ఫాస్ట్‌ట్యాగ్ విధానానికి మంగళం పాడనున్న కేంద్రం.. త్వరలో కొత్త విధానం అమలు
భారతదేశంలో రోజురోజుకి వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది. ఈ కారణంగా రహదారులపైన వాహనాల రద్దీని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం టోల్ గేట్ ల వద్ద వాహనాలు ఆగకుండా వెళ్లడానికి ఫాస్ట్‌ట్యాగ్ విధానం అమలులోకి తీసుకువచ్చింది. ఈ ఫాస్ట్‌ట్యాగ్ విధానాన్ని వాహన వినియోగదారులు అవలంబించడానికి చాలా సమయం పట్టింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ ఫాస్ట్‌ట్యాగ్ విధానానికి కేంద్ర ప్రభుత్వం మంగళం పాడాలనుకుంటోంది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

నివేదికల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్‌ట్యాగ్ విధానాన్ని రద్దు చేసి, జీపీఎస్ ఆధారిత టోల్ ట్యాక్స్ వసూలు విధానాన్ని ప్రారంభించాలని యోచిస్తోంది. ఇప్పటికే భారతీయ రోడ్డు మరియు రహదారుల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా దీని గురించి ప్రస్తావించారు. కావున దీనిని త్వరలోనే అమలులోకి వచ్చే అవకాశం ఉంది.

భారత ప్రభుత్వం ఇప్పటికే ఈ జిపిఎస్ విధానాన్ని భారతీయ రహదారులపై పరీక్షిస్తోంది. అయితే ఈ విధానం ఎప్పుడు ఎక్కడ ప్రారభమవుతోందో ఖచ్చితంగా తెలియదు. దీని గురించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

త్వరలో అందుబాటులోకి రానున్న జిపిఎస్ విధానం ఎలా పనిచేస్తుంది:
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో త్వరలో జిపిఎస్ ఆధారిత సేవలు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ విధానం అమలులోకి వచ్చిన తరువాత వినియోగదారుడు వాహనాన్ని రోడ్డుపైన నడిపే దూరాన్ని బట్టి టోల్ వసూలు చేయడం జరుగుతుంది. అంటే వాహనదారుడు ఎక్కువ దూరం హైవేలలో ప్రయాణిస్తే అంత టోల్ ఛార్జ్ వసూలుచేయడం జరుగుతుంది.

ఇప్పటికే కొన్ని ఇతర దేశాల్లో జిపిఎస్ ఆధారిత టోల్ చార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ విధానం త్వరలో మనదేశంలో కూడా విస్తరిస్తుంది. ఐరోపా వంటి దేశాల్లో ఇది అద్భుతమైన విజయం సాధించడంతో భారత ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని మనదేశంలోని రోడ్లపై కూడా అమలు చేయాలని యోచిస్తోంది. అయితే మనదేశంలో ఇది ఎంతవరకు విజయవంతం అవుతుందో తెలుసుకోవడానికి కొంతకాలం వేచి చూడాలి.

జిపిఎస్ సిస్టం ప్రారంభమైన తరువాత వాహనదారుడు రోడ్డుపైన ఎంత దూరం ప్రయాణించాడు అనేది రికార్డ్ చేయబడుతుంది. అయితే ఇది ఎక్స్‌ప్రెస్‌వేలో ప్రయాణించిన దూరాన్ని బట్టి టోల్ వసూలు చేయడం జరుగుతుంది. ఇది వాహన వినియోగదారులకు కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వం మొదట్లో ఫాస్ట్‌ట్యాగ్ విధానం ప్రారంభించినప్పుడు అది భవిష్యత్ లో కూడా కొనసాగుతుందని, కావున ఇది తప్పనిసరిగా అందరూ వినియోగించాలని తెలిపింది. ఫాస్ట్‌ట్యాగ్ అనేది పార్కింగ్ స్థలాల వద్ద కూడా చెల్లింపులు చేయడానికి ఉపయోగించబడవచ్చు. ఈ ఫాస్ట్‌ట్యాగ్ విధానం వల్ల దేశంలో చాలా వరకు టోల్ గేట్ల వద్ద వేచి ఉండాల్సిన సమయం తగ్గింది. తద్వారా టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ చాలా తగ్గింది.

జిపిఎస్ విధానం చాలా లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా నిర్వహించబడుతుంది. కావున ఇందులో ఎలాంటి అవకతవకలు జరిగే అవకాశం ఉండదు. ప్రస్తుతం అమలులో ఉన్న ఫాస్ట్ ట్యాగ్ ద్వారా ఫీజులు వసూలు చేసేందుకు కొన్ని టెక్నీకల్ ప్రాబ్లమ్స్ కూడా ఎదుర్కోవలసి వస్తోంది. ఈ కారణాల వల్ల టోల్ గెట్ వద్ద కొంత సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంటోంది. కానీ జిపిఎస్ విధంగా వీటన్నింటికి చరమగీతం పాడనుంది.


Click it and Unblock the Notifications








