Chandrayaan 3 చంద్రయాన్-3 వెన్నెముక 'శాస్త్రవేత్త వీరముత్తువేల్' గురించి ఆసక్తికర విషయాలు
నేడు భారతదేశ అంతరిక్ష చరిత్రలో చరిత్రాత్మక రోజుగా నిలిచిపోనుంది. చంద్రుని రహస్యాలను ఛేదించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగానికి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట వేదిక అయింది. ఈ మిషన్‌పై ఇస్రో సహా యావత్ దేశం ఎన్నో ఆశలు పెట్టుకుంది.
చంద్రయాన్ 3 మిషన్ ద్వారా భారతదేశం సాధించబోయే ఘనత అందరికీ తెలుసు. కానీ ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరనేది చాలా మందికి తెలియదు. ఆ మాస్టర్ మైండ్ ఇస్రో శాస్త్రవేత్త పి. వీరముత్తువేల్. ఎవరీ వీరముత్తువేల్? ఆయన నేపథ్యం ఏమిటి? ఈ కథనంలో తెలుసుకుందాం.

డాక్టర్ పి. వీరముత్తువేల్ ఇస్రోలో సీనియర్ సైంటిస్ట్. చంద్రయాన్-3 ప్రాజెక్ట్ కోసం ఇస్రో ముగ్గురు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లను నియమించింది. ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా మోహన్ కుమార్‌ను నియమించగా.. రాకెట్ లాంచ్ డైరెక్టర్‌గా బిజు థామస్ నియమితులయ్యారు. చంద్రయాన్-3 అంతరిక్ష నౌక డైరెక్టర్‌గా డాక్టర్ పి. వీరముత్తువేల్‌ను ఇస్రో నియమించింది.
ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్. వీరముత్తువేల్ తమిళనాడులోని విల్లుపురం ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఇస్రోలో సీనియర్ శాస్త్రవేత్తగా ఆయన పలు ర్యాంకులు సాధించారు. చంద్రయాన్ 3 హెడ్ వీరముత్తువేల్ ప్రస్తుతం మూన్ మిషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హోదాలో ఉన్నారు. వీరముత్తువేల్ తండ్రి పేరు పళనివేల్.
వీరముత్తువేల్ తండ్రి విల్లుపురంలో రైల్వే శాఖలో టెక్నీషియన్‌గా పనిచేశారు. వీరముత్తువేల్ విల్లుపురం రైల్వే స్కూల్‌లో చదివారు. తర్వాత మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేశారు. అంతరిక్ష పరిశోధనలో ఉన్న ఆసక్తితో తాంబరం ఇంజనీరింగ్ కళాశాల నుంచి పట్టభద్రుడై తర్వాత చెన్నై IITలో చదివారు.
1989లో ఇస్రోలో శాస్త్రవేత్తగా చేరారు. ఆయన భారత్‌లో పాటు విదేశాలలో అనేక ఉద్యోగావకాశాలను పొందినా మరియు అంతరిక్ష పరిశోధనలపై ఉన్న ఆసక్తి కారణంగా ఇస్రోలోనే పనిచేస్తూ ఉన్నారు. ఆయన పనితీరు, ప్రతిభాపాటవాలు, నైపుణ్యాలు మెచ్చి ఇస్రో వీరముత్తువేల్‌ను చంద్రయాన్-3 మిషన్‌కు స్పేస్‌క్రాఫ్ట్ డైరెక్టర్‌గా నియమించింది.
కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా చంద్రయాన్-2 అంతరిక్ష నౌక చంద్రుడిపై ల్యాండ్ అవ్వలేదు. ఈ ప్రాజెక్ట్ విజయవంతం కాకపోవడంతో, చంద్రయాన్-3 ప్రాజెక్ట్ కోసం డైరెక్టర్లను మార్చారు. అప్పటి డైరెక్టర్ వనిత స్థానంలో చంద్రయాన్-3 వ్యోమనౌక తయారీకి ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా డాక్టర్ పి.వీరముత్తువేల్‌ను ఇస్రో నియమించింది.
చంద్రయాన్- 3 మిషన్‌కు బాధ్యత వహించడమే కాకుండా, చంద్రయాన్- 2 మిషన్‌లో వీరముత్తువేల్ కీలక పాత్ర పోషించారు. చంద్రయాన్-2 మిషన్‌కు సంబంధించి, వీరముత్తువేల్ నాసా శాస్త్రవేత్తలతో ఇంటరాక్ట్ అయ్యారు. ముఖ్యమైన సమాచారాన్ని సేకరించి ప్రాజెక్ట్‌కు తన సేవలందించారు. కానీ ఆ మిషన్ ఫెయిలవ్వడం యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
చంద్రునిపై నీటి జాడలు తెలుసుకునేందుకు చేపట్టిన చంద్రయాన్-2ను జూలై 22, 2019 న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రారంభించారు. కానీ సెప్టెంబర్ 6 తెల్లవారుజామున చంద్రునిపై విక్రమ్ లూనార్ ల్యాండర్ కూలిపోవడంతో మిషన్ విఫలమైంది. దీంతో మరో ప్రయోగానికి ఈ రోజు శ్రీకారం చుట్టారు.
చంద్రయాన్-3 ప్రాజెక్ట్ వెనుక సూత్రధారి వీరముత్తువేల్ గురించి మీడియాలో పెద్దగా కవరేజీ లేకపోయినా చంద్రయాన్-3 విజయవంతమైతే చాలా మంది సంబరాలు చేసుకోవడం ఖాయం. చంద్రయాన్-3 40 రోజుల పాటు అంతరిక్షంలో ప్రయాణించి చంద్రుడిని చేరుకోనుంది. ఆగస్ట్ 23 లేదా 24 తేదీల్లో, అంతరిక్ష నౌక చంద్రునిపైకి వెళ్లి అక్కడ ల్యాండ్ అవుతుంది.
విక్రమ్ ల్యాండర్ ప్రొపెల్లర్ మాడ్యూల్ లోపల నుంచి బయటకు వచ్చి చంద్రునిపై దిగుతుంది. ల్యాండింగ్ విజయవంతమైతే ప్రగ్యాన్ రోవర్ దాని అన్వేషణను ప్రారంభిస్తుంది. ల్యాండర్ మిషన్ జీవితకాలం ఒక చాంద్రమాన దినమని ఇస్రో అధికారులు పేర్కొన్నారు. అంటేల భూమి కాలమానంతో పోలిస్తే 14 రోజులు.


Click it and Unblock the Notifications








