అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టిన కొత్త హ్యుందాయ్ ఎక్స్‌టర్..
రోడ్లపై ప్రమాదాలు నిత్యకృత్యమైపోయాయి. నిర్లక్ష్య డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రైవింగ్‌పై అవగాహన లేకపోవడం ఇలా పలు కారణాల ద్వారా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఒక్కోసారి వాహనం అదుపు తప్పి రోడ్డుపై దూసుకెళ్లిన సందర్భాలూ ఉన్నాయి. తాజాగా గుజరాత్‌లో ఓ ప్రమాదం వీడియో వైరల్‌గా మారింది.
హ్యుందాయ్ ఇటీవలే తన ఎంట్రీ - లెవెల్ SUV, ఎక్స్‌టర్‌నుమార్కెట్లో విడుదల చేసింది. ఈ మైక్రో SUV డెలివరీలు ఇప్పటికే ప్రారంభం కూడా అయ్యాయి. మార్కెట్‌లో టాటా పంచ్‌కు హ్యుందాయ్ ఎక్స్‌టర్(Exter) గట్టి పోటీనిస్తుంది. టాటా పంచ్‌తో పోలిస్తే హ్యుందాయ్.. ఫీచర్లు, భద్రత మరియు నిర్మాణ నాణ్యత పరంగా చాలా ఆఫర్లను ప్రవేశపెట్టింది.

ఇటీవల సరికొత్త హ్యుందాయ్ ఎక్స్‌టర్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. సరికొత్త హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఎస్‌యూవీ రోడ్ డివైడర్‌ను ఢీకొట్టింది. అయితే టెస్ట్ డ్రైవ్ చేస్తున్న కారునా లేక కస్టమర్‌కు డెలివరీ చేసిన కారునా అనేది స్పష్టత లేదు. డ్రైవర్ వాహనంపై కంట్రోల్ కోల్పోవడంతో అది కుడి వైపున ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది.
వీడియోను చూసినట్లయితే రహదారికి అవతలి వైపున బస్సు వెళుతోంది. అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టే క్రమంలో ఎక్స్‌టర్ బస్సును ఢీకొట్టినట్లు వీడియో ద్వారా అర్థమవుతోంది. ఘటనలో కొత్త హ్యుందాయ్ ఎక్స్‌టర్ బానెట్‌పై స్వల్పంగా డ్యామేజ్ కూడా అయింది. ప్రమాదం అనంతరం స్థానికులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కారును సురక్షితంగా రోడ్డుపైకి చేర్చేందుకు డ్రైవర్‌కు సహాయం చేశారు.

అయితే ఇక్కడ బానెట్‌పై చిన్న డెంట్ తప్ప పెద్దగా ప్రమాదమేమీ జరగలేదు. అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగినట్లు తెలుస్తోంది. వర్షాల కారణంగా రోడ్డు బురదగా ఉండటంతో కారు స్కిడ్ అయి ఉండే అవకాశం ఉంది. ఈ ప్రమాదం వెనుక ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. కారులో ఉన్నవారికి ఏమైనా గాయాలయ్యాయా అనే సమాచారం కూడా అందుబాటులో లేదు.
ఈ ఘటన రోడ్డుపై నిర్లక్ష్య, అవగాహన లేని డ్రైవింగ్ కారణంగా జరిగే ప్రమాదానికి ఉదాహరణ. ముఖ్యంగా వర్షాకాలంలో రోడ్లపై వాహనాల్లో ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దృష్టి మొత్తం డ్రైవింగ్‌పైనే ఉంచాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వాహనదారులు గుర్తుంచుకోవాలి.
మార్కెట్‌లో సరికొత్త హ్యుందాయ్ ఎక్స్‌టర్ ప్రారంభ ధర రూ. 5.99 లక్షలుగా ఉంది. టాప్-ఎండ్ SX(O) వేరియంట్‌ను రూ. 9.31 లక్షల్లో కొనుగోలు చేయవచ్చు. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు. ఇది పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది.
1.2 లీటర్ 4-సిలిండర్ న్యాచురల్లీ అస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. 83 Ps వద్ద 113 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఎంపికలతో అందుబాటులో ఉంది. అదనంగా, ఇది సీఎన్‌జీ వేరియంట్‌లో 69 Ps వద్ద 95 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
హ్యుందాయ్ కార్ల మాదిరిగానే ఎక్స్‌టర్ కూడా ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, క్రూయిజ్ కంట్రోల్, ట్విన్ కెమెరా, డ్యాష్ కెమెరా వంటి అధునాతన ఫీచర్లు మరియు AMT వెర్షన్‌లో ప్యాడిల్ షిఫ్టర్‌లతో సహా సుదీర్ఘమైన ఫీచర్లను కలిగి ఉంది.
ఎక్స్‌టర్‌లో 14-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, LED DRLలు, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, LED టెయిల్ ల్యాంప్స్ సహా మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. కొత్త హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఈ సెగ్మెంట్‌లోని టాటా పంచ్ మరియు సిట్రోయెన్ C3 వంటి కార్లతో నేరుగా పోటీపడుతోంది. టాటా ఇటీవలే తాము పంచ్ CNG ఉత్పత్తిని ప్రారంభించినట్లు ప్రకటించింది.


Click it and Unblock the Notifications








