Chandrayaan-3 చంద్రుడిపై విజయవంతంగా అడుగుపెట్టిన చంద్రయాన్ 3
చంద్రుడి దక్షిణ ధ్రువంపై భారత కీర్తి పతాకాన్ని సగర్వంగా ఎగురవేసే చారిత్రక ఘట్టం నేడు విజయవంతంగా పూర్తయింది. ఇప్పటివరకు ఏ దేశం సాధించని అరుదైన ఘనతను భారతదేశం సొంతం చేసుకుంది. 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత చంద్రయాన్ 3 దిగ్విజయంగా ఈ సాయంత్రం 6.04 నిమిషాలకు చందమామ దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టింది. ఈ మేరకు ఇస్రో అధికారికంగా ప్రకటించింది.
చంద్రుడిని చేరుకునేందుకు ఇస్రో(భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) చేపట్టిన చంద్రయాన్ 3(Chandrayaan-3) ప్రయాణం 41 రోజులు సాగింది. జూలై 14న శ్రీహరికోట నుంచి మధ్యాహ్నం 2.35 నిమిషాలకు LVM3-M4 రాకెట్ ద్వారా ఇస్రో(ISRO) చంద్రయాన్ 3 ప్రయోగం చేపట్టింది. జాబిల్లిని చేరుకోవడానికి ఇస్రో చేపట్టిన పలు విన్యాసాలు ఈ ప్రాజెక్టులో ఎంతో కీలకం.

భూమి చుట్టూ కక్ష్య పెంపు, చంద్రుడి చుట్టూ కక్ష్య తగ్దింపు విన్యాసాలను విజయవంతంగా చేపట్టి విక్రమ్ ల్యాండర్‌ను చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువ చేసింది. సాఫ్ట్ ల్యాండింగ్‌కు ఉత్కంఠగా మారిన చివరి 17 నిమిషాల్లో జాబిల్లి దక్షిణ ధ్రువంపై సుమారు 70 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసి ఇస్రో చరిత్ర సృష్టించింది.
కాగా చందమామపై పగలు ఉంటే భూమిపై 14 రోజులతో సమానం. చంద్రుడిపై పగలు మొదలయ్యే సమయంలోనే చంద్రయాన్ 3 ని సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలని ఇస్రో భావించింది. ఈ పద్నాలుగు రోజులు అక్కడ సూర్యరశ్మి కారణంగా ల్యాండర్, రోవర్‌కు కావాల్సిన సౌరశక్తి అందుతుందని ఇస్రో తెలిపింది. ల్యాండింగ్ ప్రక్రియ సజావుగా ల్యాండర్ లోపలి నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వస్తుంది.

సైడ్ ప్యానళ్లను ర్యాంప్‌గా ఉపయోగించుకుంటూ జాబిల్లి ఉపరితలంపైకి చేరుకుంటుంది. అక్కడ 14 రోజులపాటు పరిసర ప్రాంతాల్లో వివిధ రకాల అధ్యయనాలు చేస్తుంది. ఇంకా అక్కడికక్కడే రసాయనిక విశ్లేషణలు చేపడుతుంది. చంద్రుడిపై చీకటి ఉన్న సమయంలో ఈ ల్యాండింగ్ జరిగితే పరిశోధనలకు విద్యుత్ సరఫరా ఉండదు కాబట్టి పగటి సమయంలోనే ఇస్రో ఈ ల్యాండింగ్ ప్రక్రియ చేపట్టింది.
ప్రక్రియ ఎలా సాగింది: బుధవారం సాయంత్రం 5.44 గంటల సమయంలో కక్ష్యలోని నిర్ధారిత ప్రదేశానికి ల్యాండర్ మోడ్యూల్ చేరుకోగానే ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్ (ALS) ను ప్రారంభించారు. ఆ మేరకు ALS కమాండ్స్‌ను అందుకోగానే, ల్యాండర్ లోని నాలుగు ఇంజిన్లు యాక్టివేట్ అయ్యాయి. ఈ ఇంజిన్లు రెట్రో ఫైరింగ్ ద్వారా ల్యాండర్ వేగాన్ని తగ్గించాయి. దీన్ని పవర్డ్ బ్రేకింగ్ ఫేజ్‌గా పిలుస్తారు.

