సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? మీటర్ రీడింగ్ మోసం సహా ఈ 5 విషయాలు చెక్ చేయకపోతే అంతే
ప్రస్తుతం కొత్త కార్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో చాలా మంది సెకండ్ హ్యాండ్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ ధరలో మంచి బ్రాండ్ కారు వస్తుందన్న ఆశతో ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్ లేదా లోకల్ డీలర్ల దగ్గర కార్లను పరిశీలిస్తుంటారు. OLX, Cars24, Spinny లాంటి ప్లాట్‌ఫార్మ్స్ వల్ల ఇంట్లో కూర్చునే కారు ఫైనల్ చేసేయొచ్చు. అయితే, ఇక్కడే ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది.
కారు చూడటానికి కొత్త దానిలా మెరుస్తూ ఉండవచ్చు, కానీ లోపల ఇంజన్ కండిషన్ ఎలా ఉందో తెలుసుకోవడం కష్టం. ముఖ్యంగా ఓడోమీటర్ ట్యాంపరింగ్ (మీటర్ రీడింగ్‌ను తగ్గించడం) అనేది ప్రస్తుతం ఒక పెద్ద స్కామ్‌గా మారింది. కారు ఎంత తక్కువ కిలోమీటర్లు తిరిగితే అంత ఎక్కువ ధర వస్తుంది కాబట్టి కేటుగాళ్లు మీటర్ రీడింగ్‌ను మార్చేసి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. పాత కారు కొనేముందు మీరు మోసపోకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.

సర్వీస్ హిస్టరీని క్షుణ్ణంగా పరిశీలించండి:
పాత కారు కొనేటప్పుడు అతి ముఖ్యమైన డాక్యుమెంట్ సర్వీస్ హిస్టరీ. కారు ఏ కంపెనీదైతే, ఆ కంపెనీ అధికారిక సర్వీస్ సెంటర్లలో దాని రికార్డులు భద్రంగా ఉంటాయి. కారు ప్రతిసారి సర్వీసింగ్‌కు వెళ్ళినప్పుడు ఆ రోజు కారు ఎన్ని కిలోమీటర్లు తిరిగిందో ఆ రికార్డుల్లో నమోదు చేస్తారు. మీరు కారు యజమానిని అడిగి ఆ సర్వీస్ హిస్టరీని తీసుకోండి. ఒకవేళ వారు ఇవ్వడానికి నిరాకరిస్తే అక్కడ ఏదో తేడా ఉందని అర్థం. ఒకవేళ గత సర్వీసింగ్‌లో 80 వేల కిలోమీటర్లు ఉండి, ఇప్పుడు మీటర్ లో 50 వేలే చూపిస్తుంటే.. అది ఖచ్చితంగా మీటర్ ట్యాంపరింగ్ చేసినట్టే.
టైర్ల పరిస్థితిని గమనించండి:
సాధారణంగా ఒక కారు టైర్లు 40,000 నుంచి 50,000 కిలోమీటర్ల వరకు మన్నిక వస్తాయి. ఒకవేళ కారు మీటర్ లో కేవలం 20,000 కిలోమీటర్లే ఉండి, కారుకున్న నాలుగు టైర్లు కొత్తవిగా ఉంటే మీకు అనుమానం రావాలి. అంటే కారు ఎక్కువ దూరం తిరగడం వల్ల పాత టైర్లు అరిగిపోయి, కొత్తవి వేసి ఉండవచ్చు. అలాగే టైర్ల తయారీ తేదీని (Manufacturing Date) చెక్ చేయండి. అది కారు తయారీ తేదీతో మ్యాచ్ అవ్వాలి.

ఇంటీరియర్స్, పెడల్స్:
మీటర్ రీడింగ్‌ను మార్చవచ్చు కానీ, కారు వాడకాన్ని బట్టి లోపల అరిగిపోయే వస్తువులను మార్చడం కష్టం. కారు లోపల బ్రేక్ పెడల్, క్లచ్ పెడల్, యాక్సిలరేటర్ పెడల్స్ ఎంతవరకు అరిగిపోయాయో చూడండి. కారు కేవలం 30 వేల కిలోమీటర్లే తిరిగితే ఆ పెడల్స్ కొత్తవిగా ఉండాలి. ఒకవేళ అవి బాగా అరిగిపోయి ఉంటే, ఆ కారు కనీసం లక్ష కిలోమీటర్లు తిరిగినట్లు లెక్క. అలాగే సీట్లు, స్టీరింగ్ వీల్ కవర్లు, గేర్ నాబ్ ఎంతవరకు ముతకగా మారాయో గమనించండి.
డ్యాష్‌బోర్డ్ వెనుక రహస్యాలు:
అనలాగ్ మీటర్లు ఉన్న పాత కార్లలో మీటర్ ముళ్లను వెనక్కి తిప్పడానికి మీటర్ బాక్స్‌ను విప్పుతారు. అలా విప్పినప్పుడు డ్యాష్‌బోర్డ్ పై చిన్న చిన్న గీతలు పడటం లేదా మీటర్ గ్లాస్ లోపల దుమ్ము ఉండటం వంటివి జరుగుతాయి. ఇప్పుడు వస్తున్న డిజిటల్ మీటర్లను అయితే సాఫ్ట్‌వేర్ ద్వారా మారుస్తున్నారు. కాబట్టి డ్యాష్‌బోర్డ్ ఏరియాలో ఏవైనా అదనపు వైర్లు లేదా కనెక్షన్లు కనిపిస్తే అది అనుమానించదగ్గ విషయమే.

టెస్ట్ డ్రైవ్ సమయంలో జాగ్రత్త:
కారును నడుపుతున్నప్పుడు మీటర్ రీడింగ్ ఎలా మారుతుందో గమనించండి. రీడింగ్ సరిగ్గా పెరుగుతుందా లేదా ఎక్కడైనా ఆగిపోతుందా చూడండి. కారు నడుపుతున్నప్పుడు ఇంజన్ నుంచి వచ్చే సౌండ్, గేర్లు మారే విధానం వంటివి గమనించాలి. కారు తక్కువ కిలోమీటర్లే తిరిగినట్లు చూపిస్తున్నా, ఇంజన్ నుంచి విపరీతమైన శబ్దం వస్తుంటే అది ఇంజన్ కండిషన్ బాలేదని అర్థం.
మెకానిక్‌ను సంప్రదించడం ఉత్తమం:
మీకు కార్ల గురించి ఎంత అవగాహన ఉన్నా, ఒక నిపుణుడైన మెకానిక్‌ను వెంట తీసుకెళ్లడం చాలా ముఖ్యం. వారు కారును పైపైన చూడటమే కాకుండా, ఇంజన్ బే (Engine Bay) లోపల వైరింగ్, ఆయిల్ లీకేజీలను బట్టి కారు ఎంత దూరం ప్రయాణించిందో సులభంగా చెప్పగలరు. నేటి డిజిటల్ యుగంలో OBD స్కాన్ ద్వారా కారు అసలు రీడింగ్‌ను కూడా తెలుసుకునే వెసులుబాటు ఉంది.


Click it and Unblock the Notifications