ఇలా అయితే గూగుల్ మ్యాప్స్‌ను ఎలా నమ్మేది.. నమ్మినందుకు వంతెన పై నుంచి పడి ముగ్గురు మృతి
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్ది అన్ని పనులు కూడా ఈజీగా అయిపోతున్నాయి. ముఖ్యంగా తెలియని అడ్రస్‌ను కనుక్కోవడానికి గూగుల్ మ్యాప్స్ అందరికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే కొన్ని సార్లు టెక్నాలజీ కారణంగా నష్టాలు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా గూగుల్ మ్యాప్స్ తప్పిదం కారణంగా పెద్ద ప్రమాదం జరిగింది. దారి తప్పుగా చూపించడంతో ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిన ఘటన ఇటీవల చోటు చేసుకుంది. దీంతో ఇప్పుడు గూగుల్ మ్యాప్స్‌ను ఎలా నమ్మలా అని పలవురు పేర్కొంటున్నారు. ప్రపంచం అంతా కూడా కొత్త టెక్నాలజీ వైపు పరుగులు పెడుతుంది. రోజు రోజుకు కొత్త అధునాతన సాంకేతికతలను కనిపెడుతున్నారు. బాగా కష్టపడి చేసే పని ప్రస్తుతం టెక్నాలజీ సహయంతో కొద్ది క్షణాల్లోనే పూర్తవుతుంది. ఈ డిజిటల్ యుగంలో అందరూ కూడా స్మార్ట్ పనివిధానానికి అలవాటు పడిపోయారు. ఇంతటి డెవలప్‌మెంట్ ఉన్న కాలంలో కూడా ముగ్గురి ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం.
ఈ ప్రమాదం గురించిన పూర్తి వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు వ్యక్తులతో వెళ్తున్న ఒక కారు, నిర్మాణంలో ఉన్న వంతెనపై ప్రయాణించగా, ఇంకా అది పూర్తి కాకపోవడంతో వంతెన పై నుంచి కారు కింద పడిపోగా, దానిలో ఉన్న వారు మరణించారు. వీరంతా కూడా ఒక వివాహానికి హాజరు కావడానికి వెళ్తున్నారు.

ఇక్కడ కీలక విషయం ఏమిటంటే వీరు బరేలీలో వారి సంబంధికుల వివాహానికి హాజరు కావడానికి గురుగ్రామ్ నుంచి కారులో ప్రయాణాన్ని మొదలు పెట్టారు. ఈ క్రమంలో వారికి పెండ్లి మండపానికి సంబంధించిన రూట్ తెలియకపోవడంతో ఆ అడ్రస్‌ను గూగుల్ మ్యాప్స్‌లో టైప్ చేయగా అది చూపించన దారిలో వెళ్లడం మొదలుపెట్టారు. అయితే అలా వెళ్తున్న క్రమంలో మ్యాప్ ఒక నిర్మాణంలో ఉన్న వంతెన మార్గాన్ని చూపించింది.
దీంతో వారు అదే మార్గాన్ని అనుసరిస్తూ వెళ్లారు. అయితే వారికి తెలియని విషయం ఏమిటంటే ఆ వంతెన ఇంకా పూర్తి కాలేదు. దీంతో అదే దారిలో వెళ్లగా సగం వరకు పూర్తైన 50 అడుగుల ఎత్తైన వంతెనపై నుంచి రామగంగ నదిలో పడిపోయింది. కారు బలంగా క్రింద నెల భాగాన్ని తాకడంతో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. ఘటన జరిగిన తర్వాత రోజు ఉదయం 9.30 గంటలకు స్థానికులు ప్రమాదాన్ని గుర్తించారు.

ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు చేరవేయగా, వారు అక్కడికి చేరుకుని మృతుల గురించి ఆరా తీయగా, వారిలో ఇద్దరిని వివేక్, అమిత్‌గా గుర్తించారు. మూడో వ్యక్తి ఎవరనేది తెలియరాలేదు. పోలీసులు కారు లోపల చిక్కుకుని చనిపోయిన వారిని బయటకు తీసి పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబీకులకు సమాచారం అందించగా మృతదేహాలను చూసిన వారు బోరున విలపించారు.
ఈ ప్రమాదానికి బ్రిడ్జి నిర్మిస్తున్న అధికారులే కారణమని బాధిత కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు కూడా ఆరోపించారు. నిర్మాణంలో ఉన్న వంతెన పైకి ఎవరు రావద్దని హెచ్చరిక బోర్డులు, దారికి అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా, అలా ఎందుకు చేయలేదని వారు అధికారులను ప్రశ్నించారు. హెచ్చరిక బోర్డులు పెట్టినట్లయితే ఇంతటి దారుణం జరిగి ఉండేది కాదని వారంతా ప్రాణాలతో ఉండే వారని కుటుంబీకులు రోదించారు.

ఇంతటి నిర్లక్ష్యానికి పాల్పడిన సంబంధిత బ్రిడ్జి నిర్మాణ అధికారులపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు. ఈ ఘటనను బట్టి ఒక్క విషయం కచ్చితంగా గుర్తుంచుకోవాలి. టెక్నాలజీపై పూర్తిగా ఆధారపడకుండా ఉండాలని అర్థం అవుతుంది. గూగుల్ మ్యాప్స్ తప్పు దారి చూపించడం వలన గతంలో చాలా ప్రమాదాలు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








