ఫోటోల కోసం కొత్త జంట విన్యాసాలు.. హైవేపై కదులుతున్న కారులో..
పెళ్లంటే వేద మంత్రాలు, ఏడు అడుగులు, మూడు ముళ్ళు ప్రధానమని హైందవ ధర్మం చెబుతోంది. అయితే కాలం మారింది, టెక్నాలజీ పెరిగింది.. దీంతో ఇవ్వాల్సిన వాటికి ప్రాధాన్యత తగ్గించి, అనవసరమైన విషయాలకు అధిక ప్రాధాన్యం కల్పించి అనుకోని ప్రమాదాలను స్వయంగా ఆహ్వానిస్తున్నారు.
ఈ రోజుల్లో పెళ్లి అంటే వెడ్డింగ్ షూట్ తప్పనిసరి అయిపోయింది. కాబోయే వధువు, వరుడు వారి అనుభూతులకు తగ్గట్టుగా.. నీటిలో, గాలిలో, ఆఖరికి బురదలో కూడా దొర్లుతూ ఫోటోలకు పోజులిచ్చిన సంఘటనలు ఇప్పటికే కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. అయితే ఇందులో కూడా చాలా ఎక్కువగా కనిపించే దృశ్యం ప్రయాణిస్తున్న కారు సన్‌రూఫ్ నుంచి బయటకు వచ్చి ఫోటోలకు ఫోజులివ్వడం. ఇలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో మీరు గమనించినట్లయితే.. హ్యుందాయ్ వెర్నా కారు హైవే మీద ప్రయాణిస్తూ ఉన్నప్పుడు, వధువు ఆ కారు సన్‌రూఫ్ నుంచి బయటకు రావడం చూడవచ్చు. మరో వెర్నా కారులో వరుడు, అతనికి ఇరువైపులా మరో ఇద్దరు సన్‌రూఫ్ వద్ద ఉండటం చూడవచ్చు. ఫోటోలు తీయడానికి ముందు మరో కారు వెళ్తున్న వారు కూడా సన్‌రూఫ్ ద్వారానే బయటకు వచ్చి ఫోటోలు క్లిక్ చేస్తున్నారు.
హైవే మీద ఫోటో షూట్ అంటే వారికి సరదాగా ఉండొచ్చు, కానీ అనుకోని ప్రమాదం జరిగితే వారికే కాదు హైవే మీద ప్రయాణిస్తున్న వారికి కూడా చాలా ప్రమాదం, ఈ ప్రమాదంలో ఏకంగా ప్రాణాలు కూడా పోవచ్చు. పువ్వులతో డెకరేట్ చేసిన కదిలే కార్లలో వారు ఫోటోలకు ఫోజులిస్తుంటే ఆ రోడ్డుపై వెళ్లే వారు కూడా వారినే చూస్తున్నారు. ఇది కూడా ప్రమాద హేతువే..

నిజానికి వెడ్డింగ్ ఫోటో అనేది ఆధునిక కాలంలో సర్వ సాధారణం అయిపోయింది. అయితే ఈ ఫోటో షూట్ కోసం సాహసాలు చెయ్యాల్సిన అవసరం లేదు, ఇటీవల ఓ జంట నదిలో ఫోటో షూట్‌కు ఫోజులిస్తున్న సమయంలో అనుకోని అతిధి మొసలి రూపంలో వచ్చేసింది, దీంతో పోజులిస్తున్నవారు హడలిపోయి బయటకు వచ్చేసారు. అయితే ఈ సంఘటనలో ఎవరికీ ఏ ప్రమాదం జరగలేదు.
కారులో సన్‌రూఫ్ ఎందుకు ఇచ్చారంటే..
ఆధునిక కాలంలో దాదాపు చాలా కార్లలో సన్‌రూఫ్ అనేది ఒక సాధారణ ఫీచర్ అయిపోయింది. నిజానికి ఈ సన్‌రూఫ్ అనేది కారులోకి గాలి, వెలుతురు రావడానికి ఏర్పాటు చేసిన ఒక ఫీచర్. అయితే వినియోగదారులు ఇది వదిలేసి ప్రయాణించే సమయంలో సన్‌రూఫ్ ద్వారా బయటకు వస్తున్నారు. ఒక వ్యక్తి సన్‌రూఫ్ ద్వారా బయటకు వచ్చినప్పుడు స్పీడ్ బ్రేక్స్ వద్ద లేదా సడన్ బ్రేక్ వేసినప్పుడు ప్రమాదానికి గురవుతారు.
కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ సన్‌రూఫ్ ద్వారా బయటకు వెళ్ళడానికి అనుమతిస్తూ ఉంటారు. పిల్లలు బయట జరిగే సంఘటను చూస్తూ తన్మయంతో ఉండే సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే కారులో ఉన్నవారి కంటే బయట ఉన్నవారికి ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ప్రమాదం జరిగినప్పుడు కారులో ఉన్న వారి పరిస్థితే ప్రశ్నార్థకం? అలాంటిది సన్‌రూఫ్ ద్వారా బయట నిలబడి ఉన్న వ్యక్తి పరిస్థితి ఏమవుతుందో మీరే ఊహించుకోవచ్చు.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








