ఇస్రో కీలక ప్రకటన.. చంద్రుడిపై మనిషి జీవించేందుకు అంతా అనుకూలమేనా..?
ఇప్పటి వరకు ఎవరూ వెళ్లని చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్‌ను ఇస్రో ఆగస్టు 23న విజయవంతంగా సాఫ్ట్ ల్యాండ్ చేసింది. దాంతో అప్పటి నుంచి వరసగా కీలక విజయాలను నమోదు చేస్తోంది. విక్రమ్ ల్యాండర్ లోపల ఉన్న ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై తిరుగుతూ కీలక పరిశోధనలు చేస్తోంది.
ఇప్పటి వరకు ఎవరూ ఊహించని విషయాలను బయటపెడుతోంది. ప్రారంభంలో చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతల వ్యత్యాసాన్ని విక్రమ్ ల్యాండర్‌లని చాస్టే పరికరం ఇప్పటికే గుర్తించింది. అయితే తాజాగా రోవర్‌లో ఉన్న LIBS పరికరం- లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ కీలక విషయాలను గుర్తించింది.

చంద్రుడి ఉపరితలంపై సల్ఫర్‌ను చాలా స్పష్టంగా గుర్తించిందని ఇస్రో తెలిపింది. దీంతోపాటు ఆక్సిజన్, అల్యూమినియం, కాల్షియం, ఐరన్, క్రోమియం, మాంగనీస్, టైటానియం, సిలికాన్ మూలకాలను ఈ పరికరం గుర్తించిందని ఇస్రో వెల్లడించింది. హైడ్రోజన్ కోసం చంద్రుడి ఉపరితలంపైన అన్వేషణ కొనసాగుతోందని ఇస్రో తెలిపింది.
LIBS పరికరాన్ని బెంగళూరులోని ఇస్రో లేబొరేటరీ ఫర్ ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్స్ అభివృద్ధి చేసింది. ఇది చంద్రుడి ఉపరితలంపైకి తీవ్రస్థాయిలో లేజర్ కిరణాలను ప్రసరిస్తుంది. ఫలితంగా అక్కడున్న మట్టి తీవ్రస్థాయిలో వేడెక్కి ప్లాస్మాను ఉత్పత్తి చేస్తుంది. అప్పుడు వచ్చిన సంకేతాలను విశ్లేషించడం ద్వారా ఆ మూలకాలను స్పెక్ట్రోమీటర్ గుర్తిస్తుంది.

అయితే ఈ మూలకాలన్నీ ఎంత పరిమాణంలో ఉన్నాయనే సమాచారం ఇంకా వెల్లడి కాలేదు. అయితే ఫలితాలు అన్ని ఇస్రో సెంటర్‌లో నిల్వ చేస్తున్నట్లు సమాచారం. ఒక్కో ప్రాంతంలో లభ్యమయ్యే ఆధారాలను విశ్లేషించి. సరైన సమాచారాన్ని శాస్త్రవేత్తలు అంచనా వేస్తారు. అప్పుడు ఓ అవగాహన వచ్చే అవకాశం ఉంది.
చంద్రుడిపై హైడ్రోజన్ ఆనవాళ్లు కూడా లభిస్తే.. అక్కడ నీటిని సృష్టించే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. నీటిని తయారుచేసుకోగలిగితే మనుషులు అక్కడ నివసించేందుకు అనువుగా మలచుకొనే అవకాశం ఉంటుంది. భూమిపై మానవులు నివసించే విధంగా చంద్రుడిపై నేరుగా నివాసం ఏర్పాటు చేసుకోలేనప్పటికీ.. మానవులు అవసరాలకు అనుగుణంగా పరిస్థితిని సృష్టించడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భూమి నుంచి చంద్రుడిపై తీసుకెళ్లలేని నీటి వంటి పదార్థాలను అక్కడ సమకూర్చుకోగలిగితే అది సాధ్యమవుతుంది.
ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండ్ అయింది. అనంతరం సరిగ్గా నాలుగు గంటల తర్వాత లోపలున్న ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపైన అడుగుపెట్టింది. ఇప్పటి 7 రోజులుగా రోవర్ సెకనుకు సెంటీమీటర్ వేగంతో ప్రయాణం చేస్తూ.. వివిధ రకాల విషయాలను వెలుగులోకి తీసుకొస్తోంది. మరో 7 రోజులపాటు పరిశోధనలు కొనసాగే అవకాశం ఉంటుంది.
అనంతరం 14 రోజులపాటు (లానార్ రాత్రి) చంద్రుడిపైన సూర్యకాంతి ప్రసరించదు. ఫలితంగా ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయి. ఫలితంగా విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లోని చాలా పరికరాలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. 14 రోజుల తర్వాత ల్యాండర్, రోవర్ డ్యామేజీ కాకుండా ఉంటే మరికొన్ని రోజులు పరిశోధనలు జరిగే అవకాశం ఉందని ఇస్రో భావిస్తోంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








