కారు వెనుక అద్దంపై ఆ గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా.. డిజైన్ కోసం కాదు అవి ప్రాణాలను కాపాడతాయి
రోజూ కారులో ప్రయాణిస్తుంటే కారు వెనుక అద్దంపై సన్నని, సమాంతర గీతలు చాలా చూసే ఉంటారు. వాటిని చూసినప్పుడు అవి కేవలం డిజైన్ కోసమే ఉన్నాయని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు.. ఆ గీతలు కేవలం అందం కోసం కాదు, మీ డ్రైవింగ్ భద్రతకు అవి చాలా ముఖ్యమైనవి.
అవి కారులో ఉండే ఒక స్పెషల్ ఫీచర్. వర్షం పడినప్పుడు లేదా పొగమంచు పట్టినప్పుడు అవి డ్రైవర్‌కు ఎలా సహాయపడతాయో, ఎలాంటి ప్రమాదాల నుంచి మనల్ని కాపాడతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

కారు వెనుక అద్దంపై ఉండే ఆ సన్నని గీతలను డిఫాగర్ లైన్లు అని పిలుస్తారు. మీరు వాటిని కేవలం అలంకరణ కోసమే అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే ఈ లైన్లు మామూలువి కావు, ఇవి మెటల్‌తో తయారు చేయబడతాయి. వీటి రూపకల్పనలో అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యం ఉంటుంది.
ఈ డిఫాగర్ లైన్ల ముఖ్యమైన పని వాతావరణం అస్పష్టంగా ఉన్నప్పుడు కనిపిస్తుంది. ఉదాహరణకు, వర్షం పడినప్పుడు లేదా పొగమంచు ఎక్కువగా ఉన్నప్పుడు కారు వెనుక అద్దంపై నీటి బిందువులు లేదా మంచు పేరుకుపోతుంది. దీనివల్ల డ్రైవర్‌కు వెనుక వైపు స్పష్టంగా కనిపించదు. ఈ డిఫాగర్ లైన్లు అలాంటి సమయంలో అద్దంపై నీటి బిందువులు, పొగమంచు పేరుకోకుండా చూసుకుంటాయి.

దీనివల్ల డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవర్‌కు వెనుక వైపు అంతా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే, ఇవి ఎల్లప్పుడూ పనిచేయవు. డ్రైవర్‌కు అవసరం వచ్చినప్పుడు మాత్రమే వీటిని ఆన్ చేయడానికి కారు లోపల ఒక స్విచ్ ఉంటుంది.
మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు, డిఫాగర్ లైన్లు పూర్తిగా మెటల్‌తో తయారు చేయబడి ఉంటాయి. వీటిని కంట్రోల్ చేసే స్విచ్ కారు డ్యాష్‌బోర్డ్‌లో, డ్రైవర్‌కు అందుబాటులో ఉంటుంది. డ్రైవర్‌కు వెనుక అద్దం ద్వారా ఏమీ కనిపించడం లేదని అనిపించినప్పుడు, అతను డిఫాగర్ స్విచ్‌ను ఆన్ చేస్తాడు.

ఈ స్విచ్ ఆన్ చేయగానే, మెటల్ లైన్లు వేడెక్కడం మొదలుపెడతాయి. ఈ వేడి వల్ల కారు వెనుక అద్దంపై పేరుకున్న పొగమంచు లేదా వర్షపు చినుకులు ఆవిరైపోతాయి లేదా ఆరిపోతాయి. ఫలితంగా, అద్దం మళ్లీ స్పష్టంగా మారిపోతుంది, డ్రైవర్‌కు వెనుక వైపున ఉన్న వాహనాలు, రోడ్డు, ఇతర అడ్డంకులు అన్నీ క్లియర్‌గా కనిపిస్తాయి.
వర్షం, పొగమంచు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ డిఫాగర్ లైన్లు లేకపోతే, వెనుక నుండి వచ్చే వాహనాలు, లేదా ఇతర అడ్డంకులు డ్రైవర్‌కు సరిగా కనిపించవు. ఇది చాలా తీవ్రమైన రోడ్డు ప్రమాదాలకు దారితీయవచ్చు. ఉదాహరణకు, వెనుక నుంచి వచ్చే వాహనాలను చూడకుండా లేన్ మారడం లేదా పార్క్ చేయడం వంటివి ప్రమాదకరంగా మారతాయి.
అందుకే, కారు వెనుక అద్దంపై ఉండే ఈ సన్నని లైన్లు మనల్ని పెద్ద ప్రమాదాల నుంచి కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇది ఒక చిన్న ఫీచరే అయినా, డ్రైవింగ్ భద్రతకు ఇది చాలా పెద్ద సహాయం చేస్తుంది. అందుకే కంపెనీలన్నీ ఈ ఫీచర్ అందజేస్తున్నాయి.


Click it and Unblock the Notifications








