కేంద్రం గుడ్ న్యూస్.. కార్లు, బైకుల ధరలు.. ఇంతకు ముందు ఎలా ఉండేది..ఇప్పుడు ఎలా ఉండబోతున్నాయ్
భారతదేశంలో జీఎస్టీ పన్ను విధానాన్ని మారుస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం 12 శాతం, 28 శాతం అనే రెండు స్లాబ్‌లను తొలగించారు. ఇకపై కేవలం 5 శాతం, 18 శాతం స్లాబ్‌లు మాత్రమే ఉండనున్నాయి. ఈ మార్పు వాహనాల ధరలను నేరుగా తగ్గించడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
భారతదేశంలో చాలా ఆటోమొబైల్స్‌పై ప్రస్తుతం 28 శాతం జీఎస్టీ పన్ను విధిస్తున్నారు. లగ్జరీ వాహనాలపై అదనపు సెస్ కూడా ఉంటుంది. అయితే, ఎలక్ట్రిక్ వాహనాలపై మాత్రం 5 శాతం పన్ను మాత్రమే ఉంది. తాజాగా జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్ను రేట్లను తగ్గించారు.
దీని ప్రకారం సెప్టెంబర్ 22 నుంచి చాలా వస్తువులపై 5 శాతం, 18 శాతం పన్ను మాత్రమే అమలులో ఉంటుంది. సిగరెట్, మద్యం వంటి లగ్జరీ వస్తువులపై 40 శాతం పన్ను విధించబడుతుంది. ఈ మార్పు భారతదేశంలో వాహనాల ధరలను గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది.

టూ-వీలర్స్‌పై ప్రభావం
టూ-వీలర్స్ విషయానికి వస్తే, 350 సీసీ కంటే తక్కువ కెపాసిటీ ఉన్న వాటికి జీఎస్టీ పన్ను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. అయితే, 350 సీసీ కంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న వాహనాలకు 40 శాతం జీఎస్టీ పన్ను వర్తిస్తుంది. గతంలో ఉన్న సెస్ పన్నులను కూడా తొలగించారు.
కార్లపై ప్రభావం
ప్రస్తుతం మీరు రూ. 10 లక్షల కారు కొంటే, దానిపై పన్ను రూపంలో రూ. 2.8 లక్షలు చెల్లిస్తారు. ఇకపై చాలా వాహనాలకు పన్ను 18 శాతానికి తగ్గింది. అంటే, రూ. 10 లక్షల కారుకు కేవలం రూ. 1.8 లక్షలు మాత్రమే పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మార్పు వల్ల ప్రస్తుతం రూ. 10 లక్షల ధర ఉన్న కార్ల ధర రూ. లక్ష వరకు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. అందువల్ల సెప్టెంబర్ 22 తర్వాత భారతదేశంలో వాహనాల ధరలు గణనీయంగా తగ్గుతాయి.
ఎలక్ట్రిక్ వాహనాలపై 5 శాతం జీఎస్టీ పన్ను యథావిధిగా కొనసాగుతుందని భావిస్తున్నారు. కాబట్టి వాటి ధరల్లో ఎలాంటి మార్పు ఉండదు. అయితే, పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్, సీఎన్‌జీ వాహనాల ధరలు మాత్రం గణనీయంగా తగ్గుతాయి. పెద్ద కార్లపై అదనపు సెస్ పన్ను విధిస్తారా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ విషయాలన్నీ రేపు (అంటే సెప్టెంబర్ 23న) అధికారికంగా వెలువడే అవకాశం ఉంది.

లగ్జరీ వాహనాలపై 40 శాతం పన్ను విధించారు. ప్రస్తుతం కూడా లగ్జరీ కార్లపై దాదాపుగా ఇదే స్థాయిలో పన్నులు ఉన్నాయి. అందుకే లగ్జరీ వాహనాల ధరల్లో పెద్దగా మార్పు ఉండదని భావిస్తున్నారు. కొన్ని రకాల వాహనాల ధరలు పెరిగే అవకాశం కూడా ఉంది.
ప్రతి వాహనానికి ఎంత జీఎస్టీ విధిస్తారనే పూర్తి వివరాలు రేపే విడుదలయ్యే అవకాశం ఉంది. లగ్జరీ వాహనాల ధరలు మాత్రమే పెరిగే అవకాశం ఉంది. అయితే, భారతదేశంలో ఎక్కువగా అమ్ముడయ్యే చాలా వాహనాల ధరలు గణనీయంగా తగ్గుతాయి. దీపావళికి ఈ ప్రకటన వస్తుందని భావించినప్పటికీ, ముందే రావడం వాహన తయారీ కంపెనీలకు సంతోషాన్ని ఇచ్చింది.


Click it and Unblock the Notifications