ఇదే సమయంలో చంద్రుడికి సమాంతరంగా ప్రయాణిస్తున్న ల్యాండర్ మోడ్యూల్ చంద్రుడిపై నిట్ట నిలువుగా దిగడానికి వీలుగా దిశను మార్చుకుంది. 30 కి.మీల ఎత్తు నుంచి 6.8 కిమీల ఎత్తులోకి చేరుకోగానే, నాలుగు ఇంజిన్లలో రెండింటిని ఆపేశారు. చంద్రుడికి 150 నుంచి 100 మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు ల్యాండర్ మాడ్యూల్‌లోని సెన్సార్స్, కెమెరాలు యాక్టివేట్ అయ్యాయి. సేఫ్ ల్యాండింగ్ కోసం అనువైన ప్రదేశాన్ని గుర్తించే పని ప్రారంభించాయి.
ల్యాండింగ్‌కు అనువైన ప్రదేశాన్ని గుర్తించగానే, వేగాన్ని పూర్తిగా నియంత్రించుకుని నెమ్మదిగా చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టింది. ఈ మొత్తం ప్రక్రియలో ఇది అత్యంత క్లిష్టమైన దశగా ఇస్రో పేర్కొంది. విజయవంతంగా ల్యాండ్ అయిన తరువాత, ల్యాండర్ సైడ్ ప్యానెల్ నుంచి.. ర్యాంప్ ద్వారా రోవర్ చంద్రుడిపై ప్రయాణం ప్రారంభిస్తుంది.

ఇస్రో ప్రధానంగా మూడు లక్ష్యాలతో చంద్రయాన్ 3 ప్రయోగాన్ని చేపట్టింది. మొదటిది చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండ్ చేయడం, రెండోది చంద్రుడి ఉపరితలంగా చెప్పుకునే రెగోలిత్ మీద రోవర్ దిగి, సంచరించడం. ఇక మూడోది ల్యాండర్, రోవర్‌లు కలసి చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు చేయడం.. ఈ మూడు లక్ష్యాలతో చంద్రయాన్ 3 ని ప్రయోగించింది. అందులో మొదటిది దిగ్విజయంగా పూర్తయింది.
చంద్రయాన్ 2 ల్యాండింగ్ సమయంలో తలెత్తిన సాంకేతిక సమస్యలను దృష్టిలో ఉంచుకుని, చంద్రయాన్-3ని మరింత సమర్థంగా ఇస్రో తీర్చిదిద్దిం. చంద్రయాన్-2 ల్యాండర్ మాడ్యూల్‌ను సక్సెస్ బేస్డ్‌గా డిజైన్ చేసింది. కానీ చంద్రయాన్-3ని మాత్రం ఫెయిల్యూర్ బేస్డ్ అనాలసిస్‌తో రూపొందించామని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు.
చంద్రయాన్ 2 డేటాను విశ్లేషణ చేసుకుని, ఎలాంటి అవాంతరాలు ఏర్పడతాయో ముందుగానే ఊహించి, దానికి అనుగుణంగా ల్యాండర్ మాడ్యూల్ నిర్ణయాలు తీసుకున్నారు. చంద్రయాన్ 3 దిగ్విజయంగా జాబిల్లిపై అడుగుపెట్టేలా అనేక కీలక దశలను దాటుకుని ముందుకు సాగేలా ఇస్రో సైంటిస్టులు ఈ ప్రాజెక్టును రూపొందించారు.
చంద్రయాన్ 3 ప్రాజెక్టులో ల్యాండర్ మాడ్యూల్‌ను చంద్రుడి దక్షిణ ధ్రువానికి దగ్గరగా నాలుగు కిలోమీటర్ల పొడవు, 2.4 కిలోమీటర్ల వెడల్పు ఉన్న అనువైన ప్రాంతాన్ని ముందుగానే గుర్తించారు. అక్కడ సమతలంగా ఉన్న ప్రదేశంలోనే విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండ్ అయ్యేలా ఏర్పాటు చేశారు.
సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఏడు రకాల అత్యాధునిక పరికరాలను విక్రమ్ ల్యాండర్‌లో అమర్చారు. ఇలా చంద్రయాన్ 2 వైఫల్యాలను దృష్టిలో ఉంచుకుని ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడంతోనే.. చంద్రయాన్-3 ల్యాండర్ సురక్షితంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన తొలి ప్రోబ్‌గా చరిత్ర సృష్టించింది.


Click it and Unblock the Notifications








