ఎలక్ట్రిక్ వాహనాల వడ్డీపై డిస్కౌంట్.. రూ. 1.50 లక్షల వరకు సేవ్ చేయండిలా!!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకోవడంతో, ఆదాయపు పన్ను రిటర్న్ లను దాఖలు చేసేటప్పుడు మరింత ఆదా చేయడం, ఉత్తమ ప్రయోజనం పొందడం ఎలా అనే దానిపై పన్ను చెల్లింపుదారుల్లో ఆందోళన పెరుగడం సర్వసాధారణం. ఆదాయపు పన్ను చట్టంలోని కొన్ని క్లాజులు రిటర్న్ ఫైల్ చేసేవారికి పన్ను మినహాయింపును అందిస్తున్నప్పటికీ, వాహన సంబంధిత రుణం కొనుగోలు చేయడం వల్ల వారికి ఎలాంటి ఉపశమనం కేంద్ర పన్నుల శాఖ కల్పించదు.
అయితే, ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే వారికి కేంద్రం వెసులుబాటు కల్పించనుంది. దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీని ప్రోత్సహించడానికి, కేంద్ర ప్రభుత్వం IT చట్టం, 80EEBకి కొత్త సెక్షన్ ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా EVని కొనుగోలు చేయడానికి రుణం పొందుతున్న ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులు రూ.1.5 లక్షల వరకు ప్రయోజనాలను పొందవచ్చు. దాని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..

ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును పెంచేందుకు..
EV కొనుగోలుదారులు IT చట్టంలోని సెక్షన్ 80EEB ప్రకారం వాహన రుణాలకు చెల్లించే వడ్డీపై రూ.1.5 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. అందుకోసం ప్రత్యేక సెక్షన్ ను కేంద్రం ప్రకటించింది. దీని కారణంగా పన్ను చెల్లింపు దారులకు కాస్త ఉపశమనం లభించనుంది. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ఊతం ఇచ్చేందుకు వాటి వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.
80EEB అంటే ఏమిటి?
80EEB అనేది ఆదాయపు పన్ను చట్టంలోని ఒక విభాగం. ఇది ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేసేందుకు వాహన రుణాల ద్వారా వినియోగదారుడు పొందే మినహాయింపు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. ఈ సెక్షన్ వ్యక్తిగత పన్ను చెల్లింపుదారురుడు EV కొనుగోలు చేయడానికి తీసుకున్న వాహన రుణంపై వేసే వడ్డీలో దాదాపు రూ.1.5 లక్షల వరకు తగ్గించుకునేందుకు అనుమతిస్తుంది.
ఈ సెక్షన్ కింద, ప్రతి పన్ను చెల్లింపుదారుడు ఒక అసెస్‌మెంట్ సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే గరిష్టంగా రూ. 1.5 లక్షల తగ్గింపును క్లెయిమ్ చేయవచ్చు. కేవలం వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. కంపెనీలు లేదా వ్యాపారాలకు ఈ సెక్షన్ వర్తించదు. అలానే వ్యక్తిగత ఉపయోగం కోసం మాత్రమే ఈ వాహనాలను ఉపయోగించాల్సి ఉంటుంది. లేని యెడల ఈ రాయితీ లభించదు.

2019 నుంచి మార్చి-2023 మధ్య వాహనాలకు మినహాయింపు..
ఈ రాయితీని పొందాలి అనుకునే వారు వాహనాన్ని రుణం రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇతర మార్గాల్లో EV కార్లను కోనుగోలు చేస్తే ఎలాంటి మినహాయింపు ఉండదు. 1 ఏప్రిల్ 2019 నుంచి 31 మార్చి 2023 మధ్య వాహనాన్ని కొనుగోలు చేసి ఉండాలి. ఈ మధ్య కాలంలో తీసుకున్న వెహికిల్స్ కి మాత్రమే పన్ను నుంచి మినహాయింపు లభిందనుంది.
వ్యాపార వినియోగం కోసం ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలుదారు ఉపయోగిస్తే వారికి కూడా వడ్డీ మినహాయింపు లభించనుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో వాహన రుణంపై చెల్లించే వడ్డీ రూ.1.5 లక్షల మించి ఉంటే దానిని వ్యాపార వ్యయంగా చూపవచ్చు. దీనికోసం వ్యాపార యజమాని పేరు మీద కారు నమోదు చేయబడాలి అలా చేస్తే రుణం నుంచి వడ్డీ మినహాయింపు అందుతుంది. ఇందుకోసం సదరు వాహన కోనుగోలు దారుడు గుర్తింపు పొందిన బ్యాంక్ లేదా NBFC వంటి ఆర్థిక సంస్థల నుంచి మాత్రమే వాహన రుణం తీసుకోవాలి.
వడ్డీ మినహాయింపు లెక్కల్లో..
సెక్షన్ 80EEB ప్రకారం గరిష్ఠ వడ్డీ మినహాయింపు పరిమితిని సంవత్సరానికి రూ.1.5 లక్షలుగా కేంద్రం నిర్ణయించింది. IT చట్టంలోని నిబంధన ప్రకారం తదుపరి కొనుగోలుపై ఈ క్లెయిమ్ ను పొందలేదు. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లింపుదారులకు ఒకసారి మాత్రమే మినహాయింపు లభిస్తుంది. మొదటిసారి EVని కొనుగోలు చేసిన కొనుగోలుదారులకు మాత్రమే ఈ మినహాయింపు ఉంటుంది. ఈ ప్రయోజనం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, కార్లకు అందుబాటులో ఉంది.
ఉదాహరణకు మీరు రూ.20 లక్షల విలువ చేసే ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశారు అనుకోండి. రిజిస్టర్డ్ చేయబడిన బ్యాంక్ లేదా NBFC నుంచి ఈ వాహనాన్ని కొనుగోలు చేయడానికి సంవత్సరానికి 10 శాతం వడ్డీ రేటుతో ₹20 లక్షల వాహన రుణం పొందినట్లయితే మీరు చెల్లించాల్సిన వడ్డీ రూ. 2 లక్షలు అవుతుంది. సెక్షన్ 80EEB కింద, మీరు రుణదాతకు చెల్లించే రూ. 2 లక్షల వడ్డీపై రూ.1.5 లక్షల మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. అంటే మీకు రూ. 1.5 లక్షలు మినహాయింపు పోగా... రూ.50,000 పన్ను పరిధిలోకి వస్తుంది.


Click it and Unblock the Notifications








