నో పార్కింగ్ జోన్లో పార్క్ చేసిన కారు చోరీ అయితే ఇన్సూరెన్స్ వస్తుందా.. అసలు రూల్స్ ఏంటి ?
కారు దొంగతనం అయితే ఇన్సూరెన్స్ డబ్బు వస్తుందని చాలా మంది అనుకుంటారు. అయితే అది పూర్తిగా నిజం కాదు. ఒక్క చిన్న పొరపాటు కూడా మిమ్మల్ని సంవత్సరాల తరబడి కోర్టులు, ఆఫీసుల చుట్టూ తిరిగేలా చేస్తుంది. ఘజియాబాద్‌కు చెందిన పునీత్ అగర్వాల్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. 2003లో ఆయన కొత్త ఆల్టో కారు హరిద్వార్‌లో చోరీకి గురైంది.
20 ఏళ్లకు పైగా సుదీర్ఘ పోరాటం తర్వాత ఇప్పుడు ఆయనకు చోరీకి గురైన కారుకు సంబంధించిన డబ్బు అందింది. అయితే, ఆ మొత్తం ఎంత తక్కువగా ఉందంటే, దాంతో ఇప్పుడు ఒక పాత కారును కూడా కొనలేని పరిస్థితి. ఈ ఘటన బీమా క్లెయిమ్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన ఆవశ్యకతను గట్టిగా చెబుతుంది.

ఘజియాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక కీలక ఆదేశం జారీ చేసింది. కారు బీమా కోసం రూ.1.4లక్షలు, మానసిక క్షోభ, న్యాయపరమైన ఖర్చుల కోసం అదనంగా రూ.5,000కలిపి మొత్తం రూ.1.45లక్షలు పునీత్ అగర్వాల్‌కు చెల్లించాలని ఆదేశించింది. వాస్తవానికి, 2003లో కొన్న కారుకు 2025లో వచ్చిన ఈ మొత్తం ఇప్పుడు మార్కెట్లో కనీసం ఒక పాత కారును కొనుగోలు చేయడానికి కూడా సరిపోని పరిస్థితి.
పునీత్ 2003 మార్చి 10న ఆల్టో కారును కొనుగోలు చేశారు. అదే రోజు బీమా కూడా చేయించారు. అప్పుడు బీమా విలువ రూ.1.9లక్షలుగా ఉంది. 2003ఏప్రిల్ 6న హరిద్వార్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం హర్ కీ పౌడి వద్ద కారు చోరీకి గురైంది. స్థానిక పోలీసులు FIRనమోదు చేశారు. అంతేకాకుండా, బీమా కంపెనీకి, బ్యాంకుకు చోరీ సమాచారాన్ని తెలియజేశారు. జనవరి 2004నాటికి బీమా దావా కోసం అవసరమైన అన్ని పత్రాలను సమర్పించారు.

అయితే, బీమా కంపెనీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. అగర్వాల్ కారును సురక్షితమైన ప్రదేశంలో పార్క్ చేయలేదని సాకుతో ఆయన పిటిషన్ రిజెక్ట్ చేసింది. ఈ నిర్ణయం అగర్వాల్‌ను నిరాశపరిచింది. ఆయన పదేపదే బీమా కంపెనీకి లేఖలు రాసినా, ఎటువంటి సానుకూల స్పందన లభించలేదు. దీంతో ఆయనకు న్యాయపోరాటం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది.
బీమా కంపెనీ స్పందించకపోవడంతో, పునీత్ అగర్వాల్ DCDRCలో ఫిర్యాదు చేశారు. అయితే, మొదట్లో ఈ కేసు తమ పరిధిలోకి రాదని చెప్పి DCDRC ఈ ఫిర్యాదును తిరస్కరించింది. అగర్వాల్ వెనుకడుగు వేయలేదు. 2011లో ఆయన లక్నోలోని రాష్ట్ర కమిషన్లో ఈ తీర్పును సవాలు చేస్తూ అప్పీల్ చేశారు. సుదీర్ఘ విచారణ తర్వాత, 2025 ఫిబ్రవరిలో రాష్ట్ర కమిషన్ ఈ కేసును ఘజియాబాద్ కమిషన్ మళ్లీ చూడాలని ఆదేశించింది.

చివరగా 20ఏళ్లకు పైగా కొనసాగిన ఈ న్యాయపోరాటం తర్వాత, 2025 జూలైలో ఘజియాబాద్ కమిషన్ అగర్వాల్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కారు బీమా విలువలో 75శాతం అంటే రూ.1.43లక్షలు, మానసిక క్షోభ, లీగల్ ఖర్చుల కోసం రూ.5,000 కలిపి మొత్తం రూ.1.48లక్షలు చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని 45 రోజులలోపు చెల్లించకపోతే, బీమా కంపెనీ సంవత్సరానికి 6శాతం వడ్డీని కూడా అగర్వాల్‌కు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
2003లో రూ.1.9 లక్షలు అంటే అప్పట్లో ఒక కొత్త కారు కొనేంత డబ్బు. కానీ ఇప్పుడు 2025లో 5శాతం ద్రవ్యోల్బణం రేటు ప్రకారం చూస్తే, 2003 నాటి రూ.1.9 లక్షల విలువ దాదాపు రూ.5.56 లక్షలకు సమానం అవుతుంది. కానీ అగర్వాల్‌కు లభించింది కేవలం రూ.1.48 లక్షలు మాత్రమే. ఇది అసలు బీమా విలువలో 75శాతం మాత్రమే కాకుండా, ద్రవ్యోల్బణం లెక్కల్లో చాలా తక్కువ.
ఇంకా చెప్పాలంటే, 2003 మోడల్ కారు ఇప్పుడు భారత రోడ్లపై నడపడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే ఫిట్‌నెస్ సర్టిఫికేట్ సాధారణంగా 10-15 సంవత్సరాల తర్వాత గడువు ముగుస్తుంది. అంతేకాకుండా, 2022 తర్వాత పాత వాహనాలను స్క్రాప్ చేయాలని కొత్త నిబంధన వచ్చింది. కాబట్టి, వచ్చిన ఈ మొత్తం ఇప్పుడు కనీసం ఒక పాత కారును కొనుగోలు చేయడానికి కూడా సరిపోదు.
ఈ కేసు, సరైన పార్కింగ్ నియమాలను పాటించడం, బీమా పాలసీలోని షరతులను క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం, న్యాయపరమైన ప్రక్రియలను పట్టుదలతో కొనసాగించడం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. మన ఆస్తుల రక్షణకు మనం ఎంత అప్రమత్తంగా ఉండాలో ఇది ఒక స్పష్టమైన ఉదాహరణ.


Click it and Unblock the Notifications








