ఎండకు కరిగిపోయిన కారు ముందు భాగం..డబ్బులు చెల్లించాలన్న కంపెనీ.. అవ్వాక్కైన ఓనర్
దేశంలో ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వివిధ నగరాల్లో దాదాపు 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడి తాపానికి బయటకు రావాలంటే జనాలు జంకుతున్నారు. పగలు 10 దాటితే చాలు సూరీడు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ ఎండకు మనుషులు, జంతువులే కాదు ఆఖరకు వాహనాలు కూడా మాడి మసై పోతున్నాయి.
ఎండవేడిమిని ఉపయోగించి కొందరు వ్యక్తులు వినూత్నంగా రోడ్లపై ఆమ్లెట్ వేయడం.. చపాతీలు చేయడం.. ఇంకా ఎన్నో వింతల్ని ప్రదర్శించిన వీడియోలు ఇప్పటికీ వైరల్ గా ఉన్నాయి. అలానే ఎండ తీవ్రతను తట్టుకోలేక మూవ జీవాలు రోడ్డున పడి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఒక కారులోని ముందు భాగం ఎండ వేడిమికి కరిగిపోయింది. ఈ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తుంది.

కర్ణాటక రాజధాని బెంగుళూరు సిటీ చల్లని వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. ఇది భారతదేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే, బెంగళూరులో ఎండ తీవ్రత కాస్త తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇక్కడ కూడా ఎండలు భగభగమంటున్నాయి. ఎండ తీవ్రతను తట్టుకోలేక జనాలు అల్లాడుతున్నారు. తాజాగా ఎండ తీవ్రతకు కారు గ్రిల్ కరిగి పోయింది. ఆ వివరాలు మీకోసం..
ఏప్రిల్ 12వ తేదీన బెంగుళూరులో నగరంలోని ఓ ప్రాంతంలో సౌరవ్ నెహతా అనే వ్యక్తి తన టాటా హ్యారియర్ కారును పార్క్ చేశాడు. దాదాపు 10 గంటలపాటు ఎండలో పార్క్ చేసిన కారును చూసిన అతను నివ్వెరపోయాడు. ముందు భాగంలోని బంపర్ గ్రిల్ ప్యానెల్ పూర్తిగా కరిగిపోయాయి. ఏం జరిగిందని అవ్వాక్ అవ్వడం తన వంతు అయ్యింది.
ఎండకు పార్క్ చేసిన కారులోని గ్రిల్, బంపర్ తీవ్ర వేడికి కరిగిపోవడంతో అక్కడి స్థానిక ప్రజలు అవాక్కయ్యారు. కేవలం ఎండ తీవ్రతకి గ్రిల్ కరిగిపోయిన విధానాన్ని చూసిన కొందరు టాటా కార్ల యజమానులు ఆందోళన చెందుతున్నారు. టాటా మోటార్స్‌కు చెందిన ప్రముఖ కార్లలో ఒకటైన టాటా హ్యారియర్ కేవలం ఎండ కారణంగా ఇలా జరగడం ఏంటని ఆందోళన చెందుతున్నారు.
దీనికి సంబంధించిన చిత్రాలను కారు యజమాని సౌరవ్ నెహతా ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఇక్కడ కార్ కి ఏం జరిగిందో కనుక్కోండి అంటూ తాను చేసినా ట్వీట్ వైరల్ గా మారింది. 2021డిసెంబర్ లో ఈ SUV ని కొనుగోలు చేసినట్లు ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ఈ కారుకు ఉన్న క్రేజ్ కారణంగా దీనిని కొనుగోలు చేసినట్లు అతను తెలిపాడు. ఈ కారు నిర్మాణ నాణ్యత రివ్యూలు టాటా హ్యారియర్ ను కొనుగోలు చేసేలా చేశాయని అన్నాడు.
దీనిని సరిచేయమని కోరగా టాటా మోటార్స్ డబ్బు చెల్లించమని అనడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. టాటా మోటార్స్ వంటి పేరొందిన కంపెనీలు ఇటువంటి సంఘటనలను తేలికగా తీసుకోవడం మంచిదికాదని అతను హితవు పలికాడు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనల ద్వారా టాటాకు ఉన్న క్రేజ్ తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు.
ఇలా అక్కడే పార్క్ చేసిన ఇతర కార్లకు ఎలాంటి డ్యామేజ్ జరగలేదని అతను వివరించాడు. ఏది ఏమైనా దీనిని టాటా మోటార్స్ ఛాలెంజింగ్ తీసుకుని తనిఖీలు నిర్వహించవచ్చు. కేవలం ఎండ తీవ్రతకు విడిభాగాలు కరిగిపోయాయా? లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే విషయాన్ని గుర్తించనుంది. వీలయినంత త్వరగా దీనికి కారణం కనిపెట్టి నివేదిక ఇస్తుందని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications








