Chandrayaan -3 చంద్రుడిపై మరోసారి సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ఇస్రో.. ఇందుకోసమేనా..?
ప్రపంచంలోని ఏ దేశమూ వెళ్లని చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండ్ చేసి భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చరిత్ర సృష్టించింది. ఆగస్టు 23న సాయంత్రం 6.04 నిమిషాలకు చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్ చరిత్రలో నిలిచింది. అలాగే చంద్రుడిపై ఇతర ప్రాంతాల్లో అమెరికా, రష్యా, చైనా సాఫ్ట్ ల్యాండింగ్ చేశాయి.
అయితే సెప్టెంబర్ 3న (ఆదివారం) ఇస్రో మరో కీలక పరీక్ష చేపట్టింది. దీన్ని హాప్ ఎక్స్‌పరిమెంట్‌గా పిలుస్తోంది. ఇందులో భాగంగా విక్రమ్ ల్యాండర్ ఇంజిన్లను మండించి, సుమారు 40 సెంటీ మీటర్ల ఎత్తు, 30-40 సెంటీమీటర్ల దూరంలో మరోసారి సురక్షితంగా ల్యాండింగ్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలను ఇస్రో షేర్ చేసింది.

చంద్రుడిపై నుంచి కొన్ని శాంపిల్స్, మానవ సహిత యాత్రలకు హాప్ ఎక్స్‌పరిమెంట్ ప్రోత్సాహం ఇస్తుందని ఇస్రో భావిస్తోంది. మరోసారి ల్యాండింగ్ తర్వాత కూడా విక్రమ్ ల్యాండర్‌లోని అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయని ఇస్రో వెల్లడించింది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
జూలై 14న యావత్ భారతావని ఆశలను మోసూ ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్ సుమారు 40 రోజుల ప్రయాణం అనంతరం ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపైన ల్యాండింగ్ అయింది. అనంతరం 4 గంటల తర్వాత విక్రమ్ ల్యాండర్‌లోని ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడిపైకి వచ్చి, వివిధ రకాల పరిశోధనలు చేసింది.
సుమారు రెండు వారాల పాటు చంద్రుడిమీద 100 మీటర్ల దూరం ప్రయాణించినట్లు ఇస్రో వెల్లడించింది. చంద్రుడి ఉపరితలంపై సల్ఫర్, ఆక్సిజన్ సహా ఇతర మూలకాలు ప్రజ్ఞాన్ రోవర్ గుర్తించినట్లు తెలిపింది. దాంతోపాటు చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతల్లో మార్పులను కూడా గుర్తించినట్లు తెలిపింది.
చంద్రుడి మీద పగటి సమయం ముగిసి రాత్రి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజ్ఞాన్ రోవర్‌లోని పేలోడ్‌లను ఆఫ్ చేసి, స్లీప్‌మోడ్‌లోకి పంపినట్లు ఇస్రో తెలిపింది. సురక్షితమైన ప్రాంతంలో ఉంచి, శనివారం రాత్రి స్లీప్‌మోడ్‌లోకి పంపినట్లు ఇస్రో పేర్కొంది. సెప్టెంబర్ 22న చంద్రుడిపై పగలు ప్రారంభం అవుతుందని, మళ్లీ రోవర్ పనిచేసేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది.
హాప్ ఎక్స్‌పరిమెంట్ తర్వాత విక్రమ్ ల్యాండర్ పేలోడ్‌లను కూడా ఆఫ్‌చేసినట్లు ఇస్రో వెల్లడించింది. కేవలం రిసీవర్ ఒక్కటే ఆన్‌చేసి పెట్టినట్లు తెలిపింది. బ్యాటరీలు పూర్తిగా డిశ్ఛార్జి అయిన తర్వాత విక్రమ్ కూడా 8 గంటల తర్వాత స్లీప్‌మోడ్‌లోకి వెళ్తుందని ఇస్రో వెల్లడించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై రాత్రి వేళ ఉష్ణోగ్రత -180 డిగ్రీలకు పడిపోతుంది. అలాంటి పరిస్థితిలో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లోని వ్యవస్థలు డ్యామేజీ అయ్యే అవకాశం ఉంది.
ఇస్రో మాత్రం సెప్టెంబర్ 22 తర్వాత విక్రమ్, ప్రజ్ఞాన్‌లు పనిచేస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. పనిచేస్తే మరికొన్ని రోజులపాటు పరిశోధనలు చేయనుంది. లేకుండా చంద్రుడిపై భారత రాయబారిగా శాశ్వతంగా ఉండిపోతాయని ఇస్రో వెల్లడించింది. 2008 నుంచి చంద్రునిపై భారత అంతరిక్ష సంస్థ - ఇస్రో ప్రయోగాలు చేస్తోంది. అప్పట్లో చంద్రయాన్-1ను ప్రయోగించింది. అందులో భాగంగా ప్రయోగించిన మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ చంద్రుడిపై నీటి ఉనికి తొలిసారిగా కనుగొంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








