ఏసీ ఆన్ చేస్తే మైలేజీ పడిపోతుందా?.. పెట్రోల్ ఆదా చేయాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి
ఫిబ్రవరి నెల ముగుస్తోంది.. మార్చి నెల దగ్గరపడుతోంది. అంటే భానుడి భగభగలు మొదలైనట్టే. ఇప్పటికే మధ్యాహ్నం పూట ఎండలు మండిపోతున్నాయి. వేసవి కాలం రాకముందే ఏసీల వాడకం మెల్లగా పెరుగుతోంది. ముఖ్యంగా కారులో ప్రయాణించే వారికి ఏసీ లేనిదే క్షణం కూడా గడవదు. అయితే కారు ఏసీ విషయంలో వాహనదారుల మనసులో ఎప్పుడూ ఒకటే సందేహం ఉంటుంది. కారు ఆపి ఉంచినప్పుడు ఏసీ వేస్తే పెట్రోల్ ఎక్కువగా ఖర్చవుతుందా? లేక కారు నడుస్తున్నప్పుడు ఏసీ వేస్తే ఎక్కువ ఆయిల్ ఖర్చవుతుందా? ఈ విషయంలో ఉన్న అసలు నిజానిజాలను, నిపుణుల అభిప్రాయాలను వివరంగా తెలుసుకుందాం.
కారు ప్రయాణంలో అసలు పెట్రోల్ ఎక్కడ ఖర్చవుతుంది?
సాధారణంగా కారు ఇంజిన్ నడుస్తున్నప్పుడు మాత్రమే ఏసీ కంప్రెసర్ పనిచేస్తుంది. కారు కదులుతున్నప్పుడు ఏసీ వాడితేనే ఎక్కువ ఇంధనం ఖర్చవుతుందనేది వాస్తవం. ఎందుకంటే కారును ముందుకు నడిపించడానికి కావాల్సిన శక్తితో పాటు ఏసీ కంప్రెసర్‌ను తిప్పడానికి కూడా ఇంజిన్ అదనపు శ్రమ చేయాల్సి ఉంటుంది.

దీనివల్ల ఇంజిన్‌పై లోడ్ పెరిగి పెట్రోల్ వినియోగం పెరుగుతుంది. ముఖ్యంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న నగరాల్లో స్టాప్ అండ్ గో (ఆగుతూ సాగుతూ) వెళ్లేటప్పుడు మైలేజీ దారుణంగా పడిపోతుంది. ఎందుకంటే కారును పదేపదే వేగవంతం చేయాల్సి వచ్చినప్పుడు ఏసీ లోడ్ ఇంజిన్‌పై మరింత భారాన్ని పెంచుతుంది.
ఆపి ఉంచిన కారులో ఏసీ వేస్తే ఎంత ఖర్చవుతుంది?
చాలామంది కారును పార్క్ చేసి లోపల కూర్చుని ఏసీ వేసుకుంటారు. దీన్నే ఆయిడ్లింగ్ అని పిలుస్తారు. కారు నిలకడగా ఉన్నప్పుడు ఇంజిన్ కేవలం ఏసీ కంప్రెసర్‌ను నడపడానికి మాత్రమే పనిచేస్తుంది కాబట్టి, ప్రయాణిస్తున్నప్పటికంటే ఖర్చు తక్కువగానే ఉంటుంది.

కానీ ఇది పూర్తిగా సురక్షితం కాదు. ఒక గంట పాటు కారు ఆపి ఏసీ వేస్తే.. ఇంజిన్ సామర్థ్యాన్ని బట్టి దాదాపు 0.2 లీటర్ల నుంచి 0.8 లీటర్ల పెట్రోల్ ఖర్చయ్యే అవకాశం ఉంది.
అంటే చిన్న కార్లలో అర లీటర్ లోపు, పెద్ద ఎస్‌యూవీల్లో దాదాపు ఒక లీటర్ వరకు పెట్రోల్ ఆవిరైపోతుంది. ఇలా గంటల తరబడి ఏసీ వేయడం వల్ల ఇంధనం వృధా అవ్వడమే కాకుండా కారు ఇంజిన్ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.
హైవేలపై ఏసీ వాడటం మంచిదేనా?
చాలామంది పెట్రోల్ ఆదా చేయడానికి హైవేలపై ఏసీ ఆపేసి కిటికీలు తెరుస్తారు. కానీ ఇక్కడే ఒక ట్రిక్ ఉంది. కారు 60-70 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్తున్నప్పుడు కిటికీలు తెరిస్తే.. లోపలికి వచ్చే గాలి వల్ల ఏరోడైనమిక్ డ్రాగ్ (గాలి ఒత్తిడి) పెరుగుతుంది. దీనివల్ల కారు ముందుకు వెళ్లడానికి ఇంజిన్ చాలా కష్టపడాలి. ఫలితంగా ఏసీ వేసినప్పటికంటే కిటికీలు తెరిచినప్పుడే ఎక్కువ పెట్రోల్ ఖర్చవుతుంది. కాబట్టి హైవేలపై వేగంగా వెళ్లేటప్పుడు కిటికీలు మూసి ఏసీ వేయడమే స్మార్ట్ డెసిషన్.

మైలేజీ పెంచుకోవడానికి చిట్కాలు
ఎండలో పార్క్ చేసిన కారులోకి వెళ్లగానే ఏసీ వేయకండి. ముందుగా కిటికీలు తెరిచి లోపల ఉన్న వేడి గాలిని బయటకు పంపండి. ఆ తర్వాత కిటికీలు మూసి ఏసీ ఆన్ చేయండి. దీనివల్ల క్యాబిన్ త్వరగా చల్లబడుతుంది. ఏసీపై లోడ్ తగ్గుతుంది.
అలాగే ఏసీ ఫిల్టర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం వల్ల కూడా మైలేజీ మెరుగుపడుతుంది. కారు సర్వీసింగ్ సకాలంలో చేయించడం, టైర్లలో గాలి ఒత్తిడి సరిగ్గా ఉండేలా చూసుకోవడం వల్ల కూడా మీ జేబుకు చిల్లు పడకుండా వేసవిలో ఏసీ ఎంజాయ్ చేయవచ్చు.


Click it and Unblock the Notifications








