బిలినీయర్ మనసుదోచిన ఆటో ఇదే!.. ధర తెలిస్తే మీరు కొనేస్తారు
సాధారణంగా బిలినీయర్ అంటే ఓ లగ్జరీ కారు లేదా.. లగ్జరీ బైకు కొనుగోలు చేస్తారు. అయితే ఇటీవల ఓ ప్రముఖ వ్యాపారవేత్త మాత్రం దానికి భిన్నంగా ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం.. జోహో కార్పొరేషన్ సీఈఓ 'శ్రీధర్ వెంబు' ఇటీవల ఓ కొత్త ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయనే స్వయంగా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. ఇందులో ఆయన ఆటోలో కూర్చుని ఉండటం చూడవచ్చు. ఇప్పటికే వేల సంఖ్యలో లైక్స్ పొందిన ఈ ఫొటోలపైన.. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు.

శ్రీధర్ వెంబుకు ఎలక్ట్రిక్ వాహనాలంటే చాలా ఇష్టం.. ఈ కారణంగానే 2022లో ఈయన 'టాటా నెక్సాన్ ఈవీ'ను కొనుగోలు చేశారు. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేశారు. ఈ ఆటోను కొనుగోలు చేసిన సందర్భంగా మురుగప్ప గ్రూప్ నుంచి ఎలక్ట్రిక్ ఆటో మోంట్రా ఇక్కడకు రావడం చాలా ఆనందంగా ఉందని శ్రీధర్ వెంబు ట్వీట్ చేశారు. అంతే కాకుండా వేగవంతమైన పికప్, మంచి సస్పెన్షన్ చాలా అద్భుతంగా ఉన్నాయని అన్నారు.
శ్రీధర్ వెంబు తన వ్యక్తిగత అవసరాల కోసం ఈ ఎలక్ట్రిక్ ఆటోను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే అత్యంత ఖరీదైన అన్యదేశ్య కార్లను కొనుగోలు చేసి ఉపయోగిస్తున్న ఈ కాలంలో ఒక బిలినీయర్ ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేయడం పలువురిని కొంత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కానీ 10 కిమీ లోపు వెళ్లాల్సి వస్తే.. దానికోసం ఎలక్ట్రిక్ ఆటో ఉపయోగిస్తానని శ్రీధర్ వెంబు పేర్కొన్నారు.

కొంత ఎక్కువ దూరం ప్రయాణించాలంటే.. టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారును ఉపయోగిస్తానని, తక్కువ దూరాల కోసం ఎలక్ట్రిక్ ఆటో ఉపయోగించాలనే ఉద్దేశ్యంతో కొనుగోలు చేసినట్లు వెంబు పేర్కొన్నారు. రోజువారీ వినియోగానికి.. ఇరుకైన ప్రదేశాల్లో ప్రయాణించడానికి ఈ ఎలక్ట్రిక్ ఆటో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆటో చూడటానికి మంచి డిజైన్ కలిగి ఆధునిక కాలంలో ఉపయోగించడానికి కావలసిన ఫీచర్స్ పొందుతుంది.
సాధారణంగా భారతదేశంలో ఆటో రిక్షా అంటే.. దానిని దాదాపు వాణిజ్య వినియోగాలకు మాత్రమే ఉపయోగిస్తారు. తక్కువ దూరాలకు ప్రయాణించడానికి లేదా ఒక్కరి వినియోగం కోసం ఆటోలను కొనుగోలు చేయడం చాలా తక్కువ అని తెలుస్తోంది. అంతే కాకుండా ప్రజలు తమ ఇమేజ్‌కి ఆటోలు సరిపోవని భావించడం వల్ల వీటిని సొంత వినియోగానికి ఉపయోగించరు. కాబట్టి మనదేశం వైట్ నెంబర్ ప్లేట్ ఉన్న ఆటోలు దాదాపు లేవనే చెప్పాలి.

శ్రీధర్ వెంబు మోంట్రా ఎలక్ట్రిక్ ఆటోను మాత్రమే కాకుండా.. ఇప్పటికే రెండు ఎలక్ట్రిక్ ఆటోలను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. మోంట్రా ఎలక్ట్రిక్ సూపర్ ఆటో 2022లో దేశీయ మార్కెట్లో అడుగుపెట్టింది. మురుగప్ప గ్రూప్ యొక్క ఈ ఎలక్ట్రిక్ ఆటో ఇన్నోవేటివ్ లాస్ట్ మెయిల్ మొబిలిటీ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్ విభాగంలో 2023 అంతర్జాతీయ రెడ్ డాట్ డిజైన్ అవార్డు గెలుచుకుంది.
దేశీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఈ ఎలక్ట్రిక్ ఆటో.. ఈ ఏడాది ప్రారంభంలో అప్డేటెడ్ వెర్షన్ రూపంలో మార్కెట్లో అడుగెట్టింది. శ్రీధర్ వెంబు ఆ అప్డేటెడ్ మోడల్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ వెర్షన్ 10 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక సింగిల్ చార్జితో ఏకంగా 203కిమీ రేంజ్ అందిస్తుందని ARAI ద్వారా ధృవీకరించబడింది.
మోంట్రా ఎలక్ట్రిక్ ఆటో ధర రూ. 3.02 లక్షల నుంచి రూ. 3.50 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది. ఇక శ్రీధర్ వెంబు కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్ కారు టాటా నెక్సాన్ విషయానికి వస్తే.. ఇది మీడియం రేంజ్ వెర్షన్ అని పిలువబడే ఫ్రీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్. ఇది 30.2 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ కలిగి ఒక సింగిల్ చార్జితో ఏకంగా 312 కిమీ అందిస్తుందని సమాచారం.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








