులు సమాధానమిచ్చారు. అంతే కాకుండా అతని డ్రైవింగ్ లైసెన్స్‌ను ఏడాది పాటు సస్పెండ్ చేశారు.

సేఫ్ కేరళ ప్రాజెక్ట్‌లో భాగంగా కొన్ని నెలల క్రితం రాష్ట్రవ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలను ఏర్పాటు చేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. యాక్సిడెంట్లు, ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమించే వారి సంఖ్యను తగ్గించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. కాగా ఈ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 726 AI కెమెరాలను ఏర్పాటు చేశారు.
కేరళ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ. 232 కోట్ల పెట్టుబడి పెట్టగా.. ఈ ప్రాజెక్టును అమల్లోకి తేవడంతో రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని గతంలో రవాణా శాఖ మంత్రి తెలిపారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో కెమెరాలు ఉల్లంఘనలను గుర్తించి వాటికి సంబంధించి అదే చలాన్లను జారీ చేస్తుంది.
హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే రూ. 500 జరిమానా విధిస్తుంది. కాగా బైక్‌పై ముగ్గురు వ్యక్తులు వెళ్తే.. రూ. 1,000. ఫోన్ మాట్లాడుతూ కారు డ్రైవింగ్ చేయడం లేదా బైక్ రైడింగ్ చేస్తే.. రూ. 2000 జరిమానా విధిస్తుంది. దేశంలో తరచూ యాక్సిడెంట్లు నమోదు అవుతుండటంతో దేశవ్యాప్తంగా ఇలాంటి AI కెమెరాల అవసరం ఎంతైనా ఉంది.


Click it and Unblock the Notifications








