ఆడి Q7 లగ్జరీ కారులో తళుక్కుమన్న బాలీవుడ్ బ్యూటీ బిపాసా బసు.. ప్రత్యేకతలివే.!!
బాలీవుడ్ బ్యూటీ బిపాసా బసు ఇటీవల ఖరీదైన లగ్జరీ కారులో తళుక్కుమంది. దాదాపు రూ. 90 లక్షలు ఖరీదైన ఆడి క్యూ7 కారులో బిపాసా బయటకు వచ్చారు. ఇంకా బాలీవుడ్ ముద్దుగుమ్మలు కరీనా కపూర్, మలైకా అరోరాలు మెర్సిడెస్ బెంజ్, రేంజ్ రోవర్ కార్లలో బయటకు వచ్చి ఫ్యాన్స్‌ను అలరించారు.
సినీ సెలబ్రిటీలు ఏం చేసినా స్పెషలే.. అందుకే వారికి సంబంధించిన ఏ చిన్న విషయమైనా నెట్టింట్లో తెగ సందడి చేస్తుంది. వారి స్టేటస్, స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా అవ్వాల్సిందే.. ముఖ్యంగా హీరోయిన్లు.. సాధారణంగా ఆడవారికి నగలు, చీరలంటే మోజు అంటారు. కానీ మన హీరోయిన్లకు మాత్రం లగ్జరీ కార్లలో తిరగడమంటే చాలా పిచ్చి. అందుకే వారి స్టేటస్‌కు తగినట్లుగా ఖరీదైన కార్లలో బయటకు వస్తారు.

బిపాసా బసు, కరీనా కపూర్, మలైకా మరోరా.. ఈ ముగ్గురికీ బాలీవుడ్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. హిట్ సినిమాలు, సూపర్ హిట్ స్పెషల్ సాంగ్స్‌తో కుర్రకారు గుండెల్లో గూడు కట్టుకున్నారు. ఈ క్రమంలో వారు ముగ్గురూ వేర్వేరుగా లగ్జరీ కార్లలో తిరుగుతూ పలు చోట్ల ఫొటోలకు పోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలో యూట్యూబ్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి.
మొదటగా బిపాసా బసు విషయానికొస్తే.. ఈ బ్యూటీ దళపతి విజయ్ నటించిన సచియన్ చిత్రంలో నటించింది. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య 'కెమిస్ట్రీ' బాగా వర్కవుట్ అయింది. కానీ ప్రస్తుతం బిపాసా(Bipasha Basu) ఇప్పుడు చాలా మారిపోయిందని వీడియోల ద్వారా తెలుస్తుంది.

తాజాగా బిపాసా.. ఆడి క్యూ7 ఎస్‌యూవీ కారులో తళుక్కుమంది. దేశీయ మార్కెట్లో ప్రస్తుతం Audi Q7 బేస్ వేరియంట్ ధర రూ. 84.70 లక్షలుగా ఉంది. కాగా టాప్ వేరియంట్ ధర రూ. 92.30 లక్షలుగా ఉంది. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు.
ఇక బాలీవుడ్ ముద్దుగుమ్మ కరీనా కపూర్ Mercedes-Benz S-క్లాస్‌లో కనిపించింది. ఇది సెడాన్ కారు. భారత మార్కెట్లో Mercedes-Benz S-క్లాస్ కారు బేస్ వేరియంట్ ధర ప్రస్తుతం రూ.1.71 కోట్లుగా ఉంది. టాప్ వేరియంట్ ధర రూ. 2.17 కోట్లు(ఎక్స్ షోరూమ్). కరీనా కపూర్ వద్ద మెర్సిడెస్‌తో పాటు పలు లగ్జరీ కార్లు ఉన్నాయి.
చివరగా మలైకా అరోరా.. ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ కారులో ఫ్యాన్స్‌ను అలరించింది. ప్రస్తుతం ఈ కారు బేస్ వేరియంట్ ధర రూ.2.39 కోట్లుగా ఉంది. అదే సమయంలో, ఈ కారు టాప్ వేరియంట్ ధర రూ. 4.17 కోట్లు(ఎక్స్ షోరూమ్)గా ఉంది.
ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ చాలా ఖరీదైన లగ్జరీ కారు.. సిని సెలబ్రిటీలే కాకుండా వీఐపీలు, ప్రముఖ వ్యాపారవేత్తలు రేంజ్ రోవర్ LWB వేరియంట్‌ను కలిగి ఉన్నారు. ఈ కారులో వెళ్తున్నప్పుడు బయట నుంచి ఏ విధమైన నాయిస్ కూడా లోపలికి వినిపించదు. గరుకైన రోడ్లపై సైతం రేంజ్ రోవర్ చాలా ఈజీగా ప్రయాణికులకు ఏ విధమైన ఇబ్బంది కలిగించకుండా ప్రయాణిస్తుంది.
అందుకే సెలబ్రిటీలు ఎక్కువగా రేంజ్ రోవర్(Land Rover Range Rover) కారును ఇష్టపడతారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నేషనల్ అవార్డ్ విన్నర్ అల్లు అర్జున్, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, నటి కత్రినా కైఫ్, రణ్‌బీర్- ఆలియా భట్ జంట, విరాట్ కోహ్లీతో అంబానీ ఫ్యామిలీ ఈ ఖరీదైన రేంజ్ రోవర్ కారును కలిగి ఉన్నారు.


Click it and Unblock the Notifications








