కావాలనే బైక్‌ను ఢీకొట్టిన క్యాబ్ డ్రైవర్.. వైరల్ అవుతున్న వీడియో.. విరుచుకుపడుతున్న నెటిజన్లు
దేశంలో రహదారులపై ప్రమాదాలు సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. డ్రైవింగ్ నిర్లక్ష్యం, ఇతర పొరపాట్లు, హైవేలపై జంతువుల కారణంగా ప్రమాదాలు వాటిల్లుతున్నాయి. కానీ ఇటీవల తమిళనాడులో కావాలని ఓ క్యాబ్ డ్రైవర్.. బైక్‌ను ఢీకొట్టాడు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
తమిళనాడులో రహదారిపై ఇటీవల చోటుచేసుకున్న ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రహదారిపై వాహనాలు వెళుతుండగా మార్గమధ్యలో క్యాబ్ డ్రైవర్, బైక్ రైడర్ మధ్య స్వల్ప వాగ్వాదం అనంతరం క్యాబ్ డ్రైవర్ ఉద్దేశపూర్వకంగా బైక్‌ను ఢీకొట్టాడు. దీనిని మరో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

మారుతి సుజుకి టూర్ ఎస్‌ను నడుపుతున్న క్యాబ్ డ్రైవర్ మరియు రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 బైక్‌ను నడుపుతున్న వ్యక్తి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సంఘటనను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వ్యక్తి.. యమహా YZF R15ని నడుపుతున్నారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
కాగా ఘటనకు సంబంధించి పూర్తి కారణాలు అందుబాటులో లేవు. బుల్లెట్ రైడర్ క్యాబ్ డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగడం వీడియోలో చూడవచ్చు. కానీ వారి గొడవకు గల కారణం తెలియవు. ఇద్దరి మధ్య వాగ్వాదం అనంతరం.. క్యాబ్ డ్రైవర్ వేగంగా బైక్‌ను ఢీకొన్నాడు. దీంతో బైక్ అదుపు తప్పి ముందుకు దూసుకెళ్లింది.

కానీ ఆ వెంటనే అప్రమత్తమైన బైక్ రైడర్.. బండి వేగం తగ్గించాడు. బండి అదుపుతప్పడంతో అతని బ్యాగ్ కిందపడింది. గమనించిన బైక్ రైడర్ బ్యాగ్‌ను తీసుకునేందుకు బండిని రోడ్డు పక్కగా నిలిపాడు. క్యాబ్ డ్రైవర్ కూడా తన వాహనాన్ని ఆపి బయటకు వచ్చి బైకర్‌తో ఘర్షణను కొనసాగించాడు.
వారిద్దరు కొట్టుకునే స్థితికి రాకపోయినా.. ఇద్దరి మధ్య వాగ్వాదం మాత్రం కొనసాగింది. చివరికి, బుల్లెట్ రైడర్ తన బండిని ఢీకొన్నందుకు క్యాబ్ డ్రైవర్‌పై ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోకుండానే సంఘటనా స్థలం నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నారు. ఈ సంఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ట్వీట్ చేశారు.

కానీ అసలు ఈ వాదనను ఎవరు ప్రారంభించారనేది స్పష్టంగా తెలియదు. అయితే, క్యాబ్ డ్రైవర్ బైక్ రైడర్‌ను ఢీ కొట్టడం నడిరోడ్డుపై వాగ్వాదం చేయడం లాంటి చర్యలు చట్టపరంగా నేరం. ఘటనలో బైక్ నడుపుతున్న వ్యక్తి కింద పడి గాయాలు తగిలి ఉంటే, క్యాబ్ డ్రైవర్ తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చేది.
ఇలాంటి పరిస్థితుల్లో రహదారిపై ప్రయాణించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. లేదంటే గందరగోళం, చిరాకుతో కూడిన ప్రయాణ అనుభవాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎవరైనా రహదారిపై దూకుడు ప్రవర్తనను ప్రదర్శిస్తే, వారిని పట్టించుకోవడం మానేసి, మీరు సరైన క్రమంలో వాహనం నడపండి. రోడ్డుపై వెళ్తున్నప్పుడు అనవసరంగా హారన్లు మోగించవద్దు. దీని ద్వారా రోడ్డుపై ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతుంది. అవసరమైన సందర్భాల్లో మాత్రమే హారన్ ఉపయోగించాలి.

ఇతర డ్రైవర్లు దూకుడు ప్రదర్శించినా వాటిని వ్యక్తిగతంగా తీసుకోకపోవడం ఉత్తమం. రోడ్డుపై భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం మరియు ప్రశాంత వాతావరణాన్ని నిర్వహించడం చాలా అవసరం. వారి తీరు ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తుందని అనిపిస్తే వారి నంబరు ప్లేటు గుర్తుంచుకుని ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించండి.


Click it and Unblock the Notifications








